అమాత్యుడి గుప్పెట్లో ఇంక్యుబేషన్ | incubation in minster hand | Sakshi
Sakshi News home page

అమాత్యుడి గుప్పెట్లో ఇంక్యుబేషన్

Published Sun, Mar 13 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

అమాత్యుడి గుప్పెట్లో ఇంక్యుబేషన్

అమాత్యుడి గుప్పెట్లో ఇంక్యుబేషన్

రూ.67.7 కోట్ల {పాజెక్టుపై కన్ను
అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టే ఎత్తుగడ
డిజైన్‌పై కొర్రీలతో అడ్డుపుల్ల

 
విశాఖపట్నం:  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)’ విశాఖలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మించేందుకు మూడేళ్ల క్రితం ముందుకువచ్చింది. అప్పట్లోనే కేంద్రం రూ.16 కోట్లు విడుదల చేసింది. కానీ అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో చక్రం తిప్పిన ఓ నేత ఈ ప్రాజెక్టు అంతా తన కనుసన్నల్లోనే సాగాలని పట్టుబట్టారు. అందుకు ఎస్టీపీఐ సమ్మతించకపోవడంతో ఆ ప్రాజెక్టు మూడేళ్లపాటు మూలనపడిపోయింది. ఏడాది క్రితం ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం అంశాన్ని ఎస్టీపీఐ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది.

ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా రూ.62.70 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. తన వాటాగా రూ.16.70 కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు వుడా సమ్మతించింది. ఎస్టీపీఐ రూ.44 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తుంది. ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్  ప్రసాద్ పర్యటన సందర్భంగా ఎస్టీపీఐ, వుడా ఎంవోయూ కుదుర్చుకున్నాయి. 8 ఫ్లోర్లతో 62 వేల చ.అడుగుల వైశాల్యంతో కనీసం 50 ఐటీ యూనిట్లు నెలకొల్పే సామర్థ్యంతో నిర్మించేందుకు డిజైన్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనీసం 2,500మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించారు. ఏటా రూ.300 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు సాధించవచ్చని అంచనా వేశారు. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. అందుకు త్వరలో టెండర్లు పిలవడానికి సంసిద్ధమయ్యారు.
 
అమాత్యుడి అడ్డుచక్రం
ఇంతటి విలువైన ప్రాజెక్టు పూర్తిగా ఎస్టీపీఐ పర్యవేక్షణలోనే సాగడం జిల్లాకు చెందిన ఓ అమాత్యుడికి ఏ మాత్రం రుచించలేదు. ఆ భారీ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు ఏకపక్షంగా కట్టబెట్టాలన్నది ఆయన ఉద్దేశం. ఆ తరువాత సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలన్నది పన్నాగం. తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా ఉండేలా టెండరు నిబంధనలు రూపొందించాలని భావించారు.
 కొన్నిరోజుల క్రితం వుడా అధికారులను పిలిపించి ప్రాజెక్టు డిజైన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. కాబట్టి మరో డిజైన్‌ను రూపొందించి తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. వాస్తవానికి ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయ ఉన్నతాధికారి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎస్టీపీఐ వర్గాలు చెబుతున్నాయి. వారు ఆమోదించిన తరువాతే టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేపట్టామని తెలిపాయి. కానీ అమాత్యుడు ఆ డిజైన్‌ను సీఎం కార్యాలయం తిరస్కరించినట్లు చెబుతుండటంపై ఎస్టీపీఐ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అమాత్యుడి అభ్యంతరాల వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. డిజైన్‌పై అభ్యంతరాల నెపంతో మొత్తం టెండర్ల ప్రక్రియను అడ్డుకోవాలన్నది ఆయన వ్యూహం. టెండరు నిబంధనలు తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా రూపొందించేవరకు ఈ వ్యవహారాన్ని ఆయన ముందుకు  సాగనివ్వరని స్పష్టమవుతోంది. కాగా తమ నిబంధనల మేరకే వ్యవహరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గేది లేదని ఎస్టీపీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అమాత్యుడి కమీషన్ల వ్యవహారంతో విలువైన ప్రాజెక్టు మరోసారి పెండింగులో పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్...
రూ.67.70  కోట్ల ప్రాజెక్టు...
2,500 ఐటీ ఉద్యోగాలు లక్ష్యం...
రూ.300 కోట్ల ఐటీ
ఎగుమతుల అంచనా...
అయితే... నా కేంటి?...‘నా సంగతి’ తేలేవరకు పనులు మొదలు పెట్టొద్దు. అసలు మీ డిజైనే బాగా లేదు. కొత్త డిజైన్‌తో రండి...
 
ఇదీ ఓ అమాత్యుడి హుకుం...
 విశాఖను ఐటీ హబ్‌గా చేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు ఆచరణలోకి వచ్చేసరికి అమ్యామ్యాలకే పెద్దపీట వేస్తున్నారు. కేంద్రం నిధులిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తిపడుతూ మోకాలడ్డుతున్నారు. ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ ప్రాజెక్టే అందుకు తాజా తార్కాణం.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement