
పంచాయతీ తీర్పుతో.. మహిళపై సామూహిక అత్యాచారం
పశ్చిమబెంగాల్ రాష్ట్రం అత్యాచారాలకు రాజధానిగా మారిపోయింది. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు 12 మంది పురుషులు ఓ మహిళ (20)పై సామూహిక అత్యాచారం చేశారు. అది కూడా స్థానిక పంచాయతీ ఇచ్చిన ఆదేశాలతోనే! వేరే కులానికి చెందిన అబ్బాయితో సంబంధం పెట్టుకున్నందుకు ఆమెకు సదరు పంచాయతీ విధించిన శిక్షే.. ఈ సామూహిక అత్యాచారం!!
బీర్భూమ్ జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో ఈ ఘోరం సోమవారం జరిగింది. కొంతమంది గ్రామస్థులు ఆ మహిళను ఆమె స్నేహితుడి ఇంట్లో చూశారు. దీంతో వెంటనే గ్రామపెద్ద, మరికొందరు కలిసి పంచాయతీ పెట్టారు. ఇలా సంబంధం పెట్టుకున్నందుకు ఆ మహిళ, ఆమె స్నేహితుడు తలో 25వేల రూపాయల జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు. తాము అంత కట్టలేమని ఆమె కుటుంబసభ్యులు చెప్పడంతో, వెంటనే ఆమెపై 12 మంది సామూహిక అత్యాచారం చేయాలని గ్రామపెద్ద ఆదేశించాడు.
ఆమెను అక్కడినుంచి తీసుకెళ్లిపోయి, రాత్రంతా ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. అలా ఎన్నిసార్లు చేశారో కూడా తనకు లెక్క తెలియలేదని ఆమె వాపోయింది. చివరకు ఆమె స్నేహితుడి సోదరుడు సదరు 'జరిమానా' కట్టేసి, ఆమెను అక్కడినుంచి తీసుకెళ్లారు. ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ఆస్పత్రిలో విషమపరిస్థితిలో చికిత్స పొందుతోంది.
ఎఫ్ఐఆర్లో ఆమె మొత్తం 13 మంది పేర్లు చెప్పింది. వాళ్లంతా ఆమెకు సమీప బంధువులే అవుతారని, కొంతమంది అన్నలు కూడా వారిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మొత్తం 13 మందినీ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత జిల్లాలో జరిగిన ఈ ఘోరం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఇటీవలే కోల్కతాకు సమీపంలోనే ఓ గ్రామంలో కొంతమంది యువకులు ఓ యువతిపై రెండుసార్లు సామూహిక అత్యాచారం చేసి, ఫిర్ఆయదు వెనక్కి తీసుకోనందుకు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన ఇంకా చల్లారక ముందే ఈ దారుణం జరగడం గమనార్హం.