‘ల్యాండ్ పూలింగ్’పై డెవలపర్స్ తర్జనభర్జన | 'Land pooling' works out on the developers | Sakshi
Sakshi News home page

‘ల్యాండ్ పూలింగ్’పై డెవలపర్స్ తర్జనభర్జన

Published Mon, Sep 16 2013 4:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

‘ల్యాండ్ పూలింగ్’పై  డెవలపర్స్ తర్జనభర్జన

‘ల్యాండ్ పూలింగ్’పై డెవలపర్స్ తర్జనభర్జన

సాక్షి, సిటీబ్యూరో : హెచ్‌ఎండీఏ తాజాగా తలపెట్టిన భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) వల్ల తమకెంత ప్రయోజనం? అన్నదే ప్రస్తుతం భూ యజమానుల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న భూముల్లో తామే స్వయంగా వెంచర్ అభివృద్ధి చేసుకోవచ్చు గదా..! ఎంతో విలువైన ఈ భూములను హెచ్‌ఎండీఏకు అప్పగించాల్సిన అవసరమేంటి? అని పలువురు డెవలపర్స్ దీర్ఘాలోచనలో పడ్డారు. చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకొంటే అయ్యే ఖర్చు, హెచ్‌ఎండీఏకు భూములివ్వడం వల్ల వచ్చే లాభం... తదితరాలపై బేరీజు వేసుకొంటున్నారు.

అయితే.. ఈ స్కీంపై రెండుసార్లు సమావేశాలు నిర్వహించిన అధికారులు.. అభివృద్ధి చేసిన వెంచర్‌లో భూ యజమానులకు ఎంత భూమి ఇస్తారన్నది స్పష్టం చేయకపోవడం డెవలపర్స్‌ను ఆలోచనలో పడేసింది. ప్రాంతాన్ని బట్టి అది నిర్ణయిస్తామని చెప్పడం  అనుమానాలు రేకెత్తిస్తోంది. హెచ్‌ఎండీఏ ఆ ప్రాజెక్టును పూర్తిగా తమకు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఏ ప్రాంతంలో వెంచర్ వేస్తే తమకు ప్రయోజనం ఉంటుందన్న దానిపై డెవలపర్స్ తర్జనభర్జన పడుతున్నారు. ఒకవేళ హెచ్‌ఎండీఏ అందుకు అంగీకరించకపోతే దానికి సమీపంలోనే తాము అభివృద్ధి చేసే వెంచర్లను ఈ స్కీం కింద కన్వర్టు చేసుకొనేలా ప్రతిపాదన పెట్టాలని యోచిస్తున్నారు.

వాస్తవానికి ఔటర్ చుట్టూ ఉన్న భూములన్నీ తమ ఆధీనంలో ఉన్నందున ఈ స్కీం వల్ల తమకు లాభం లేకపోతే అడుగు పెట్టరాదని కొందరు డెవలపర్స్ భావిస్తున్నారు. రైతులు, డెవలపర్స్‌లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన హెచ్‌ఎండీఏ ఆదిలోనే అస్పష్ట విధానాలు ప్రకటించి అయోమయాన్ని మరింత పెంచడంతో ల్యాండ్ పూలింగ్ స్కీంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఈ స్కీం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది వేయి డాలర్ల ప్రశ్న. ఒకేచోట 200 ఎకరాల్లో అభివృద్ధి చేసే వెంచర్‌లోని ప్లాట్లను 6 నెలల్లో అమ్ముకోలేకపోతే తీవ్రంగా నష్టం చవిచూసే ప్రమాదం ఉందన్న వాదనలూ విన్పిస్తున్నాయి.

 సమగ్రత ఏదీ?

 మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయడం ద్వారా నగరం నలువైపులా సమగ్రాభివృద్ధిని సాధించాలన్న హెచ్‌ఎండీఏ ఆలోచనకు తానే అవరోధాలు కల్పిస్తోంది. ల్యాండ్ పూలింగ్ స్కీం వల్ల ఎక్కడ భూమి లభిస్తే అక్కడ కాలనీలు వెలుస్తాయి. అంటే ప్లాన్ ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా అక్కడక్కడా విసిరేసినట్లు అభివృద్ధి జరుగుతుంది. ఇది మాస్టర్‌ప్లాన్ విధానానికే విరుద్ధం. ఈ స్కీం వల్ల కేవలం ఔటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలే తప్ప రేడియల్ రోడ్స్, రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం లేకుండా పోతుంది.
 
 పరిహారం ఎలా..?

 చిన్న, సన్నకారు రైతులు భూములు ఇవ్వకపోతే... చట్టాన్ని అమలు చేసి వారి నుంచి భూములు సేకరిస్తామని హెచ్‌ఎండీఏ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న భూ సేకరణ చట్టం ప్రకారం మున్సిపాల్టీలకు వెలుపల ఉన్న ప్రాంతాల్లోని భూములకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువకు 4 రెట్లు అధికంగా పరిహారం చెల్లించాలి. ఇప్పటికే ఔటర్ చుట్టూ ఉన్న భూములకు మంచి ధరలున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి సేకరించే భూములకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలన్నది స్పష్టత లేదు. ఆర్థికంగా చితికిపోయిన హెచ్‌ఎండీఏ  కొత్త వెంచర్ బాధ్యతను డెవలపర్స్‌కు అప్పగిస్తే రైతులకు చెల్లించే పరిహారం విషయంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

నిజానికి భూ సేకరణ చట్టం వల్ల భూములివ్వని వారికే లాభం చేకూరనుంది. చట్టంలోని నిబంధనలు గ్రహించినవారు వెంచర్ మధ్యలోని భూములివ్వకుండా మెలికపెట్టే ప్రమాదం ఉంది. అడ్డంకులన్నీ అధిగమించి వెంచర్ అభివృద్ధికి పూనుకొన్నా... చివర్లో తమకు ఆసక్తిలేదని భూ యజమానుల్లో 1/3వంతు మంది అభ్యంతరపెడితే ఈ ప్రాజెక్టుకు నూకలు చెల్లినట్టే. ఇన్ని అవరోధాలున్న ల్యాండ్ పూలింగ్ స్కీంపై హెచ్‌ఎండీఏ పైపై మెరుగులతో ప్రకటనలు గుప్పించడం విడ్డూరంగా ఉందని పలువురు డెవలపర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement