రేప్ చేయాలని మేం ఆదేశించలేదు!
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేయాల్సిందిగా తాము ఆదేశించలేదని ఖాప్ పంచాయతీ తాజాగా కొత్త వాదన మొదలుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పేట్ సమీపంలోని సంక్రోట్ గ్రామంలో జాట్ కులానికి చెందిన యువతిని.. దళిత వర్గానికి చెందిన ఓ యువకుడు ప్రేమించడం.. ఆమెకు పెళ్లయిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చి అతడిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే.. ఈ ఘటనతో రెచ్చిపోయిన ఖాప్ పంచాయతీ పెద్దలు.. ఆ యువకుడి ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి.
ఎంతమందిని కలిసినా తమకు న్యాయం జరగడం లేదని, ఊరికి వెళ్తే ఎక్కడ రేప్ చేస్తారోనని అనుక్షణం భయంతో చస్తున్నామని ఆ అక్కాచెల్లెళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఖాప్ పంచాయతీ పెద్దలు కొత్త పల్లవి అందుకున్నారు. అసలు తాము ఆ అక్కా చెల్లెళ్లపై అత్యాచారం చేయాల్సిందిగా ఎప్పుడూ, ఎవరినీ ఆదేశించలేదని చెప్పారు. దీంతో ఈ వివాదం మొత్తం కొత్త మలుపు తిరిగింది.