ఖాప్ 'కామం'దులపై సుప్రీం సీరియస్
పశ్చిమబెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఇది చాలా ఇబ్బందికరమని, అందుకే తాము ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. బీర్భూమ్ జిల్లా కలెక్టర్ ఈ విషయమై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పారు.
వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిన పాపానికి 25 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఖాప్ పంచాయతీ ఆదేశించగా, అందుకు ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడం, దాంతో 13 మంది వ్యక్తులతో ఆమెపై ఖాప్ పంచాయతీ పెద్దలు సామూహిక అత్యాచారం చేయించడం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు సభ్యసమాజానికి తలవంపులుగా నిలుస్తాయని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయంటూ పలు మానవహక్కుల, మహిళా సంఘాలు ఇప్పటికే ఈ విషయమై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనపై స్పందించింది.