అన్యాయంగా మా అమ్మను చంపారు
అజ్మీర్: మూఢనమ్మకాల జాడ్యం ఓ మహిళ ప్రాణాలు తీయగా, ఆపై గ్రామపెద్దలు హేయనీయమైన తీర్పునిచ్చిన ఘటన రాజస్థాన్ అజ్మీర్ లో చోటుచేసుకుంది. కెక్రీ గ్రామంలో మంత్రెగత్తె అన్న ఆరోపణలపై నగ్నంగా ఊరేగించి దారుణంగా చిత్రహింసలకు గురిచేయటంతో ఆమె చనిపోగా, అందుకు కారణమైన వారిని నదిలో మునిగి పాప ప్రక్షాళన చేసుకోవాలంటూ పంచాయితీ పెద్దలు వెల్లడించారు. ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటనను ఆమె కొడుకైన 15 ఏళ్ల రాహుల్ కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాడు. "ఆగష్టు 2న సాయంత్రం నేను, ఓ బంధువుల అమ్మాయి, ఆమె స్నేహితురాళ్లతో ఇంటి బయట మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఇద్దరమ్మాయిలు దెయ్యం పట్టినట్లు ఊగిపోతూ విచిత్రంగా ప్రవర్తించారు. అందులో ఓ అమ్మాయి మా అమ్మను మంత్రగత్తె అంటూ జట్టు పట్టుకుని రోడ్డుకు ఈడ్చింది. ఇంతలో మరో ఎనిమిది మంది గ్రామస్తులు గుమిగూడి మా అమ్మను చితకబాదటం ప్రారంభించారు. తనకే పాపం తెలీదని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరం చూపలేదు. మరోకరు దగ్గర్లోని పోలం నుంచి మలం తెచ్చి మా అమ్మతో తినిపించారు. ఆపై మురుగు నీరు తాగించారు. వివస్త్రను చేసి ఊరంతా తిప్పించారు'' అని బాలుడు వెల్లడించాడు.
కాసేపయ్యాక కాల్చిన కర్రలతో వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేశారని, రోదిస్తూనే వారిని అడ్డుకోవాలని యత్నించినప్పటికీ తననూ చంపుతామని వాళ్లు బెదరించారని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. ఓ బంధువు సాయంతో బాలుడు ఈ ఘోరాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్తే వారి మరీ దారుణంగా వ్యవహరించారని చెప్పాడు.
మొత్తం ఘటనకు కారణమైన ఈ ఇద్దరు యువతులకు చెరో 2,500 రూపాయల జరిమానా విధించి, పుష్కర్ లో స్నానం చేసి ఆ పాపం నుంచి విముక్తి పొందంటూ తీర్పు ఇచ్చారంట. అంతేకాదు పోలీసుల వద్దకు వెళ్లదంటూ తనను హెచ్చరించారని బాలుడు అంటున్నాడు. సామాజిక ఉద్యమకారుడు తారా అహ్లువాలియా ఈ మొత్తం ఉదంతాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహిళపై దాష్టీకానికి పాల్పడిన ఆమె మరణానికి కారణమైనవాళ్లతోపాటు తీర్పు ఇచ్చిన పంచాయితీ పెద్దలపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.