ఐటీకి పర్యాటకం తోడు
- సిటీలో మరో ఇంక్యుబేషన్ సెంటర్‌కు ప్రభుత్వం కసరత్తు
- మధురవాడ ఐటీ సెజ్‌ను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, ఏపీఐఐసీ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ రంగానికి విశాఖ మరిం త కీలకంగా మారబోతోంది. భారీ కొండలు, వాటిపై ఆధునిక ఐటీ కంపెనీలు, వాటి మధ్య నుంచి సముద్రాన్ని వీక్షించే వీలుగా పర్యాటకపరంగానూ కీలకంగా మార్చేం దుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తు తం నిర్మాణమవుతున్న ఇంక్యుబేషన్ కేంద్రానికి అదనంగా రెండో కేంద్రాన్ని భారీగా నిర్మించాలని భావిస్తున్నారు. కొండపై సరికొత్తగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టాలని, ఇందుకోసం మధురవాడ ఐటీ సెజ్‌లో ఖాళీ స్థలాల ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ యువరాజ్, ఇతర అధికారులు ఆదివారం ఈ విషయమై చర్చలు జరిపారు.
వస్తే ఐటీకి మేలే...
నగరంలో 70 వరకు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. మున్ముందు భారీ సంఖ్యలో కొత్తవి రానున్నాయి. కానీ కనీస సౌకర్యాలు లేవు. హైదరాబాద్‌లో ఐటీ సంస్థల కోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, కన్వెన్షన్‌సెంటర్లు ఉన్నాయి. విశాఖలో ఇవి లేవు. ఈ నేపథ్యంలో ఐటీకి విశాఖ భవి ష్యత్తు రాజధానిగా మారుతుండడంతో ఇంక్యుబేషన్, కన్వెన్షన్ సెంటర్లను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మధురవాడ ఐటీ సెజ్‌లో రూ.23 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తున్నారు. ఇది చాలా చిన్నది. విదేశాల నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు తక్షణమే కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇది సరి పోదు. దీంతో రెండో కేంద్రాన్ని భారీ స్థాయిలో నిర్మిం చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మధురవాడ సెజ్ సందర్శన
మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, ఐటీ సలహాదారు సత్యనారాయణ, కలెక్టర్ యువరాజ్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య ఆదివారం మధురవాడ సెజ్‌ను పరిశీలించారు. హిల్ నంబర్ 2లో నాన్‌ఐటీ ఎస్‌ఈజెడ్‌లో ఆరున్నర ఎకరాలు, హిల్ 3లో 30 ఎకరాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ సెజ్‌లో ఎక్కడోచోట ఐటీ కంపెనీల సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ప్రతిపాదించారు.
దీంతో కలెక్టర్, ఐటీ సలహాదారు సత్యనారాయణ హిల్3లో విప్రోకు కేటాయించిన 10 ఎకరాలను మంత్రికి చూపించారు. ఈ స్థలాలు వినియోగంలో లేకపోవడంతో అక్కడ దీన్ని నిర్మించవచ్చని వివరించారు. పాత నిధులు సుమారు రూ.20 కోట్లు ఉండడంతో దీనికి సంబంధించి తదుపరి ఏర్పాట్లు చూడాలని మంత్రి వీరిని ఆదేశించారు. ఆ తర్వాత వీరంతా ఐబీఎంను సందర్శించారు.
ఈ సంస్థకు గతంలో 26 ఎకరాలు కేటాయించగా, అందులో 3 ఎకరాల్లోనే కంపెనీ ఉండడంతో మిగిలిన భూములను మంత్రితోపాటు అధికారులు వెళ్లారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సింబయాసిస్ టెక్నాలజీ సీఈవో నరేష్‌కుమార్‌లు స్థానిక సమస్యలు వివరించారు. కొండపై ఐటీ కంపెనీలకు ఇంక్యుబేషన్ సెంటర్ లేదని చెప్పారు. ఈలోపు ఐటీ సలహాదారు సత్యనారాయణ జోక్యం చేసుకుని ఎండాడలో 20 ఎకరాల్లో దీన్ని నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు.
సముద్రం కనిపించేలా ఇంక్యుబేషన్ సెంటర్!
కలెక్టర్, ఏపీఐఐసీ చైర్మన్, మంత్రి పల్లె మాట్లాడుతూ సముద్రతీరంతో అత్యద్భుతంగా కనిపిస్తోన్న ఈ ప్రాంతంలో ఇంక్యుబేషన్ నిర్మిస్తే పర్యాటకపరంగానూ మంచి ఆదాయం పెంచుకునేందుకు వీలుం టుందని చెప్పారు. దీంతోపాటే హోటళ్లు నిర్మిస్తే పర్యాటకులకు వీనులవిందుగా ఉంటుందన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ కల్పించుకుని ఐబీఎంకు కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు లేనందున 23 ఎకరాల వరకు వెనక్కు తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ అధికారులు వివరించారు. దీంతో ఇక్కడే దీన్ని నిర్మిం చడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశిం చారు. స్థల లభ్యత ఎక్కువగా ఉన్న కారణంగా పది లక్షల అడుగుల్లో దీన్ని నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉం టుందని భావించారు. ఇందుకు రూ.800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పీపీపీ పద్ధతి లో అందుబాటులోకి తెచ్చే విషయంపై కొంతసేపు చర్చించారు.