మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
ఏటూరునాగారం: తన భార్యకు మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి సొంత పెద్దనాన్ననే మట్టుబెట్టిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురం అటవీ ప్రాంతంలోని బాసగూడెం(గొత్తికోయగూడెం)లో బుధవారం వెలుగుచూసింది. బాసగూడెంలో సుమారు 40 గొత్తికోయ కుటుంబాలు నివాసముంటున్నాయి. గూడేనికి చెందిన చౌళం వినోద్ భార్య బీమికి ఆరు నెలలుగా ఆరోగ్యం బాగుండడం లేదు. తన పెద్దనాన్న చౌళం మాసయ్య(65)కు మంత్రాలు వస్తాయని, తన భార్యకు అతడే మంత్రాలు చేశాడనే వినోద్ అతడిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు గొడవకు కూడా దిగాడు. అతడిని ఎలాగైనా చంపాలని పథకం పన్నిన వినోద్ వరి పొలం వద్ద దేవతలకు పూజలు చేసేందుకు రావాలని మాసయ్యను కోరాడు. మంగళవారం కత్తి, కోడి, పూజ సామగ్రిని పట్టుకొని అటవీ ప్రాంతానికి వెళ్లారు.
పూజలు చేసే క్రమంలో ఇద్దరు కలిసి కొంత మద్యం తాగారు. అక్కడ పూజలు చేస్తున్నట్లు నమ్మించిన వినోద్ ఒక్కసారిగా మాసయ్యపై దాడి చేసి కత్తితో ఏడు చోట్ల పొడిచి గొంతు కోసి హత్య చేశాడు. మాసయ్య మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. మాసయ్య తమ్ముడు విజయ్ కుమారుడే వినోద్. మృతుడి భార్య చిడుక్కు, కుమారులు భీమయ్య, పోషయ్య ఫిర్యాదు మేరకు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన మంగళవారం జరిగినప్పటికీ అక్కడ నుంచి సెల్‌సిగ్నల్స్, రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో సమాచారం చేరడానికి 24 గంటలు పట్టింది. వినోద్ తండ్రి విజయ్‌ని గూడెం పెద్దమనుషులు బంధించారు. అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. వినోద్ పరారీలో ఉన్నట్లు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment