సాక్షి, హైదరాబాద్: వెంచర్లు చేసేందుకు ఉపయోగపడే అసైన్డ్ భూములను సేకరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు వేసినట్టే వేసి వెనక్కు తగ్గింది. గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల పక్కన, రియల్ బూమ్ ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఈ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్, భూత్పూర్, బాలానగర్ మండలాల్లో ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములను సర్వే చేయాలని, అసైనీలతో మాట్లాడి ఎకరానికి 400 గజాలను వారికి ఇచ్చేవిధంగా ఒప్పించాలని ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
గత వారం రోజులుగా ఆయా మండలాల అధికారులు ఈ సర్వేలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారుల వెంట ఉన్న భూములను గుర్తించి అసైనీలతో మాట్లాడి ఆయా భూముల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు అంగీకరించగా, మరికొన్ని చోట్ల రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎకరం భూమి తీసుకుని అందులో 10 శాతం ఇస్తామంటే ఎలా కుదురుతుందని, కనీసం 50:50, 60:40 లాంటి ప్రతిపాదనలతో వస్తే ఆలోచిస్తామని తేల్చిచెప్పారు. జడ్చర్ల లాంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు కూడా దిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మళ్లీ మౌఖికంగానే ఆదేశాలు జారీ కావడం గమనార్హం.
చదవండి: సీఎస్ సోమేశ్‌ను ఏపీకి కేటాయించండి: కేంద్రం
మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ..
రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములున్నాయి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములూ పెద్దఎత్తున ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల వల్ల అసైనీలకూ ఉపయోగం లేనందున వాటిని స్వాధీనం చేసుకోవాలని భావించింది. స్వాధీనం చేసుకున్న భూములను ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడిన అధికారులు ఈ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు చేయాలని, హెచ్‌ఎండీఏకి అప్పగించి భూములను అభివృద్ధి చేసి విక్రయించాలని, అసైన్డ్ భూములను ఇచ్చినందుకు అసైనీలకు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. అందులోభాగంగానే ఎకరానికి 400 గజాల ప్రతిపాదనతో పాలమూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే, ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి విరమించుకున్నప్పటికీ ప్రభుత్వం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
పేదల అసైన్డ్ భూములను లాక్కోవద్దు: తమ్మినేని
సాక్షి,హైదరాబాద్: పేదలకిచ్చిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వం చట్టాలను అమలు చేయకపోగా వాటిని ఉల్లంఘించడం అన్యాయమని గురువారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములను లాక్కోవడం సరికాదన్నారు.
చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు
పట్టణాలకు దగ్గరగా అసైన్డ్ భూముల విలువ కొన్ని చోట్ల రూ.కోటి పైగా పలుకుతోందని అలాంటి భూముల నుంచి పేద అసైన్డ్‌దారులను బయటకు గెంటివేసి ప్రభుత్వం జెండాలు పాతి శాంతి–భద్రతల సమస్యను సృష్టించడం దారుణమన్నారు. ప్రభుత్వం తన తప్పుడు విధానాన్ని విరమించుకుని అసైన్డ్ భూములున్న పేదవారికి రక్షణ కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment