khap panchayat
-
వినేశ్ ఫోగట్‌కు బంగారు పతకం
ఇటీవలి ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను రోహ్తక్లోని (హర్యానా) సర్వ్‌ఖాప్ పంచాయతీ బంగారు పతకంతో సత్కరించింది. ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..Haryana Khap Panchayat gave gold medal to Vinesh Phogat. Can someone tell me what is India's ranking at Olympics after this medal? pic.twitter.com/h6EBOCXQrj— BALA (@erbmjha) August 25, 2024“మా పోరాటం ముగియలేదు, మా బిడ్డల పరువు కోసం పోరాటం ఇప్పుడే మొదలైంది. మహిళా రెజర్లపై లైంగిక దాడుల సమయంలో ఇదే విషయాన్ని చెప్పాము” అంటూ ప్రసంగించింది. తనను సన్మానించిన ఖాప్ పెద్దలకు ఫోగట్ ధన్యవాదాలు తెలిపింది. ఖాప్ పెద్దలంతా మద్దతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది. మహిళా క్రీడాకారులకు కష్ట సమయాల్లో ఖాప్ పెద్దలు తోడుగా ఉంటే ప్రోత్సాహకంగా ఉంటుందని అంది.కాగా, వినేశ్ ఫోగట్ గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజేపీ సీనియర్ లీడర్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా హర్యానా రెజ్లర్లతో కలిసి పోరాటం చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు ముందు ఫోగట్ నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో ఆమె కనీసం రజత పతకాన్ని కూడా నోచుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయం విషయంలో వినేశ్ సీఏఏస్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రూల్స్ రూల్సే అని సీఏఏస్ ఫోగట్ అభ్యర్థనను కొట్టిపారేసింది. -
జీన్స్, షార్ట్స్ వేస్తే ఊరు దాటాల్సిందే..
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లొని ఖాప్ పంచాయతీ.. వస్త్రధారణపై కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు జీన్స్, పురుషులు షార్ట్స్ వేసుకోవడంపై నిషేధం విధించింది. ఇకపై గ్రామస్థులందరూ సంప్రదాయ దుస్తులనే ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే శిక్షతో పాటు, బహిష్కరణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. చార్తవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపాల్సా గ్రామంలో మార్చి 2న జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు ర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ నాయకుడు, కిసాన్ సంఘ్ చీఫ్ ఠాకూర్ పూరన్ సింగ్ ప్రకటించారు. మహిళలు సాంప్రదాయ భారతీయ దుస్తులైన చీరలు, ఘాగ్రాలు, సల్వార్-కమీజ్(పంజాబీ డ్రస్) ధరించాలని ఆయన సూచించారు. ప్రజల్లో భారతీయ వస్త్ర సంస్కృతి పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా గ్రామ ప్రజలు సైతం ఈ నిబంధనను అంగీకరించడం విశేషం. కాగా యూపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఖాప్ పంచాయతీ మండిపడింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. చదవండి : (రెండో పెళ్లి చేస్తారా? చావాలా?: 60 ఏళ్ల వ్యక్తి బెదిరింపులు) (మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు) -
ఈ ‘పంచాయతీ’ ఆగేనా?
సమాజానికి బెడదగా పరిణమించిన ఖాప్ పంచాయతీలు కొనసాగనీయరాదని మూడు నెలల వ్యవధిలో మూడోసారి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఖాప్ పంచాయతీలు ‘పరువు హత్యల’కు పాల్పడిన కేసులను ప్రత్యేక లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విచారించాలని, రోజువారీ విచారణలు జరిపి తీర్పునివ్వాలని మంగళవారం తాజా ఆదేశాల్లో నిర్దేశించింది. అంతేకాదు ఈ పంచాయతీల కట్టడికి, ‘పరువు హత్యల్ని’ అరికట్టడానికి పార్లమెంటు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లోని గ్రామ సీమల్లో తాము చెప్పిందే శాసనమన్నట్టు ప్రవర్తిస్తున్న ఈ ఖాప్ పంచాయతీల విష యంలో ప్రభుత్వాలన్నీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా జనం, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. ఖాప్ పంచాయతీలు ఎలా చెలరేగిపోతున్నాయో అడపా దడపా అవి వెలువ రిస్తున్న తీర్పుల వల్ల దేశ ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. ‘సమాజ ఆదర్శాల’కు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నందుకు 2007లో హర్యానాలోని ఒక ఖాప్ పంచాయతీ నూతన దంపతులను ‘మరణశిక్ష’ విధించి అమలు చేయించింది. ఈ కేసులో దాఖ లైన పిటిషన్‌పైనే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను వెలువరించింది. 2014–2016 మధ్య ఖాప్ పంచాయతీలు 288 ‘పరువు హత్యల’కు పాల్పడ్డాయి. ఖాప్ పంచా యతీల అరాచకానికి 2015లో రాజస్తాన్‌లో ఇచ్చిన ‘తీర్పే’ ఉదాహరణ. ‘నీ భర్త వేరొక వ్యక్తి భార్యతో అదృశ్యమయ్యాడు గనుక నువ్వెళ్లి ఆ వ్యక్తితో కాపురం చేయాల’ని ఒక మహిళను ఆ పంచాయతీ ఆదేశించింది. తన భర్త చేసిన నేరానికి తానెలా బాధ్యురాలినవుతానని ఆ మహిళ మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక యువతితో యువకుడు పరారైనందుకు శిక్షగా ఆ యువకుడి అక్కచెల్లెళ్లిద్దరిపైనా అత్యాచారం జరపాలని మరో ఖాప్ పంచాయతీ తీర్పుని చ్చింది. ఇక బయటకెళ్లినప్పుడు మహిళలు సెల్ఫోన్లు దగ్గరుంచుకోరాదని, సూర్యా స్తమయం తర్వాత వారు అసలు బయటికే పోకూడదని ఆ రాష్ట్రంలోని ఖాప్ పెద్దలు ఆదేశాలిచ్చారు. ఆడపిల్లల వస్త్రధారణ విషయంలోనూ, కులాంతర వివాహాల్లో, సగోత్రీకుల వివాహాల్లో వీటి జోక్యం ముదిరిపోయింది. తమ మాట వినని సంద ర్భాలెదురైనప్పుడు ‘పరువుహత్య’లకు కూడా ఈ పంచాయతీలు వెనకాడటం లేదు. పిల్లలకు పదహారేళ్ల వయసొచ్చేసరికి పెళ్లిళ్లు చేస్తే అత్యాచారాలంటూ ఉండ వని మరో ఖాప్ పంచాయతీ తీర్పునిచ్చింది. గ్రామంలో ఎవరొచ్చి ఫిర్యాదు చేసినా తగుదునమ్మా అని వివాదాల్లోకి చొరబడటం, ఇరుపక్షాలనూ పిలిచి తోచినట్టుగా ఆదేశాలివ్వడం వీటికి అలవాటైపోయింది. గ్రామసీమల్లో దశాబ్దాలుగా కొనసాగు తున్న ఈ పంచాయతీల జోలికి ఏ ప్రభుత్వమూ వెళ్లడం లేదు. కనుకనే జనం సైతం ఈ పంచాయతీ పెద్దలకు జడిసి నోరెత్తలేని స్థితి ఏర్పడింది. పర్యవసానంగా వారి మాటే శాసనంగా చలామణి అవుతోంది. ఖాప్ పంచాయతీలను పట్టుకుంటే సుల భంగా ఓట్లు రాలతాయన్న విశ్వాసంతో పార్టీలు సైతం వాటి అరాచకాల సంగతి తమకు తెలియనట్టు అమాయకత్వాన్ని నటిస్తున్నాయి. కనుకనే ఆ పార్టీల నేతృ త్వంలో ఏర్పడే ప్రభుత్వాలు ఖాప్ పంచాయతీలపై చట్టాన్ని తీసుకురావడానికి గానీ, వాటి నేరాలను కట్టడి చేయడానికిగానీ ప్రయత్నించడం లేదు. మరీ తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు మాత్రం తప్పనిసరై ఏదో ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ పంచాయతీలు ‘పరువు హత్యల’కు పాల్పడుతున్నా, బాల్యవివాహాలు జరిపిస్తున్నా, ఆడవాళ్ల హక్కులకు భంగం కలిగేలా మతిమాలిన ఆజ్ఞలు జారీచేస్తున్నా ఇవి అసలు పట్టించుకోవు. ఈ పంచాయతీల చేష్టలు పాత రాతి యుగం ధోరణులను గుర్తుకు తెచ్చేలా ఉంటున్నా, అందువల్ల మన దేశం పరువు మంటగలుస్తున్నా ప్రభుత్వాలు ఆవేదన పడటం లేదు. కేంద్రంలో ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలైనా ఇదే వరస. ఇక రాష్ట్ర ప్రభుత్వాల సంగతి చెప్పనవసరమే లేదు. ప్రజల భద్రత కోసం, వారి ప్రయోజనాల కోసం చట్టాలు, పథకాలు తీసు కురావలసిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాలదే. ఆ సంగతిని సుప్రీంకోర్టు గుర్తు చేసే పరిస్థితి ఏర్పడినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి. యుక్త వయసొచ్చిన యువతీయువకులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, చేసు కోవాలనుకున్నా ఆ విషయంలో కుటుంబసభ్యులతోసహా ఎవరి జోక్యమూ ఉండ రాదని, ఆ జంటను విడదీసే హక్కు ఎవరికీ లేదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం గమనించదగ్గది. అలా పెళ్లాడటంలో చట్టపరమైన సమస్య లుంటే వాటిని పరిశీలించి పరిష్కరించే బాధ్యత న్యాయస్థానాలదే తప్ప వ్యక్తులది కాదు. ప్రభుత్వాలు మాత్రం ఇదేం తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి. మారుమూల పల్లెటూళ్లలో సైతం ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలు సుకునే ప్రభుత్వాలకు ఖాప్ పంచాయతీల గురించి, వాటి కార్యకలాపాల గురించి ఆరాతీయడం పెద్ద కష్టం కాదు. ఏ ఊరి ఖాప్ పంచాయతీలో ఎవరెవరు సభ్యు లుగా ఉన్నారో గుర్తించి అలాంటివి చట్టవిరుద్ధమైనవని చెప్పడం, వాటి సమా వేశాలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించడం మొదలుకావాలి. అవి ఇష్టానుసారం ఆదేశాలిచ్చినట్టు తెలియగానే బాధితుల రక్షణకు చర్యలు తీసుకుని బాధ్యులను అరెస్టు చేయాలి. బాధితుల నుంచి ఫిర్యాదు కోసం ఎదురుచూడ కూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాలు మాత్రమే ఖాప్ పంచాయతీలను, వాటి అరాచకాలను అరికట్టలేవు. ప్రభుత్వాలు క్రియాశీలంగా వ్యవహరించాలి. 2007 మొదలుకొని ఇంతవరకూ వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే వచ్చింది. హర్యానా, రాజస్తాన్ హైకోర్టులు గతంలో మార్గదర్శకాలు జారీ చేశాయి. కానీ చేష్టలుడిగిన ప్రభుత్వాలవల్ల అవన్నీ వృథా అవుతున్నాయి. కనీసం ఇకనుంచి అయినా వాటి తీరు మారాలి. ఖాప్ పంచా యతీల విషయంలో కఠినంగా వ్యవహరించడం మొదలుకావాలి. ఒక చట్టం తీసు కొచ్చేలోగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలు ప్రారంభించాలి. -
ఆ హక్కు మీకు లేదు!
న్యూఢిల్లీ: సమాజంలో నైతికతను కాపాడటమే తమ బాధ్యతనే విధంగా ఖాప్ పంచాయతీలు వ్యవహరించ కూడదని సుప్రీం కోర్టు మండిపడింది. ఇద్దరు మేజర్ల వివాహాన్ని చట్టమే నిర్ధారిస్తుందని పేర్కొంది. వివాహాల విషయంలో ఖాప్ పంచాయతీల జోక్యంపై విచారించేందుకు సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ‘ఓ పెళ్లి సరైనదా? కాదా? అనే అంశాన్ని చట్టమే నిర్ణయిస్తుంది. తదనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మీరు (ఖాప్ పంచాయతీలు) సమాజంలో నైతికతను కాపాడాల్సిన పనిలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. పరువు హత్యలపై ‘శక్తి వాహిని’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఖాప్‌లు కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే.. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకే కుటుంబానికి (సపిండ) చెందిన వారు పెళ్లిచేసుకోకూడదు. సమాజంలో నైతిక విలువలను కాపాడేలా ఖాప్ పంచాయతీలు పనిచేస్తున్నాయి’ అని ఖాప్ పంచాయతీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొవద్దు: దీనిపై సుప్రీం స్పందిస్తూ.. ‘ఇద్దరు యువతీ యువకుల మధ్య పెళ్లి వారి వ్యక్తిగతం. దీనిపై చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ విషయాలపై ఖాప్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని పేర్కొంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 796 శాతం పెరిగిన పరువు హత్యలు! 2014–15లో పరువు హత్యలు దేశవ్యాప్తంగా 796 శాతం పెరిగాయి. 2014లో 28 పరువుహత్యల ఘటనలు చోటుచేసుకోగా.. 2015లో ఈ సంఖ్య 251కి పెరిగింది. ఈ జాబితాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు నాలుగైదు స్థానాల్లో ఉన్నాయని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. పది పదిహేను మంది సభ్యులుండే ఖాప్ పంచాయతీలు కోర్టులకు చేరని తమ సామాజికవర్గానికి చెందిన గొడవలను విచారణ ద్వారా పరిష్కరిస్తాయి. -
ఖాప్ పంచాయితీలపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : పరువు హత్యల వంటి తీవ్ర చర్యలతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఖాప్ పంచాయితీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా పంచాయితీల నుంచి బాధిత జంటలను కాపాడాలని కేంద్రాన్ని కోరింది. వివాహం, ప్రేమ వంటి వివాదాల పరిష్కారానికి కోర్టులు, చట్టాలు ఉన్నాయని, ఖాప్ పంచాయితీలు తమకు తాము వీటిపై నిర్ణయాలు తీసుకోలేవని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. వివాహబంధంతో యువతీయువకులు ఒక్కటైతే వారి వివాహం సరైనదా..కాదా అనేది చట్టం నిర్ధారిస్తుందని ఖాప్ పంచాయితీలు ఆ జంటపై హింసకు ప్రేరేపించడం సరైంది కాదని పేర్కొంది.కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు అవసరమనే విషయంలో ఉన్నతస్ధాయి పోలీస్ కమిటీని నియమించాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. ఖాప్ పంచాయితీలు, తల్లితండ్రులు, బంధువుల నుంచి వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించే బాధ్యతను అప్పగించడాన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. -
అన్యాయంగా మా అమ్మను చంపారు
అజ్మీర్: మూఢనమ్మకాల జాడ్యం ఓ మహిళ ప్రాణాలు తీయగా, ఆపై గ్రామపెద్దలు హేయనీయమైన తీర్పునిచ్చిన ఘటన రాజస్థాన్ అజ్మీర్ లో చోటుచేసుకుంది. కెక్రీ గ్రామంలో మంత్రెగత్తె అన్న ఆరోపణలపై నగ్నంగా ఊరేగించి దారుణంగా చిత్రహింసలకు గురిచేయటంతో ఆమె చనిపోగా, అందుకు కారణమైన వారిని నదిలో మునిగి పాప ప్రక్షాళన చేసుకోవాలంటూ పంచాయితీ పెద్దలు వెల్లడించారు. ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనను ఆమె కొడుకైన 15 ఏళ్ల రాహుల్ కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాడు. "ఆగష్టు 2న సాయంత్రం నేను, ఓ బంధువుల అమ్మాయి, ఆమె స్నేహితురాళ్లతో ఇంటి బయట మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఇద్దరమ్మాయిలు దెయ్యం పట్టినట్లు ఊగిపోతూ విచిత్రంగా ప్రవర్తించారు. అందులో ఓ అమ్మాయి మా అమ్మను మంత్రగత్తె అంటూ జట్టు పట్టుకుని రోడ్డుకు ఈడ్చింది. ఇంతలో మరో ఎనిమిది మంది గ్రామస్తులు గుమిగూడి మా అమ్మను చితకబాదటం ప్రారంభించారు. తనకే పాపం తెలీదని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరం చూపలేదు. మరోకరు దగ్గర్లోని పోలం నుంచి మలం తెచ్చి మా అమ్మతో తినిపించారు. ఆపై మురుగు నీరు తాగించారు. వివస్త్రను చేసి ఊరంతా తిప్పించారు'' అని బాలుడు వెల్లడించాడు. కాసేపయ్యాక కాల్చిన కర్రలతో వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేశారని, రోదిస్తూనే వారిని అడ్డుకోవాలని యత్నించినప్పటికీ తననూ చంపుతామని వాళ్లు బెదరించారని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. ఓ బంధువు సాయంతో బాలుడు ఈ ఘోరాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్తే వారి మరీ దారుణంగా వ్యవహరించారని చెప్పాడు. మొత్తం ఘటనకు కారణమైన ఈ ఇద్దరు యువతులకు చెరో 2,500 రూపాయల జరిమానా విధించి, పుష్కర్ లో స్నానం చేసి ఆ పాపం నుంచి విముక్తి పొందంటూ తీర్పు ఇచ్చారంట. అంతేకాదు పోలీసుల వద్దకు వెళ్లదంటూ తనను హెచ్చరించారని బాలుడు అంటున్నాడు. సామాజిక ఉద్యమకారుడు తారా అహ్లువాలియా ఈ మొత్తం ఉదంతాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహిళపై దాష్టీకానికి పాల్పడిన ఆమె మరణానికి కారణమైనవాళ్లతోపాటు తీర్పు ఇచ్చిన పంచాయితీ పెద్దలపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కూతురు రక్షణకై తెగించిన తండ్రి
బామర్: బలవంతంగా తన మైనర్ కూతురును ఓ 35 ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టాలని చూసిన ఖాప్ పంచాయతీకి వ్యతిరేకంగా ఓ తండ్రి కోర్టు మెట్లెక్కాడు. ఖాప్ పంచాయతీ పెద్దలు చేసిన హెచ్చరికలు సైతం లెక్క చేయకుండా అతడు ఎంతో సాహసంతో కోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనకు సంబంధించి మొత్తం 17మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని బామర్ జిల్లాలోగల గుంగా గ్రామంలో గనరాం ప్రజాపత్ అనే వ్యక్తికి ఓ మైనర్ కూతురు ఉంది. ఆమెను 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరించడమే కాకుండా అలా చేయకుంటే రూ.25లక్షల ఫైన్ కట్టాలని, సామాజిక బహిష్కరణ ఎదుర్కోవాలని ఈ నెల 1న తీర్పు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని గనరాం ధైర్యం ఇదే 6న కోర్టు మెట్లెక్కాడు. తనకు జరిగిన అన్యాయం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరించాడు. గత ఏడాది కూడా లీలారాం అనే వ్యక్తికి తన కూతురును ఇవ్వాలని ఇబ్బందులు పెట్టారని కోర్టుకు వివరించాడు. దీంతో కోర్టు ఆ ఖాప్ పంచాయతీ పెద్దలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఖాప్ పంచాయతీల తీర్పులను ఉల్లంఘిస్తే సాంఘిక బహిష్కరణతోపాటు, రాళ్లతో కొట్టి చంపించడం, కాల్పిపారేయడంలాంటి వికృత చర్యలు చేస్తుంటారు. వీటన్నింటికీ భయపడకుండా ఆ ప్రాంతంలోని ఓ సగటు తండ్రి చేసింది గొప్ప సాహసమే. -
కూతురు ఉంటే సన్మానం
దుర్మార్గం ఆగింది. సన్మార్గం మొదలైంది. స్త్రీజాతిని గౌరవించిన వారికి సత్కారం, సన్మానం! అవును. ఇది నిజం. హర్యానాలోని ఖాప్ పంచాయితీల వికృత తీర్మానాల గురించి మనం ఎన్నో విన్నాం. కానీ ‘జింద్’ జిల్లాలోని ఒక ఖాప్ పంచాయితీ.. మహోన్నత సంస్కృతిని ఆరంభించింది. మహిళలకు జై కొట్టింది. ‘జై హింద్’లా... జై ‘జింద్’ కొట్టించుకుంది. అగ్రకులం అమ్మాయిని దళిత అబ్బాయి ప్రేమించాడు. పెద్దలకు తెలియకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అమ్మాయి తరపు పెద్దలకు తెలిసింది. ఖాప్ పంచాయితీకి వెళ్లారు. ఆ జంటను పట్టుకురమ్మని ఆదేశాలిచ్చింది పంచాయితీ. అమ్మాయి తరపువాళ్లు ఆ జంట కోసం ఊరు, వాడే కాదు.. చుట్టుపక్కల ఊళ్లూ, అక్కడి వాడలూ గాలించి పట్టుకున్నారు. అమ్మాయిని తీసుకెళ్లి అంగరంగ వైభవంగా ఇంకో పెళ్లి చేశారు. మొదటి అబ్బాయి జాడను గల్లంతు చేసింది ఖాప్ పంచాయితీ. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అగ్రకులస్తులే. కానీ వేర్వేరు కులాలు. ఒకరంటే ఒకరు ఇష్టపడి.. పెద్దల అంగీకారం లేకుండా పెళ్లితో ఒకటయ్యారు. అయితే ఇరువైపు పెద్దలు ఊరుకోలేదు. ఖాప్ పంచాయితీ పెట్టించారు. ఇద్దర్నీ విడగొట్టారు. కులాల మధ్య వైరం కారణంగా ఆ తర్వాత ఆ ఊళ్లో ‘పరువు హత్య’ జరిగింది! అమ్మాయిని చంపేశారు. హర్యానాలోని చాలా జిల్లాల్లో ‘ఖాప్ పంచాయితీ’ల తీర్పులు ఇంత దారుణంగానే ఉంటాయి. అక్కడ ఆడపిల్లలు పెద్ద మనిషి అవగానే స్కూల్‌కి వెళ్లడానికి వీల్లేదు. మగపిల్లలతో మాట్లాడ్డానికి లేదు. తలవంచుకొని ఇంటిపట్టునే ఉండాలి. ఆటలు ఆడకూడదు. పాటలు పాడకూడదు. ఆ మాటకొస్తే ముఖం మీద నుంచి ఘూంఘట్ తీయకూడదు. అసలు అమ్మాయి పుట్టనే కూడదు. కడుపులో ఉన్నది ఆడపిండం అని తేలితే అబార్షన్‌తో అంతం చేయాలి. ఒకవేళ పుడితే నోట్లో వడ్లగింజ వేసి ప్రాణం తీసేయాలి! ఎంత అన్యాయం?! హర్యానా రాష్ట్రంలో నిత్యం కనిపించే కఠోర వాస్తవాలివి. అమానుషమైన ఇలాంటి తీర్పులను ఇస్తూ, వాటిని అమలయ్యేలా చేస్తూ అంతులేని పాపాన్ని మూటగట్టుకుంటున్నాయి అక్కడి ఖాప్ పంచాయతీలు! ఈ ధోరణి ఎంత ఘోరంగా రూపుదాల్చిందంటే... ఆ ఉచ్చులో అమ్మాయిలు అసలు ఊపిరే పోసుకోలేనంత! దీంతో అక్కడి కుటుంబాలు తాము కోరుకుంటున్నట్లే కేవలం ‘వంశోద్ధారకులను’ మాత్రమే కంటున్నాయి. ఖాప్... స్థానిక పెద్దల కూటమి ఖాప్ పంచాయితీ అనేది చట్టానికి అతీతంగా గ్రామాలలో తీర్పులిస్తుండే ఖాప్ పెద్దల స్థానిక కూటమి. ‘ఖాప్’ అగ్రవర్ణాల్లోని ఒక తెగ. అయితే పెళ్లీడుకొచ్చిన వారసులకు పెళ్లాలు కరువైనప్పుడు కానీ ఈ ఖాప్‌లకు తమ తప్పేంటో తెలిసిరాలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు ఉన్నది 877 మంది అమ్మాయిలే. ప్రతి యేడాది 37 వేల మంది అమ్మాయిలు కళ్లు తెవరకుండానే అబార్షన్ అనే విష సంస్కృతితో అమ్మ కడుపులోనే కన్నుమూస్తున్నారు. చివరికిది అనేక దుష్పరిణామాలకు కారణమై, హర్యానాలోని ఖాప్‌లు కళ్లు తెరిచే పరిస్థితిని కల్పించింది. అలా ఆ రాష్ట్రంలో మౌఢ్యం నుంచి ముందుగా బయటపడ్డది జింద్ జిల్లాలోని ‘బురా’ ఖాప్ పంచాయతి! ఆధునిక మార్పులకు అనుగుణంగా తీర్పులుండాలని, అభివృద్ధిలో స్త్రీ, పురుషులిద్దరిదీ సమభాగస్వామ్యమని, ఇద్దరి సంఖ్యా సమానంగా ఉంటే తప్ప ప్రకృతి సమతులంగా ఉండదని గ్రహించిన మొదటి ఖాప్.. రాజ్బిర్ బురా! అందుకే అతడు బురా ఖాప్ పంచాయితీలో స్త్రీ, పురుష సమానత్వానికి సంబంధించి ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మూడో సంతానం వద్దు కొడుకు పుట్టకపోతే పున్నామ నరకం నుంచి విముక్తి ఉండదని కొడుకు పుట్టే దాకా సంతానాన్ని కంటూనే ఉన్న కుటుంబాలు కోకొల్లలు హర్యానాలో. ఆ అధిక సంతానం ఎన్నో అనర్థాలకు కారణమైన ఉదాహరణలూ ఉన్నాయి. అందుకే రాజ్బిర్ బురా.. కొడుకు కోసం చూడకుండా ఇద్దరు అమ్మాయిలతోనే సంతానాన్ని ఆపేసిన ఆలుమగలకు ప్రోత్సాహకాలు ప్రకటించాడు. అంతేకాదు, నిండు సభలో గ్రామపెద్దతో సత్కారమూ ఉంటుందనీ చాటింపు వేయించాడు. రూపాయి కట్నం సంతానంగా అమ్మాయిలను వద్దు అనుకోవడానికి అడ్డు అదుపూ లేని వరకట్నం కూడా ఒక కారణమే. అందుకే ఎవరైతే కానీ కట్నం తీసుకోకుండా.. లేదంటే కేవలం ఒక్కరూపాయి కట్నంతోనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో ఆ వరులకు సన్మాన సత్కారాలుంటాయని చెప్పింది రాజ్ బురా నేతృత్వంలోని ఖాప్ పంచాయితీ. ‘భ్రూణహత్యలను, వరకట్న ఆత్మహత్యలను ప్రోత్సహించింది ఖాప్లేనని మా మీద చాలా చెడ్డపేరుంది. ఆ మచ్చను పోగొట్టుకోవడానికి .. కట్నమనే దురాచారాన్ని రూపుమాపడానికి మా రాష్ట్ర కార్యనిర్వాహకులు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అంటాడు రాజ్బిర్ బురా. పెళ్లి అతిథులు 21 మందే! ఆడంబరాలు అంబరాన్నంటుతూ సాగుతున్న పెళ్లి సంబరాలకు చెక్ పెట్టి అమ్మాయి తరపు వాళ్లు చతికిలబడకుండా చూసే బాధ్యతనూ తీసుకుంది బురా ఖాప్. అందుకే పెళ్లికి అబ్బాయి తరపువాళ్లు తండోపతండాలుగా రాకుండా ముఖ్యమైన వాళ్లు ఇరవై ఒక్క మంది మాత్రమే రావాలని తీర్మానించింది. దీనివల్ల ఆడపెళ్లి వాళ్లకు అనవసర ఖర్చును తప్పించిన వాళ్లమే కాక, ఆహార వృథాను అరికట్టినవాళ్లమూ అవుతామని అంటాడు రాజ్బిర్! ఏడు రోజులే మనిషి పోతే పదమూడు రోజుల మైలను పాటించమంటుంది హిందూ ధర్మం. దాన్ని ఏడు రోజులకు తగ్గించింది బురా ఖాప్ పంచాయితీ. పదమూడు రోజులు మైల పాటించడం, ఆ పదమూడు రోజులూ బంధువులు రావడం, వచ్చిన వారికి భోజనాలు గట్రా చూసుకోవడం లాంటివన్నీ చనిపోయిన మనిషి కుటుంబం మీద ఆర్థికభారాన్ని మోపుతున్నాయని ఈ తీర్మానం తీసుకున్నారట బురా ఖాప్‌లు. అంతేకాదు ఒకవేళ భర్త చనిపోతే .. ఆ భార్య జీవితాంతం పాటించాల్సిన ఆహార, సామాజిక నియమాలు... అంటే ఒక్కపూటే భోజనం చేయడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు దూరంగా ఉండటమనే దురాచారానికీ స్వస్తి చెప్పారు. మంచికి సన్మానం గ్రామాల్లో ఆడపిల్లలు, మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, స్పోర్ట్స్‌మెన్, స్వచ్ఛంద సేవాకార్యకర్తలు, రచయితలు.. వీరితోపాటు ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్న టీచర్లనూ సన్మానించాలనీ నిర్ణయించింది బురా ఖాప్. ‘ఇది ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకే’ అంటాడు రాజ్బిర్ బురా! ఏమైనా హర్యానాలోని జింద్జిల్లా బురాఖాప్ తీసుకున్న ఈ తీర్మానాలు ఈ దేశంలో ఆడపిల్లలను చూసే తీరు మారుతుందనే చిన్న ఆశకు ప్రాణం పోస్తున్నాయి. అమ్మాయి జిందగీ విషయంలో జింద్ దేశానికే ఆదర్శప్రాయమవుతుందేమో చూడాలి! -
రేప్ చేయాలని మేం ఆదేశించలేదు!
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేయాల్సిందిగా తాము ఆదేశించలేదని ఖాప్ పంచాయతీ తాజాగా కొత్త వాదన మొదలుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పేట్ సమీపంలోని సంక్రోట్ గ్రామంలో జాట్ కులానికి చెందిన యువతిని.. దళిత వర్గానికి చెందిన ఓ యువకుడు ప్రేమించడం.. ఆమెకు పెళ్లయిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చి అతడిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే.. ఈ ఘటనతో రెచ్చిపోయిన ఖాప్ పంచాయతీ పెద్దలు.. ఆ యువకుడి ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఎంతమందిని కలిసినా తమకు న్యాయం జరగడం లేదని, ఊరికి వెళ్తే ఎక్కడ రేప్ చేస్తారోనని అనుక్షణం భయంతో చస్తున్నామని ఆ అక్కాచెల్లెళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఖాప్ పంచాయతీ పెద్దలు కొత్త పల్లవి అందుకున్నారు. అసలు తాము ఆ అక్కా చెల్లెళ్లపై అత్యాచారం చేయాల్సిందిగా ఎప్పుడూ, ఎవరినీ ఆదేశించలేదని చెప్పారు. దీంతో ఈ వివాదం మొత్తం కొత్త మలుపు తిరిగింది. -
రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లో మనసులను కలచివేసే మరో ఖాప్ పంచాయితీ తీర్పు ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భాగ్‌పట్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసి, అనంతరం నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు. ఇంతకీ ఆ దళిత యువతి చేసిన నేరం ఏమిటో తెలుసా... ఆమెకో సోదరుడు ఉండటం. అతడు జాట్ కులానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించడం. వివరాల్లోకి వెళితే దళిత యువకుడు రవి అదే గ్రామానికి చెందిన జాట్ కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే పెద్దలను ఎదిరించే ధైర్యం చేయలేకపోటంతో ఆమె తమ కులానికే చెందిన అబ్బాయిని గత ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. కానీ ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, పెళ్లాడిన వ్యక్తితో కాపురం చేయలేకపోయింది. దీంతో అక్కడ ఇమడలేక సుమారు ఒక నెల తరువాత అంటే మార్చి నెలలో ప్రేమికుడు రవి దగ్గరికి వచ్చేసింది. అంతే వివాదం రాజుకుంది. యువతి తరపు బంధువులు, గ్రామ పెద్దలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అదిరింపులకు , బెదిరింపులకు, వేధింపులకు దిగారు. దీంతో భయపడిపోయిన రవి, ఆ యువతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. రవిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారు. అంతటితో గ్రామపెద్దలు ఆగ్రహం చల్లారలేదు. రవి సోదరి మీనా, ఆమె స్నేహితురాలిపై అత్యాచారం చేయాలని ఆజ్ఞలను జారీ చేశారు. ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పారు. అక్కడితో ఆగకుండా...ఊళ్లో వారుంటున్న ఇంటిని కూడా ఆక్రమించుకున్నారు. ఖాప్ పంచాయితీ పెద్దల హుకుంతో రవి కుటుంబం ఊరు విడిచిపెట్టి ఢిల్లీకి పారిపోయింది. ఈ క్రమంలో రవి సోదరి మీనా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన సోదరుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించాలని వేడుకుంది. దీనిపై ఉన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జస్టిస్ చలమేశ్వర్ .... యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో తమ తప్పేమీలేదని మీనా వాపోతోంది. -
ఖాప్ 'కామం'దులపై సుప్రీం సీరియస్
పశ్చిమబెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఇది చాలా ఇబ్బందికరమని, అందుకే తాము ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. బీర్భూమ్ జిల్లా కలెక్టర్ ఈ విషయమై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిన పాపానికి 25 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఖాప్ పంచాయతీ ఆదేశించగా, అందుకు ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడం, దాంతో 13 మంది వ్యక్తులతో ఆమెపై ఖాప్ పంచాయతీ పెద్దలు సామూహిక అత్యాచారం చేయించడం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు సభ్యసమాజానికి తలవంపులుగా నిలుస్తాయని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయంటూ పలు మానవహక్కుల, మహిళా సంఘాలు ఇప్పటికే ఈ విషయమై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనపై స్పందించింది.