సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు నాస్కామ్–డెలాయిట్ సంయుక్త సర్వే వెల్లడించింది. దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను పెద్ద నగరాలు కంటే చిన్న నగరాలకు విస్తరించడానికి మొగ్గుచూపుతున్నాయని ఈ సర్వే నివేదిక తెలిపింది.
ఈ విస్తరణకు ఐదు కీలక అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా 26 ఎమర్జింగ్ ఐటీ హబ్స్‌ను నాస్కామ్–డెలాయిట్ ఎంపిక చేసింది. ఇందులో మన రాష్ట్రం నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి వరంగల్ ఎంపికైంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్‌్క–వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్‌మెంట్ అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లు వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖ నగరాన్ని ప్రోత్సహిస్తుండటమే కాకుండా నూతనతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
విశాఖలో మొత్తం 1,120 స్టార్టప్స్ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటిలో 20 శాతానికిపైగా స్టార్టప్స్ టెక్నాలజీ రంగానికి చెందినవే ఉన్నాయి. ఇప్పటికే 250కి పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు విశాఖ వేదికగా పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడలో 80కి పైగా టెక్నాలజీకి చెందిన స్టార్టప్స్ ఉండగా, 550కి పైగా టెక్నాలజీ ఆధారిత వ్యాపారసంస్థలు ఉన్నాయి.
చదవండి: వియ్యంకుల వారి భూ విందు
అంతేగాకుండా ఏటా 25 వేలమందికి పైగా ఐటీ నిపుణులు అందుబాటులోకి వస్తున్నారు. ఐటీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ముందువరుసలో ఉంటోంది. తిరుపతిలో ఇప్పటికే 25 టెక్నాలజీ స్టార్టప్స్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, 50కి పైగా టెక్నాలజీ బేస్డ్ సంస్థలున్నాయి. ఇవన్నీ ఈ మూడు నగరాల్లో పెట్టుబడులను పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నాయి.
30% వ్యయం తక్కువ
పెద్ద నగరాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ద్వితీయశ్రేణి నగరాల్లో లభిస్తుండటం, రియల్ ఎస్టేట్ ధరలూ తక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీలు ఈ 26 నగరాల్లో కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ప్రధాన కారణమని నాస్కామ్–డెలాయిట్ పేర్కొంది.
పెద్ద నగరాలతో పోలిస్తే మానవ వనరుల వ్యయం 25 నుంచి 30 శాతం తగ్గుతున్నట్లు తెలిపింది. దేశీయ ఐటీ నిపుణుల్లో 15 శాతం ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల నుంచి వస్తున్నవారే కావడంతో వారి వద్దకే కార్యాలయాలను తీసుకెళ్లే యోచనలో కంపెనీలున్నాయి. రియల్ ఎస్టేట్ భవనాలు, అద్దెల వంటివీ చిన్న నగరాల్లో తక్కువగా ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐటీ కంపెనీలు టైర్–2 సిటీస్ బాట పడుతున్నట్లు ఆ నివేదిక విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment