దహనం చేసిన ఆనవాళ్లు మృతుడు అప్పారావు (ఫైల్ )
డుంబ్రిగుడ(అరకులోయ): చెరువు తవ్వే విషయంలో ఏర్పడిన వివాదం తండ్రీకొడుకుల హత్యకు దారితీసింది. వైద్యం కోసం బైక్‌పై వెళ్తున్న వారిద్దర్నీ కొసిగుడ గ్రామస్తులు కొందరు బుధవారం రాత్రి కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేయడమే కాకుండా, మృతదేహాలను దహనం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొర్రాయి పంచాయతీ కొసిగుడ గ్రామంలో నాలుగు సెంట్ల భూమిలో చెరువు తవ్వేందుకు ఉపాధి హామీ పథకం కింద గ్రామస్తులు అనుమతి పొందారు. ఆ భూమి గోపాల్‌పేరు మీద ఉందని, గ్రామస్తులు దరఖాస్తు చేయడంతో చెరువు తవ్వడానికి అనుమతి ఇచ్చామని వీఆర్‌పీ ప్రకాష్ తెలిపారు. అయితే పక్క స్థలంలో ఒక సెంటులో ఇప్పటికే గ్రామానికి చెందిన చెందిన తండ్రీకొడుకులైన గెమ్మెలి మోహన్‌రావు(45),కుమారుడు గెమ్మెలి అప్పారావు(26)లు కొండచీపుళ్ల పంట వేశారు.
వారికి భూమి లేకపోవడంతో స్థానిక అధికారుల అనుమతితో ఈ పంట వేశారు. బుధవారం ఆ గ్రామస్తులు చెరువు తవ్వకాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ భూమిలో కొండచీపుళ్ల పంట ఉంది , అది పాడైపోతుందని మోహనరావు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వివాదం జరగడంతో గ్రామస్తులు కొందరు అతనిపై కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న కొడుకు గెమ్మెలి అప్పారావు వచ్చి అడ్డుకోబోయాడు. అతన్ని కూడా కొట్టారు.దీంతో వారిద్దరు ఇంటికి వెళ్లిపోయారు. గాయలపాలైన మోహన్‌రావును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అప్పారావు బైక్ మీద బయలుదేరాడు. అయితే వారు గ్రామం విడిచి వెళ్లడానికి అంగీకరించని స్థానికులు మళ్లీ గొడవ పడ్డారు. తండ్రీకొడుకులపై కర్రలతోదాడి చేశారు. దీంతో వారిద్దరూ మృతి చెందినట్టు మృతుడు మోహనరావు భార్య కన్నమ్మ తెలిపింది. అనంతరం వారి మృతదేహాలను గ్రామస్తులు దహనం చేశారని చెప్పింది.
నాపైనా హత్యా యత్నం
నా భర్త, పెద్ద కుమారుడిని దారుణంగా కొట్టి చంపిన గ్రామస్తులు నన్ను కూడా కొట్టి చంపేం దుకు యత్నించారని కన్నమ్మ తెలిపింది. నాకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా రు. అందులో అప్పారావు పెద్ద కుమారుడని చెప్పింది. భర్తని, కుమారుడిని దారుణంగా హత్య చేసిన వారు తమను కూడా కర్రలతో కొట్టారని వారి నుంచి తప్పించుకుని పరుగులు తీసి రాత్రికిరాత్రికి అరకులోయ మండలం పనకగుడ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నామని తెలిపింది. డుంబ్రిగుడ మండల పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వారు వెంటనే స్పందించి ఉంటే కనీసం చివరిచూపు చూసేందుకు మృతదేహాలైనా ఉండేవని తెలిపింది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో గ్రామస్తులు మృతదేహాలను దహనం చేశారని చెప్పింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె వేడుకుంది.
పథకం ప్రకారమే ..
ఈ హత్యలు పథకం ప్రకారం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని గురువారం అరకు సీఐ కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రీ కొడుకులపై అదే గ్రామానికి చెందిన 12 మంది దాడి చేసినట్టు చెప్పారు. నిందితుల్లో డొంబు,అర్జున్‌త్రినాథ్ అనే వ్యక్తులు ముందుగా దాడిచేసినట్టు నిర్ధారించారు. 12 మందినీ అదుపులో తీసుకుని విచారణ చేస్తామని చెప్పారు. గెమ్మెలి మోహన్‌రావు, గెమ్మెలి అప్పారావుకు గ్రామస్తులకు మధ్య భూ తగాదాలు ఉండేవని, ఆ నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగిన ఉంటాయని తెలిపారు.నిందితులు పరారీలో ఉన్నారని, వారి అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment