Black Magic Death
-
భరత్ నగర్ బస్తిలో బాలిక అనుమానాస్పద మృతి
-
క్షుద్రపూజలకు మహిళ బలి?
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరులో మూటపురం అనూష(30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్త క్షుద్రపూజల వల్లే ఆమె బలి అయిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన అనూష వివాహం జూలూరుకు చెందిన మూటపురం బాబురావుతో 2017లో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, 6 నెలల కుమారుడు ఉన్నాడు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఆపరేటర్ అయిన బాబురావు చేయి ఇటీవల విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. కుటుంబ కలహాలతో నిత్యం బాబురావు భార్యను కొట్టి వేధించేవాడు. ఈ క్రమంలో అనూష వారంరోజులుగా అమ్మతల్లి సోకి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం బాబురావు తన బావమరిది గిరిబాబుకు ఫోన్ చేసి అనూష ఆరో గ్యం విషమంగా ఉందని, వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన వచ్చే సరికి ఓ గదిలో అనూష శరీరమంతా కాలిపోయి మృతి చెంది ఉంది. క్షుద్ర పూజలనే అనుమానం.. అనూష అత్త యాదమ్మ తరచూ క్షుద్రపూజలు చేస్తుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శనివారం అమావాస్య కావడం, అనూష మృతదేహం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉండటం, ఉదయం వరకు ఇంట్లో పెద్ద దీపం వెలుగుతుండటం వంటివి విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అనూషకు మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత క్షుద్రపూజలు చేసి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూ ష ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు భర్త, అత్త ఆమె ఒంటిపై యాసిడ్ పోసినట్లు సమాచారం. ఇంట్లోని వస్తువులు ధ్వంసం : అనూషను భర్త, అత్త కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు బాబురావు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. న్యా యం చేసేవరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించి కూర్చున్నారు. చివరకు ఇరు కుటుంబాల పెద్ద మనుషులు రూ. 7.50 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం చేసుకు న్నట్లు సమాచారం. బాబురావు, యాదమ్మ పోలీసుల అదు పులో ఉన్నట్లు సమాచారం. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
భూతవైద్యుడి చికిత్స.. యువతి మృతి
సాక్షి, దేవరకొండ : అనారోగ్యానికి గురైన యువతి కొండమల్లేపల్లిలోని ఓ భూత వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ బుధవారం హఠాన్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పిట్టల నరసింహకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె హిమవర్షిణి అనారోగ్యానికి గురికావడంతో గతకొన్ని రోజులుగా మండల పరిధిలోని కొల్‌ముంతలపహాడ్ స్టేజీ సమీపంలోని భూతవైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది. ఈక్రమంలో బుధవారం హిమవర్షిణి అకస్మాత్తుగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండమల్లేపల్లి ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
చేతబడి చేసిందని కక్ష పెంచుకుని హత్య
సంస్థాన్ నారాయణపురం: చేతబడి చేయడం వల్లనే తన సోదరుడు మృతి చెందాడన్న అనుమానంతో ఓ వ్యక్తి మహిళను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. గాంధీనగర్ తండాకు చెందిన నేనవత్ బుజ్జి (45), గన్నా భార్యాభర్తలు. బుజ్జి, గన్నా, గన్నా తల్లి రాగమ్మలు కలిసి ఆదివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండనేమురు గ్రామంలో జరిగే శుభకార్యానికి వెళ్లాలని అనుకున్నారు. తల్లిని గన్నా తన బైక్‌పై కూర్చోబెట్టుకోగా, భార్య బుజ్జిని తెలిసిన వారి బైక్‌పై కూర్చోబెట్టాడు. దారిలో అదే తండాకు చెందిన మోగవత్ నర్సింహ బుజ్జి ప్రయాణిస్తు న్న బైక్‌ను ఆపాడు. బైక్ నడుపుతున్న వ్యక్తిని కొట్టి, బుజ్జిని తన కారులో ఎక్కించుకొని రాచకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చీరతో ఉరివేసి హత్య చేశాడు. ఎంతసేపటికీ భార్య రాకపోవడంతో వెనక్కివచ్చిన గన్నాకు కిడ్నా ప్ విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకటయ్య, ఎస్ఐ నాగరాజులు బుజ్జి కోసం గాలించగా, అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. హత్యచేసిన అనంతరం నర్సింహ పోలీస్‌సేష్టన్‌లో లొంగిపోయాడు. చేతబడి చేసిందని కక్ష పెంచుకుని.. మోగవత్ నర్సింహ తమ్ముడు రాజేష్ గత డిసెంబర్ 30న విద్యుదాఘాతంతో మృతి చెం దాడు. అయితే బుజ్జి చేతబడి చేయడం వల్లే తన సోదరుడు మృతి చెందాడని కక్ష పెంచుకున్న నర్సింహ ఆమెను హత్య చేశాడు. కాగా, బుజ్జి బంధువులు సంస్థాన్‌నారాయణపురం పోలీస్ సేష్టన్ ముందు ఆందోళనకు దిగారు. -
క్షుద్రపూజల్లో భారీ పేలుడు, స్వామిజీ సజీవ దహనం
తమిళనాడు,తిరువళ్లూరు: వివాహితతో కలిసి అర్ధరాత్రి ఓ స్వామీజీ చేసిన క్షుద్రపూజల్లో భారీ పేలుడు సంభవించింది. స్వామీజీ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో కలకలం రేపింది. చెన్నై నంగనల్లూరు ప్రాంతానికి చెందిన స్వామీజీ గోవిందరాజ్(49). ఇతను తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో ఎకర స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఎరయమంగళం సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలకు సిద్ధవైద్యం జ్యోతిష్యం, సంప్రదాయ పూజలను నిర్వహిస్తూ నివాసం వుంటున్నాడు. ప్రముఖ స్వామీజీగా గుర్తింపు పొందిన గోవిందరాజ్ వద్దకు చెన్నై ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం వివాహిత లావణ్య... గోవిందరాజ్ వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నిత్యం పూజలు నిర్వహించే గోవిందరాజ్, బుధవారం రాత్రి 9 గంటలకు పూజలకు ఉపక్రమించిన సమయంలో, పది గంటల ప్రాంతంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. వెంటనే పక్క గదిలో వున్న లావణ్య పేలుడు ఏర్పడిన ప్రాంతానికి వచ్చి చూడగా గోవిందరాజ్ సజీవంగా కాలుతుండడాన్ని గుర్తించి కేకలు వేస్తూ సమీప ప్రాంతాల వారికి విషయాన్ని చెప్పింది. లావణ్య కేకలను విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే గోవిందరాజ్ సజీవదహనమయ్యాడు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గోవిందరాజ్ మృతదేహాన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. గోవిందరాజ్ ఇంట్లో ఏర్పడిన భారీ పేలుడు విషయాన్ని మప్పేడు పోలీసులు ఫోరెన్సిక్ అధికారులకు చేరవేశారు. దీంతో డీఎస్పీ నళిని నేతృత్వంలో పోలీసులు గురువారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. గోవిందరాజ్ నిత్యం క్షుద్రపూజలు నిర్వహించేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేతబడి చేశారని.. సజీవ దహనం
శాస్త్రసాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా చాలామందిలో మార్పురావడం లేదు. చేతబడి అనుమానంతో దాడులకు పూనుకుంటున్నారు. అకారణంగా ప్రాణాలను తీస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ శివారులో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని సజీవ దహనం చేసిన సంఘటన సంచలమైంది. ఈ దారుణాన్ని జనం మరువకముందే విశాఖ మన్యంలో ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. డుంబ్రిగుడ మండలం కురిడి పంచాయతీ పుట్టబంద గ్రామానికి చెందిన గిరిజనుడు కిల్లో జయరాం(55) చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతనిపై కొంతమంది దాడికి దిగారు. కర్రలతో కొట్టి..కాళ్లు చేతులుకట్టేసి.. ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఇంత జరిగినా స్థానికులెవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం తెలిసి జిల్లా ప్రజలు నివ్వెరపోయారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, డుంబ్రిగుడ: పుట్టబంద గ్రామానికి చెందిన కిల్లో జయరాం వ్యవసాయ పనులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతనికి భార్య చెల్లిమ్మ, నలుగురు పిల్లలున్నారు. జయరాం చేతబడి చేస్తుంటాడనే అనుమానం స్థానికల్లో చాలారోజులుగా ఉంది. ఎవరికి ఒంట్లో బాగోకపోయినా అతన్నే కారకుడిగా భావించేవారు. చేతబడి చేయడంతోనే తమ వారికి బాగోలేదంటూ తిడుతుండేవారు. తరచూ జయరాంతో గొడవ పడేవారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పంచాయతీ నిర్వహిస్తున్నామని.. రావాలని కొంతమంది జయరాం ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లారని అతని భార్య చెల్లిమ్మ చెబుతుంది. అయితే పెద్దలెవ్వరూ అక్కడలేకపోవడంతో కొంతమంది తన భర్త జయరాంపై దాడికి దిగి.. కాళ్లు..చేతులను తాళ్లతో కట్టి.. కర్రలతో కొట్టి గ్రామ సమీపంలోని నడిరోడ్డుపైనే ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారని, అడ్డుకున్న తమను కూడా చంపేస్తామని నాటు తుపాకీతో బెదిరించారని చెల్లిమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికి అనారోగ్యంగా ఉన్నా దానికి తన భర్తనే కారణంగా చూపేవారని ఆవేదన వ్యక్తం చేసింది. రంగంలోకి పోలీసులు జయరాం సజీవ దహనం ఘటనపై అతని భార్య చెల్లిమ్మ బుధవారం ఉదయం డుంబ్రిగుడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అరకు సీఐ పైడయ్య, డుంబ్రిగుడ ఎస్సై గోపాలరావులు గ్రామానికి వెళ్లారు. సంఘటన స్థలాన్ని..పంచాయతీ ఏర్పాటు చేయాలని భావించిన ప్రదేశాలను పరిశీలించారు. జయరాం సజీవ దహనం అనంతరం మిగిలిన బూడిదను సేకరించారు. జరిగిన ఘోరంపై కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.గ్రామానికి చెందిన కె.పరుశురాం, నందో, మోహన్, ముకుంద్ అనే వ్యక్తులతో పాటు వారి భార్యలు జయరాంను చిత్రహింసలు పెట్టి, పెట్రోల్ పోసి కర్రల్లో పడేసి నిప్పంటించి సజీవ దాహనం చేశారని మృతుని భార్య చెల్లిమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇంత ఘోరం జరిగినా గ్రామస్తులు ఎవరూ కనీసం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం అరకు సీఐ పైడయ్య విలేకరులతో మాట్లాడారు. జయరాం సజీవ దహనం ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. బాధ్యులు ఎవరు? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మృతురాలి భార్య చేసిన ఫిర్యాదు మేరకు కొంతమందిపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నవారు పరారీలో ఉన్నారని..వారి కోసం గాలిస్తున్నామన్నారు. -
చెడుపు ప్రచారంతోనే హత్య
విశాఖపట్నం, కొయ్యూరు(పాడేరు): చెడుపు చేస్తున్నాడని ప్రచారం చేయడమే అతని ప్రాణానికి చేటు తెచ్చింది. నాలుగేళ్లుగా కక్ష పెంచుకున్న నిందితుడు అవకాశం చిక్కగానే నాటుతుపాకీతో కాల్చి హత్య చేశాడు. మండలంలో ఆర్.కొత్తూరు పంచాయతీ మల్లవరం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన హత్యకు చెడుపు ప్రచారమే కారణమని సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన రమణాజీకి చెడుపు ఉందని శ్రీను, అతని తల్లి, మరికొంతమంది కలిసి కొంతకాలం గా ప్రచారం చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యం సోకితే రమణాజీయే కారణమని ప్రచారం చేసేవారు.దీనిపై 2016లో రమణాజీ,శ్రీనులమధ్య ఘర్షణ జరిగింది.దీనిలో శ్రీను గాయపడ్డాడు. ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రెండేళ్ల పాటు కోర్టులో కేసు నడిచిన తరువాత రాజీ పడ్డారు. నాటి నుంచి శ్రీనును చంపాలని రమణాజీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.ఆదివారం రాత్రి శ్రీను ఒంటరిగా వస్తున్న సమాచారం తెలుసుకుని నాటుతుపాకీ కాల్చాడు. సమాచారం తెలుసుకున్న నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదివారం రాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించారు.ఆయన వెంట కొయ్యూరు, నర్సీపట్నం సీఐలున్నారు. సోమవారం ఉదయం కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్,ఎస్ఐ అసిరితాత సంఘటన స్థలానికి వెళ్లి, శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రమణాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. చెడుపు చేస్తున్నాడని రమణాజీపై శ్రీను తప్పుడు ప్రచారం చేయడంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్నారు.ఇదే హత్యకు దారి తీసిందని సీఐ తెలిపారు. -
చేతబడి నెపంతో తల్లిని చంపిన తనయుడు..!
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): నవమోసాలు మోసి కని పెంచిన తల్లిని తనయుడే హతమార్చిన సంఘటన బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన జంగపెల్లి చంద్రవ్వ(60) అనే మహిళను ఆమె కుమారుడు జంగపెల్లి శ్రీనివాస్ ఆదివారం రాత్రి గొంతు నులిమి చంపిన ఘటన మండలంలో సంచలనం రేకెత్తించింది. ఎస్సై పాకాల లక్ష్మారెడ్డితో పాటు గ్రామస్తుల కథనం ప్రకారం.. జంగపెల్లి చంద్రవ్వ–నర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వీరికి గతంలోనే వివాహాలు జరిగాయి. కుమారుడు శ్రీనివాస్ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి నాలుగు నెలల క్రితం వచ్చాడు. ఇంట్లో ఉంటే ఆరోగ్యం బాగుండడం లేదని గంగాధరలో భార్య కుమారుడితో కలిసి కాపురం పెట్టాడు. తన తల్లి చంద్రవ్వ మంత్రాలు చేయడంతోనే తన ఆరోగ్యం బాగుండడం లేదని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో విరుగుడు పూజలు సైతం చేయించాడు. ఆదివారం విలాసాగర్‌లోని తమ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తండ్రి నర్సయ్య తన కూతురు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రాత్రి నిదురిస్తున్న తల్లిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం బల్ల పై నుంచి కింద పడి మృతి చెందిందని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబసభ్యులు అనుమానంతో నిలదీయడంతో చివరకు తానే ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. మంత్రాలు చేస్తుందనే అనుమానంతో తన భార్య చంద్రవ్వను కుమారుడు శ్రీనివాస్ గొంతునులిమి హత్య చేశాడని నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్ సీఐ డీ.రఘుచందర్ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నాడు. నిందితుడి అరెస్ట్ విలాసాగర్ గ్రామంలో మంత్రాల నెపంతో తల్లి జంగపెల్లి చంద్రవ్వను గొంతు నులిమి చంపిన కేసులో కుమారుడు జంగపెల్లి శ్రీనివాస్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు వేములవాడరూరల్ సీఐ రఘుచందర్ తెలిపారు. మంత్రాలు చేస్తుందనే దురాలోచనతో తల్లిని శ్రీనివాస్ టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
చేతబడి అనుమానంతో..తండ్రిని చంపిన తనయులు
రాయగడ: రాయగడ జిల్లా ఆదివాసీ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడి గిరిజనులు అడవులపై ఆధారపడి జీవిస్తారు. ఇక్కడి వారికి దెయ్యం, భూతం, చేతబడి అంటే మహాభయం. దీనిపై అనుమానం వచ్చినవారిని అనేక గ్రామాలలోని ప్రజలు హత్యలు చేస్తున్నారు. జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చేతబడి ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ, నిరక్ష్యరాస్యులు కావడంతో ఆదివాసీ ప్రజలకు వీటిపై నమ్మకం ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లాలోని టికిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో పనసపొదరొ గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో కన్నతండ్రిని ఇద్దరు కొడుకులు కొట్టి చంపి పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన ఈ ఘటన జరిగింది. పనసపొదరొ గ్రామానికి చెందిన భరత్ కుంబొరొ(60)అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో అతని కుమారులు అంతులు కుంబొరొ, మంగులు కుంబొరొలు కలిసి 13వ తేదీ సాయంత్ర తండ్రిని చితకబాది గ్రామ పొలిమేరలోకి తీసుకువెళ్లి చంపి, అర్ధరాత్రి 2గంటల సమయంలో వాగు ఒడ్డున పాతిట్టారు. ఈ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే నిన్ను కూడా హత్య చేస్తామని భరత్ కుంబరొ భార్య మాగొ కుంబొరొకు అన్నదమ్ములిద్దరూ బెదిరించడంతో ఈ విషయం బయటకు రాలేదు. ఈ విషయం ఆనోట ఈ నోట ఈ నెల 21వ తేదీన సాయంత్రం టికిరి పోలీసులకు సమాచారం అందడంతో గ్రామానికి వచ్చి నిందితులు అంతులు కుంబొరొ, మంగులు కుంబొరొలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారణ చేయగా జరిగిన హత్యోదంతమంతా చెప్పడంతో శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లి పాతిపెట్టిన శవాన్ని పోలీసులు బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. చేతబడిని నమ్మవద్దని ప్రభుత్వం లక్షలాది రూపాయల ఖర్చు చేసి, జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఆదివాసీ సంఘాలతో ప్రతి గ్రామంలో భారీ ప్రచారం చేస్తున్నా చేతబడి నెపంతో హత్యలు చేయడం మాత్రం ఆగడంలేదు. హత్యలు చేసి దోషులుగా మారవద్దని ప్రజలను చైతన్యవంతులు చేసినప్పటికీ ఈ ఘటనలు తగ్గడం లేదు. ప్రజల్లో మూఢనమ్మకాలు పెరగడంతో నేటికీ సాధారణ జ్వరం వచ్చినా చేతబడిగా అనుమానించి చేతబడి పూజలు చేస్తున్నారు. ఇలా చేయడంతో అనేకమంది మృత్యువాత పడుతున్నారు. -
కన్ను పీకి..కాలునరికి..
జయపురం : నవరంగ్‌పూర్ జిల్లాలో అమానుష చర్య బయల్పడింది. 8 ఏళ్ల బాలికను హత్య చేసి పొదల్లో పడేశారు. హత్య చేసిన వారు ఆ బాలిక రెండు చెవులు కోసేశారు. అంతే కాకుండా బాలిక కడుపుపై, తలపైన తీవ్రంగా గాయపరిచారు. ఆమె ఎడమ కాలిని నరికేశారు. ఎడమ కన్ను పీకేశారు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టి ముక్కు పచ్చలారని బాలికను చంపిన ఆ కసాయిలు ఎవరో తెలియలేదు. దుష్టశక్తుల పేరిట ఆ బాలికను ఎవరో బలి ఇచ్చి ఉంటారని, అందుకే బాలిక అంగాలను తొలగించారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెండు రోజులుగా కానరాని బాలిక నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కొచరాపర ఆదివాసీ గ్రామస్తుడు సుఖా గోండ్ కుమార్తె పూజా గోండ్ బుధవారం సాయంత్రం నుంచి కనిపించలేదని, గ్రామంలో ఎవరి ఇంటిలోనైనా ఆడకుంటుందేమోనని తల్లి దండ్రులు అన్ని ఇళ్లకు వెళ్లి వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోని తోటల్లో , పొలాల్లో గాలించారు. ఆమె జాడ లేకపోవడంతో సమీప గ్రామంలో ఉంటున్న తమ బంధువులకు ఫోన్ చేసి బాలిక ఏమైనా వచ్చిందా అని ఆరాతీశారు. వారింటికి కూడా వెళ్లకపోవడంతో బంధువులు, తల్లిదండ్రులు బిడ్డ ఏమైందోనని విచారంలో మునిగిపోయారు. గురువారం తిరిగి బాలిక బంధువులు, గ్రామస్తులు బాలిక జాడ కోసం గాలిస్తుండగా గ్రామానికి కొంత దూరంలోని ఒక గడ్డి వాములో బాలిక శవమై ఆమె పెద్దనాన్న సుధురాం గోండ్‌కు కనిపించింది. దీంతో ఆయన తమ్ముడికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు బాలిక మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. మృతదేహాన్ని పరిశీలించి క్షుద్రపూజలు చేసి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి తాను ఈ ప్రాంతంలో వెతికినప్పుడు అక్కడ ఎటువంటి మృతదేహం లేదని, అంటే ఎవరో దుండగులు ఎక్కడో క్షుద్ర పూజలు చేసి హత్య చేసి పడేశారని సుధారాం గోండ్ ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దీంతో బాలిక బంధువులు కుందెయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవింద చం ద్ర బురద, కుందెయి పోలీసు అధికారి పితాంబర సాగర్, సబ్ ఇన్స్పెక్టర్ భవానీ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులు, మృతురాలి తల్లిదండ్రులను విచారణ చేశారు. ఇంత చిన్న పిల్లను ఎవరు హత్య చేశారో కనిపెడతామని పోలీసులు తెలిపారు. బాలిక పెదనాన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం బాలికను ఎక్కడో చంపి ఇక్కడ పడేసిఉంటారన్నారు. అభంశుభం తెలియని బాలికను చంపిన హంతకులను కఠినంగా శిక్షిం చాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు. -
వీడిన రామలక్ష్మి హత్య మిస్టరీ
గరివిడి: మండలంలోని కొండలక్ష్మీపురంలో ఈ నెల 5వ తేదీన జరిగిన గొర్లె రామలక్ష్మి(65) హత్య కేసు మిస్టరీ వీడింది. పట్టుబడిన నిందితులను బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత ఆధ్యర్యంలో గరివిడి ఎస్సై శ్రీనివాస్ బుధవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సౌమ్యలత అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మికి చేతబడి ఉందన్న అనుమానంతో హంతకులు పథకం ప్రకారం హతమార్చారు. గతంలో గ్రామంలో ఉన్న చిన్నారులు, పెద్దలు, పశువులు అనారోగ్యం పాలవుతుండటానికి ప్రధాన కారణం రామలక్ష్మి చేతబడేనని నిందితుల నమ్మకం. ముఖ్యంగా హత్యకు వారం ముందు వట్టిగళ్ల ఆదినారాయణకు చెందిన ఆవు మృతి చెందింది. తన ఆవు చనిపోవడానికి రామలకే‡్ష్మ కారణమని భావించిన ఆదినారాయణ ఆమెను అంతమొందించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తె తాడ్డి పెంటమ్మతో చర్చించాడు. దీంతో పెంటమ్మ తన తల్లికి చిల్లంగి, చేతబడి ఉందని అనుమానం ఉంటే పల్లు పీకేయమని, లేదంటే ఇళ్ల చుట్టూ కొయ్యలు పాతిపెట్టమని సలహాఇచ్చింది. అయితే ఆ విషయాలకు సంతృప్తి చెందని ఆదినారాయణ ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించాడు. అలాగే రామలక్ష్మి పేరిట బ్యాంకు ఖాతాలో రూ.90 వేలు ఉన్నట్లు కుమార్తె పెంటమ్మ తెలుసుకుంది. తల్లిని చంపేస్తే ఆ పైకం తనకే చెందుతుందన్న దురాశతో ఆదినారాయణతో చేతులు కలిపింది. దీంతో వీరిద్దరూ ఆదినారాయణ కుమారుడు వట్టిగల్ల జయరాజు, దాసరి సతీష్‌ల సహకారం తీసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఆవాల దేముడురాజుకు రూ. 50 వేలు ఇస్తామని ఆశ చూపించి రెండు రోజుల్లో రామలక్ష్మిని చంపేయాలని కోరారు. దీంతో ఈ నెల 5వ తేదీన గ్రామంలో తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్న రామలక్ష్మిని దేముడురాజు పీక కోసి హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని సంఘటనా స్థలానికి 500 మీటర్ల దూరంలో ఉన్న తాటిచెట్ల పొదల్లో దాచేశాడు. అనంతరం రామలక్ష్మి శవాన్ని కుమార్తె పెంటమ్మ తన భుజాలపై వేసుకొని ఇంటికి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే రామలక్ష్మి మృతిపై అనుమానాలున్న పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో నిందితులు పట్టుబడ్డారు. కార్యక్రమంలో చీపురుపల్లి సీఐ సీహెచ్. శ్యామలరావు, ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు. -
ఉలిక్కిపడ్డ నిమ్మనపల్లి
పెద్దపల్లి: మాయలు లేవు.. మంత్రాలు లేవు.. భూతా లు దయ్యాలు అసలే లేవు.. అంటూ మేథావులు ఎంత మొత్తుకుంటున్నా.. అజ్ఞానాన్ని వీడని కొందరు ప్రాణా లు తీస్తున్నారు. ఇదే కోవలో మరో సంఘటన జరిగింది. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి తమ్ముడి చేతిలో అన్నావదినలు దారుణంగా హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తూముల నంబయ్య(60), కమల (53)లను నంబయ్య తమ్ముడు శంకర్ గొడ్డలితో నరికి చంపాడు. కొంతకాలంగా తగాదాలు.. నంబయ్య సోదరులు ఐదుగురు ఒకే చోట పక్క పక్కనే నివాసముంటున్నారు. ఇరువురు అన్నదమ్ముల మధ్య భూ తగాదాల ఉన్నాయి. అలాగే కొంతకాలంగా తన అనారోగ్యానికి అన్నావదినలే కారణమని శంకర్ పగ పెంచుకున్నాడు. దీంతోనే వారిని చంపాలని నిర్ణయించుకున్న శంకర్ అదను కోసం చూసి చీకటి పడ్డాక ఇద్దరిపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం శంకర్ పరారయ్యాడు. మూఢ నమ్మకాలతో శంకర్ అత్యంతకిరాతకంగా వ్యవహరించాడని గ్రామస్తులు ఆవేదన చెందారు. సంఘటన జరిగిన గంట తర్వాత కూడా విషయం వెలుగులోకి రాలేదని తెలిపారు. పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ నరేందర్, ఎస్ఐ జగదీశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలు నేడు తరలింపు నంబయ్య, కమలలను హతమార్చిన తీరుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హంతకుడు శంకర్ గొడ్డలిని ఉపయోగించాడా.. పదునైన ఆయుధాన్ని ఉపయోగించాడా.. అనేది మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తెలుస్తుందని ఏసీపీ హబీబ్‌ఖాన్ తెలిపారు. దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారని, కుమారుల సమక్షంలో మృతదేహాలను తరలించి పరీక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
ఆ ఐదుగురు యువతులను బలి ఇచ్చారా?
సాక్షి, నాగర్‌కర్నూల్: హైదరాబాద్- శ్రీశైలం దారిలో నాగర్ కర్నూల్ జిల్లా వటవర్ల పల్లి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఐదు మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. అక్క మహాదేవి గుహల సముదాయంలో పుర్రెలు, ఎముకలు, నిమ్మకాయలు, దుస్తులు, చెప్పులు ఉన్నట్లు పశువుల కాపరులు ఐదు రోజుల క్రితం చెప్పటంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కపాలాలు 30 ఏళ్లలోపు మహిళలవని, వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా గుప్త నిధుల ఉన్నాయని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో మహిళలను బలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం గుప్త నిధులు, తాంత్రిక శక్తుల కోసమే వారికి మత్తు మందులు ఇచ్చి బ్లేడులతో కోసి బలి ఇచ్చి ఉంటారని... మృతదేహాలను జంతువులు తినేయగా పుర్రెలు మాత్రమే మిగిలాయని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. దట్టమైన అడవిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పర్యాటకులు అటుగా వెళ్లేందుకు వణికి పోతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
వృద్ధుడిని బలిగొన్న మూఢనమ్మకాలు
ఏటూరునాగారం: తన భార్యకు మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి సొంత పెద్దనాన్ననే మట్టుబెట్టిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురం అటవీ ప్రాంతంలోని బాసగూడెం(గొత్తికోయగూడెం)లో బుధవారం వెలుగుచూసింది. బాసగూడెంలో సుమారు 40 గొత్తికోయ కుటుంబాలు నివాసముంటున్నాయి. గూడేనికి చెందిన చౌళం వినోద్ భార్య బీమికి ఆరు నెలలుగా ఆరోగ్యం బాగుండడం లేదు. తన పెద్దనాన్న చౌళం మాసయ్య(65)కు మంత్రాలు వస్తాయని, తన భార్యకు అతడే మంత్రాలు చేశాడనే వినోద్ అతడిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు గొడవకు కూడా దిగాడు. అతడిని ఎలాగైనా చంపాలని పథకం పన్నిన వినోద్ వరి పొలం వద్ద దేవతలకు పూజలు చేసేందుకు రావాలని మాసయ్యను కోరాడు. మంగళవారం కత్తి, కోడి, పూజ సామగ్రిని పట్టుకొని అటవీ ప్రాంతానికి వెళ్లారు. పూజలు చేసే క్రమంలో ఇద్దరు కలిసి కొంత మద్యం తాగారు. అక్కడ పూజలు చేస్తున్నట్లు నమ్మించిన వినోద్ ఒక్కసారిగా మాసయ్యపై దాడి చేసి కత్తితో ఏడు చోట్ల పొడిచి గొంతు కోసి హత్య చేశాడు. మాసయ్య మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. మాసయ్య తమ్ముడు విజయ్ కుమారుడే వినోద్. మృతుడి భార్య చిడుక్కు, కుమారులు భీమయ్య, పోషయ్య ఫిర్యాదు మేరకు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన మంగళవారం జరిగినప్పటికీ అక్కడ నుంచి సెల్‌సిగ్నల్స్, రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో సమాచారం చేరడానికి 24 గంటలు పట్టింది. వినోద్ తండ్రి విజయ్‌ని గూడెం పెద్దమనుషులు బంధించారు. అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. వినోద్ పరారీలో ఉన్నట్లు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
అన్యాయంగా మా అమ్మను చంపారు
అజ్మీర్: మూఢనమ్మకాల జాడ్యం ఓ మహిళ ప్రాణాలు తీయగా, ఆపై గ్రామపెద్దలు హేయనీయమైన తీర్పునిచ్చిన ఘటన రాజస్థాన్ అజ్మీర్ లో చోటుచేసుకుంది. కెక్రీ గ్రామంలో మంత్రెగత్తె అన్న ఆరోపణలపై నగ్నంగా ఊరేగించి దారుణంగా చిత్రహింసలకు గురిచేయటంతో ఆమె చనిపోగా, అందుకు కారణమైన వారిని నదిలో మునిగి పాప ప్రక్షాళన చేసుకోవాలంటూ పంచాయితీ పెద్దలు వెల్లడించారు. ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనను ఆమె కొడుకైన 15 ఏళ్ల రాహుల్ కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాడు. "ఆగష్టు 2న సాయంత్రం నేను, ఓ బంధువుల అమ్మాయి, ఆమె స్నేహితురాళ్లతో ఇంటి బయట మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఇద్దరమ్మాయిలు దెయ్యం పట్టినట్లు ఊగిపోతూ విచిత్రంగా ప్రవర్తించారు. అందులో ఓ అమ్మాయి మా అమ్మను మంత్రగత్తె అంటూ జట్టు పట్టుకుని రోడ్డుకు ఈడ్చింది. ఇంతలో మరో ఎనిమిది మంది గ్రామస్తులు గుమిగూడి మా అమ్మను చితకబాదటం ప్రారంభించారు. తనకే పాపం తెలీదని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరం చూపలేదు. మరోకరు దగ్గర్లోని పోలం నుంచి మలం తెచ్చి మా అమ్మతో తినిపించారు. ఆపై మురుగు నీరు తాగించారు. వివస్త్రను చేసి ఊరంతా తిప్పించారు'' అని బాలుడు వెల్లడించాడు. కాసేపయ్యాక కాల్చిన కర్రలతో వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేశారని, రోదిస్తూనే వారిని అడ్డుకోవాలని యత్నించినప్పటికీ తననూ చంపుతామని వాళ్లు బెదరించారని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. ఓ బంధువు సాయంతో బాలుడు ఈ ఘోరాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్తే వారి మరీ దారుణంగా వ్యవహరించారని చెప్పాడు. మొత్తం ఘటనకు కారణమైన ఈ ఇద్దరు యువతులకు చెరో 2,500 రూపాయల జరిమానా విధించి, పుష్కర్ లో స్నానం చేసి ఆ పాపం నుంచి విముక్తి పొందంటూ తీర్పు ఇచ్చారంట. అంతేకాదు పోలీసుల వద్దకు వెళ్లదంటూ తనను హెచ్చరించారని బాలుడు అంటున్నాడు. సామాజిక ఉద్యమకారుడు తారా అహ్లువాలియా ఈ మొత్తం ఉదంతాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహిళపై దాష్టీకానికి పాల్పడిన ఆమె మరణానికి కారణమైనవాళ్లతోపాటు తీర్పు ఇచ్చిన పంచాయితీ పెద్దలపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.