
మృతులకు నివాళులు అర్పిస్తున్న మందకృష్ణ మాదిగ, రాములు నాయక్ తదితరులు
పంజగుట్ట: దిశ ఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. ‘‘దిశ’ జరిగిన అన్యాయాన్ని మేం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిందితులకు వారం రోజుల్లోనే శిక్ష విధించారు. మరి మా బిడ్డలు కూడా ఆడబిడ్డలే కదా.. ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. మా బిడ్డలను అతి క్రూరంగా చంపిన వారికి శిక్ష విధించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు’ అని పలువురు బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి ఆవేదన వెల్లడించారు.
అగ్రవర్ణాలు అని తెలిస్తేనే ప్రచారం: మంద కృష్ణమాదిగ
దేశంలో ప్రతినిత్యం ఎక్కడోచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని, అయితే బాధితులు అగ్రవర్ణాలు అని తెలిస్తేనే సమాజం మొత్తం రోడ్డుపైకి వచ్చేలా ప్రచారం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ అన్నారు. దేశంలో వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నా ఢిల్లీ నిర్భయ, శంషాబాద్ దిశ ఘటనలకు మాత్రమే దేశవ్యాప్త ఉద్యమాలు, పార్లమెంట్‌లో చర్చ, పేర్లు మార్చడం జరిగిందని, ఈ ఇద్దరూ అగ్రవర్ణానికి చెందిన వారే అని ఆయన పేర్కొన్నారు.
దళిత మహిళ టేకు లక్ష్మి, బీసీ వర్గానికి చెందిన మానస కుటుంబాలకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్ష పడాలన్న డిమాండ్లు కూడా ఎవరూ వ్యక్తం చేయకపోవడం చూస్తే ఎంత వివక్ష ఉందో అర్థమౌతుందన్నారు. ఆదివారం ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన నిందితులను త్వరగతిన కఠినంగా శిక్షించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ’ రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాములునాయక్, దళిత నాయకులు జేబీ రాజు, బాధిత మహిళల కుటుంబ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. దిశ, నిర్భయ ఘటనల్లో వారిద్దరూ అగ్రకులం వారు అని తెలియకుండా నిందితులు వారిపై అత్యాచారం, హత్య చేశారని.. కానీ 99 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై వారు బలహీన వర్గాలు అని తెలిసే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఎవరిని చంపితే సమాజం నుంచి స్పందన రాదో వారినే చంపేస్తున్నారని.. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలహీనంగా ఉన్నవారు కావడంతోనే ఎన్‌కౌంటర్ చేశారన్నారు.
హాజీపూర్‌లో ఓ అగ్రకులానికి చెందిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ముగ్గురిని అత్యాచారం చేసి, హత్య చేస్తే ఇప్పటికీ శిక్ష విధించలేదన్నారు. వెంటనే ఫస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇదే విషయమై సోమవారం డీజీపీని కలవనున్నట్లు, మంగళవారం హ్యూమన్‌రైట్స్‌ను, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి జరిగిన అత్యాచారాలన్నింటినీ వివరించి వారి కుటుంబాలను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న దిశకు ఓ న్యాయం మాకు ఒక న్యాయమా అనే నినాదంతో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, వివిధ సంఘాల నాయకులు సాంబన్న యాదవ్, రాజు, రాజ్‌కుమార్ నాయక్, భాస్కర్, పి.వి.రమణ, మహేష్‌రాజ్, దీపక్ కుమార్ తదితరులు ఉన్నారు.
నేను, నా భార్య టేకు లక్ష్మి చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం వెళ్లబోసుకుంటున్నాం. గత నెల 24న ఆసిఫాబాద్ జిల్లా జహినూర్ మండలంలో నా భార్యను వదిలి నేను మరో ప్రాంతంలో బెలూన్‌లు అమ్ముకునేందుకు వెళ్లాను. ఆ సమయంలో కొందరు దుండగులు నా భార్యను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి, చేతులు విరిచేసి, గొంతుపై తీవ్రగాయం చేసి చిత్ర హింసలు పెట్టి చంపారు. ఘటన జరిగిన వారం వరకు కనీసం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం కాలేదు.
10 రోజులకు విషయం తెలుసుకున్న మంద కృష్ణ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు 12వ రోజున ఎమ్మెల్యే వచ్చి పరామర్శించారు. మేము దళితులమనా మాపై ఈ వివక్ష. నా కొడుకులకు తల్లి లేకుండా పోయింది. నా జీవితమే ఆగమయ్యింది. ఆ నిందితులను కూడా చిత్రహింసలు పెట్టి చంపాలి. వారికి భూమి మీద ఉండే హక్కు లేదు. ప్రభుత్వం చంపకపోతే నేనే చంపేస్తా. – టేకు గోపి, ఆసిఫాబాద్.
దిశ ఘటన జరిగే కొన్ని గంటల ముందే నా కూతురు మానస ఘటన జరిగింది. పుట్టినరోజు కావడంతో దేవాలయానికి వెళ్లి వస్తానని చెప్పి బయటికి వెళ్లి శవమై కనిపించింది. మానసను ముగ్గురు కలసి చంపారు. అత్యాచారం చేసి కాళ్లు చేతులు విరిచారు. ఇది ఒక్కడే చేసింది కాదు. ముక్కు, చెవుల నుంచి రక్తం వచ్చింది.
చిత్ర హింసలు పెట్టారు. పోలీసులు మాత్రం ఒక్కరే చేశారని అరెస్టు చేశారు. మేము పేదవాళ్లమని, బలహీన వర్గానికి చెందిన వాళ్లమని మాపై వివక్ష చూపుతున్నారా?. ఇప్పటివరకు కనీసం పరామర్శించిన వారూ లేరు. ఒక తల్లికి ఒక న్యాయం, మరో తల్లికి మరో న్యాయమా?. బిడ్డల దగ్గర కులం, మతం ఏమిటి?. – స్వరూప, మానస తల్లి, వరంగల్
మా ఇంటిపక్కన ఒకతను ఇల్లు కట్టుకునేందుకు భూమి చదును చేశాడు. దీంతో మా బాత్రూం గోడ కొద్దిగా కూలింది. నా కూతురు సుద్దాల శైలజ మూత్ర విసర్జనకు వెళ్లడం గమనించిన అక్కడి యువకులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి, సమీపంలోని ఓ పాఠశాలలో సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు వారు తాగిన బీర్ బాటిల్ పగలగొట్టి అతి దారుణంగా పొడిచి, బండరాయితో తలపై మోది, కాళ్లు విరిచి అతి క్రూరంగా చంపారు.
4 రోజులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎవరో పాఠశాలలో ఒక మృతదేహం ఉంది అని చెప్పడంతో వెళ్లి చూడగా నా కూతురు. అప్పుడు పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. నెల రోజులైనా కేసు నమోదు చేయకపోవడంతో మందకృష్ణ వచ్చి ఆందోళన చేస్తే కేసు నమోదు చేశారు. 17 నెలలు అయ్యింది, ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేరస్తులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అంతే కాకుండా కేసు వెనక్కు తీసుకోవాలని నన్ను భయపెడుతున్నారు. దళితుడిని కదా.. ఎవరూ అడగరని వారి ధైర్యం. –శైలజ తండ్రి వెంకట్, రామకృష్ణాపురం, మంచిర్యాల
మా బిడ్డలు చనిపోయి 8 నెలలు అయ్యింది. అందరూ చిన్న పిల్లలే. హాజీపూర్‌లో పాఠశాలకు వెళ్లే పిల్లల్ని ఎత్తుకెళ్లి అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపి బావిలో పూడ్చిపెట్టాడు. వాడికి ఇప్పటివరకూ ప్రభుత్వం శిక్ష విధించలేదు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి నరరూప రాక్షసుడు. వాడికి భూమి మీద బతికే హక్కులేదు. మా పిల్లలు ఇంకా మా కళ్ల ముందే కనిపిస్తున్నారు. మీకు చేతకాకపోతే మాకు అప్పగించండి. వాడ్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి అదే బావిలో పూడ్చి పెడతాం. – హాజీపూర్ బాధితులు మనీషా తండ్రి మల్లేష్, కల్పన తండ్రి సదానందం, శ్రావణి తల్లి నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment