శవ పంచనామా నిర్వహిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్ ) మృతుడు శ్రీను (ఫైల్)
విశాఖపట్నం, కొయ్యూరు(పాడేరు): చెడుపు చేస్తున్నాడని ప్రచారం చేయడమే అతని ప్రాణానికి చేటు తెచ్చింది. నాలుగేళ్లుగా కక్ష పెంచుకున్న నిందితుడు అవకాశం చిక్కగానే నాటుతుపాకీతో కాల్చి హత్య చేశాడు. మండలంలో ఆర్.కొత్తూరు పంచాయతీ మల్లవరం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన హత్యకు చెడుపు ప్రచారమే కారణమని సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన రమణాజీకి చెడుపు ఉందని శ్రీను, అతని తల్లి, మరికొంతమంది కలిసి కొంతకాలం గా ప్రచారం చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యం సోకితే రమణాజీయే కారణమని ప్రచారం చేసేవారు.దీనిపై 2016లో రమణాజీ,శ్రీనులమధ్య ఘర్షణ జరిగింది.దీనిలో శ్రీను గాయపడ్డాడు.
ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రెండేళ్ల పాటు కోర్టులో కేసు నడిచిన తరువాత రాజీ పడ్డారు. నాటి నుంచి శ్రీనును చంపాలని రమణాజీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.ఆదివారం రాత్రి శ్రీను ఒంటరిగా వస్తున్న సమాచారం తెలుసుకుని నాటుతుపాకీ కాల్చాడు. సమాచారం తెలుసుకున్న నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదివారం రాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించారు.ఆయన వెంట కొయ్యూరు, నర్సీపట్నం సీఐలున్నారు. సోమవారం ఉదయం కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్,ఎస్‌ఐ అసిరితాత సంఘటన స్థలానికి వెళ్లి, శవ పంచనామా నిర్వహించారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రమణాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. చెడుపు చేస్తున్నాడని రమణాజీపై శ్రీను తప్పుడు ప్రచారం చేయడంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్నారు.ఇదే హత్యకు దారి తీసిందని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment