సజీవ దాహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అరకు సీఐ పైడయ్య, ఎస్‌ఐ గోపాలరావు
శాస్త్రసాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా చాలామందిలో మార్పురావడం లేదు. చేతబడి అనుమానంతో దాడులకు పూనుకుంటున్నారు. అకారణంగా ప్రాణాలను తీస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ శివారులో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని సజీవ దహనం చేసిన సంఘటన సంచలమైంది. ఈ దారుణాన్ని జనం మరువకముందే విశాఖ మన్యంలో ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. డుంబ్రిగుడ మండలం కురిడి పంచాయతీ పుట్టబంద గ్రామానికి చెందిన గిరిజనుడు కిల్లో జయరాం(55) చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతనిపై కొంతమంది దాడికి దిగారు. కర్రలతో కొట్టి..కాళ్లు చేతులుకట్టేసి.. ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఇంత జరిగినా స్థానికులెవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం తెలిసి జిల్లా ప్రజలు నివ్వెరపోయారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, డుంబ్రిగుడ: పుట్టబంద గ్రామానికి చెందిన కిల్లో జయరాం వ్యవసాయ పనులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతనికి భార్య చెల్లిమ్మ, నలుగురు పిల్లలున్నారు. జయరాం చేతబడి చేస్తుంటాడనే అనుమానం స్థానికల్లో చాలారోజులుగా ఉంది. ఎవరికి ఒంట్లో బాగోకపోయినా అతన్నే కారకుడిగా భావించేవారు. చేతబడి చేయడంతోనే తమ వారికి బాగోలేదంటూ తిడుతుండేవారు. తరచూ జయరాంతో గొడవ పడేవారు.
ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పంచాయతీ నిర్వహిస్తున్నామని.. రావాలని కొంతమంది జయరాం ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లారని అతని భార్య చెల్లిమ్మ చెబుతుంది. అయితే పెద్దలెవ్వరూ అక్కడలేకపోవడంతో కొంతమంది తన భర్త జయరాంపై దాడికి దిగి.. కాళ్లు..చేతులను తాళ్లతో కట్టి.. కర్రలతో కొట్టి గ్రామ సమీపంలోని నడిరోడ్డుపైనే ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారని, అడ్డుకున్న తమను కూడా చంపేస్తామని నాటు తుపాకీతో బెదిరించారని చెల్లిమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికి అనారోగ్యంగా ఉన్నా దానికి తన భర్తనే కారణంగా చూపేవారని ఆవేదన వ్యక్తం చేసింది.
రంగంలోకి పోలీసులు
జయరాం సజీవ దహనం ఘటనపై అతని భార్య చెల్లిమ్మ బుధవారం ఉదయం డుంబ్రిగుడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అరకు సీఐ పైడయ్య, డుంబ్రిగుడ ఎస్సై గోపాలరావులు గ్రామానికి వెళ్లారు. సంఘటన స్థలాన్ని..పంచాయతీ ఏర్పాటు చేయాలని భావించిన ప్రదేశాలను పరిశీలించారు. జయరాం సజీవ దహనం అనంతరం మిగిలిన బూడిదను సేకరించారు. జరిగిన ఘోరంపై కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.గ్రామానికి చెందిన కె.పరుశురాం, నందో, మోహన్, ముకుంద్ అనే వ్యక్తులతో పాటు వారి భార్యలు జయరాంను చిత్రహింసలు పెట్టి, పెట్రోల్ పోసి కర్రల్లో పడేసి నిప్పంటించి సజీవ దాహనం చేశారని మృతుని భార్య చెల్లిమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇంత ఘోరం జరిగినా గ్రామస్తులు ఎవరూ కనీసం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అన్ని కోణాల్లో దర్యాప్తు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం అరకు సీఐ పైడయ్య విలేకరులతో మాట్లాడారు. జయరాం సజీవ దహనం ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. బాధ్యులు ఎవరు? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మృతురాలి భార్య చేసిన ఫిర్యాదు మేరకు కొంతమందిపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నవారు పరారీలో ఉన్నారని..వారి కోసం గాలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment