కూతురు ఉంటే సన్మానం | If the daughter of honor | Sakshi
Sakshi News home page

కూతురు ఉంటే సన్మానం

Published Tue, Jan 5 2016 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

కూతురు ఉంటే  సన్మానం

కూతురు ఉంటే సన్మానం

దుర్మార్గం ఆగింది.
సన్మార్గం మొదలైంది.
స్త్రీజాతిని గౌరవించిన వారికి సత్కారం, సన్మానం!
అవును. ఇది నిజం.
హర్యానాలోని ఖాప్ పంచాయితీల వికృత తీర్మానాల గురించి మనం ఎన్నో విన్నాం.
కానీ ‘జింద్’ జిల్లాలోని ఒక ఖాప్ పంచాయితీ.. మహోన్నత సంస్కృతిని ఆరంభించింది.
మహిళలకు జై కొట్టింది. ‘జై హింద్’లా... జై ‘జింద్’ కొట్టించుకుంది.
 

అగ్రకులం అమ్మాయిని దళిత అబ్బాయి ప్రేమించాడు. పెద్దలకు తెలియకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అమ్మాయి తరపు పెద్దలకు తెలిసింది. ఖాప్ పంచాయితీకి వెళ్లారు. ఆ జంటను పట్టుకురమ్మని ఆదేశాలిచ్చింది పంచాయితీ. అమ్మాయి తరపువాళ్లు ఆ జంట కోసం ఊరు, వాడే కాదు.. చుట్టుపక్కల ఊళ్లూ, అక్కడి వాడలూ గాలించి పట్టుకున్నారు. అమ్మాయిని తీసుకెళ్లి  అంగరంగ వైభవంగా ఇంకో పెళ్లి చేశారు. మొదటి అబ్బాయి జాడను గల్లంతు చేసింది ఖాప్ పంచాయితీ.
   
అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అగ్రకులస్తులే. కానీ వేర్వేరు కులాలు. ఒకరంటే ఒకరు ఇష్టపడి.. పెద్దల అంగీకారం లేకుండా పెళ్లితో ఒకటయ్యారు. అయితే ఇరువైపు పెద్దలు ఊరుకోలేదు. ఖాప్ పంచాయితీ పెట్టించారు. ఇద్దర్నీ విడగొట్టారు. కులాల మధ్య వైరం కారణంగా ఆ తర్వాత ఆ ఊళ్లో ‘పరువు హత్య’ జరిగింది! అమ్మాయిని చంపేశారు.
   
హర్యానాలోని చాలా జిల్లాల్లో ‘ఖాప్ పంచాయితీ’ల తీర్పులు ఇంత దారుణంగానే ఉంటాయి. అక్కడ ఆడపిల్లలు పెద్ద మనిషి అవగానే స్కూల్‌కి వెళ్లడానికి వీల్లేదు. మగపిల్లలతో మాట్లాడ్డానికి లేదు. తలవంచుకొని ఇంటిపట్టునే ఉండాలి. ఆటలు ఆడకూడదు. పాటలు పాడకూడదు. ఆ మాటకొస్తే ముఖం మీద నుంచి ఘూంఘట్ తీయకూడదు. అసలు అమ్మాయి పుట్టనే కూడదు. కడుపులో ఉన్నది ఆడపిండం అని తేలితే అబార్షన్‌తో అంతం చేయాలి. ఒకవేళ పుడితే నోట్లో వడ్లగింజ వేసి ప్రాణం తీసేయాలి! ఎంత అన్యాయం?!
 హర్యానా రాష్ట్రంలో నిత్యం కనిపించే కఠోర వాస్తవాలివి. అమానుషమైన ఇలాంటి తీర్పులను ఇస్తూ, వాటిని అమలయ్యేలా చేస్తూ అంతులేని పాపాన్ని మూటగట్టుకుంటున్నాయి అక్కడి ఖాప్ పంచాయతీలు! ఈ ధోరణి ఎంత ఘోరంగా రూపుదాల్చిందంటే... ఆ ఉచ్చులో అమ్మాయిలు అసలు ఊపిరే పోసుకోలేనంత! దీంతో అక్కడి కుటుంబాలు తాము కోరుకుంటున్నట్లే కేవలం ‘వంశోద్ధారకులను’ మాత్రమే కంటున్నాయి.

ఖాప్... స్థానిక పెద్దల కూటమి
ఖాప్ పంచాయితీ అనేది చట్టానికి అతీతంగా గ్రామాలలో తీర్పులిస్తుండే ఖాప్ పెద్దల స్థానిక కూటమి. ‘ఖాప్’ అగ్రవర్ణాల్లోని ఒక తెగ. అయితే పెళ్లీడుకొచ్చిన వారసులకు పెళ్లాలు కరువైనప్పుడు కానీ ఈ ఖాప్‌లకు తమ తప్పేంటో తెలిసిరాలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు ఉన్నది 877 మంది అమ్మాయిలే. ప్రతి యేడాది 37 వేల మంది అమ్మాయిలు కళ్లు తెవరకుండానే అబార్షన్ అనే విష సంస్కృతితో అమ్మ కడుపులోనే కన్నుమూస్తున్నారు. చివరికిది అనేక దుష్పరిణామాలకు కారణమై, హర్యానాలోని ఖాప్‌లు కళ్లు తెరిచే పరిస్థితిని కల్పించింది. అలా ఆ రాష్ట్రంలో మౌఢ్యం నుంచి ముందుగా బయటపడ్డది జింద్ జిల్లాలోని ‘బురా’ ఖాప్ పంచాయతి! ఆధునిక మార్పులకు అనుగుణంగా తీర్పులుండాలని, అభివృద్ధిలో స్త్రీ, పురుషులిద్దరిదీ సమభాగస్వామ్యమని, ఇద్దరి సంఖ్యా సమానంగా ఉంటే తప్ప ప్రకృతి సమతులంగా ఉండదని గ్రహించిన మొదటి ఖాప్.. రాజ్‌బిర్ బురా! అందుకే అతడు బురా ఖాప్ పంచాయితీలో స్త్రీ, పురుష సమానత్వానికి సంబంధించి ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు.
 
మూడో సంతానం వద్దు

కొడుకు పుట్టకపోతే పున్నామ నరకం నుంచి విముక్తి ఉండదని కొడుకు పుట్టే దాకా సంతానాన్ని కంటూనే ఉన్న కుటుంబాలు కోకొల్లలు హర్యానాలో. ఆ అధిక సంతానం ఎన్నో అనర్థాలకు కారణమైన ఉదాహరణలూ ఉన్నాయి. అందుకే రాజ్‌బిర్ బురా.. కొడుకు కోసం చూడకుండా ఇద్దరు అమ్మాయిలతోనే సంతానాన్ని ఆపేసిన ఆలుమగలకు ప్రోత్సాహకాలు ప్రకటించాడు. అంతేకాదు, నిండు సభలో గ్రామపెద్దతో సత్కారమూ ఉంటుందనీ చాటింపు వేయించాడు.
 
రూపాయి కట్నం
సంతానంగా అమ్మాయిలను వద్దు అనుకోవడానికి అడ్డు అదుపూ లేని వరకట్నం కూడా ఒక కారణమే. అందుకే ఎవరైతే కానీ కట్నం తీసుకోకుండా.. లేదంటే కేవలం ఒక్కరూపాయి కట్నంతోనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో ఆ వరులకు సన్మాన సత్కారాలుంటాయని చెప్పింది రాజ్ బురా నేతృత్వంలోని ఖాప్ పంచాయితీ. ‘భ్రూణహత్యలను, వరకట్న ఆత్మహత్యలను ప్రోత్సహించింది ఖాప్‌లేనని మా మీద చాలా చెడ్డపేరుంది. ఆ మచ్చను పోగొట్టుకోవడానికి .. కట్నమనే దురాచారాన్ని రూపుమాపడానికి మా రాష్ట్ర కార్యనిర్వాహకులు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అంటాడు రాజ్‌బిర్ బురా.  

పెళ్లి అతిథులు 21 మందే!
ఆడంబరాలు అంబరాన్నంటుతూ సాగుతున్న పెళ్లి సంబరాలకు చెక్ పెట్టి అమ్మాయి తరపు వాళ్లు చతికిలబడకుండా చూసే బాధ్యతనూ తీసుకుంది బురా ఖాప్. అందుకే పెళ్లికి అబ్బాయి తరపువాళ్లు తండోపతండాలుగా రాకుండా ముఖ్యమైన వాళ్లు ఇరవై ఒక్క మంది మాత్రమే రావాలని తీర్మానించింది. దీనివల్ల ఆడపెళ్లి వాళ్లకు అనవసర ఖర్చును తప్పించిన వాళ్లమే కాక, ఆహార వృథాను అరికట్టినవాళ్లమూ అవుతామని అంటాడు రాజ్‌బిర్!

ఏడు రోజులే
మనిషి పోతే పదమూడు రోజుల మైలను పాటించమంటుంది హిందూ ధర్మం. దాన్ని ఏడు రోజులకు తగ్గించింది బురా ఖాప్ పంచాయితీ. పదమూడు రోజులు మైల పాటించడం, ఆ పదమూడు రోజులూ బంధువులు రావడం, వచ్చిన వారికి భోజనాలు గట్రా చూసుకోవడం లాంటివన్నీ చనిపోయిన మనిషి కుటుంబం మీద ఆర్థికభారాన్ని మోపుతున్నాయని ఈ తీర్మానం తీసుకున్నారట బురా ఖాప్‌లు. అంతేకాదు ఒకవేళ భర్త చనిపోతే .. ఆ భార్య జీవితాంతం పాటించాల్సిన ఆహార, సామాజిక నియమాలు... అంటే ఒక్కపూటే భోజనం చేయడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు దూరంగా ఉండటమనే దురాచారానికీ స్వస్తి చెప్పారు.
 
మంచికి సన్మానం
గ్రామాల్లో ఆడపిల్లలు, మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, స్పోర్ట్స్‌మెన్, స్వచ్ఛంద సేవాకార్యకర్తలు, రచయితలు.. వీరితోపాటు ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్న టీచర్లనూ సన్మానించాలనీ నిర్ణయించింది బురా ఖాప్. ‘ఇది ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకే’ అంటాడు రాజ్‌బిర్ బురా! ఏమైనా హర్యానాలోని జింద్‌జిల్లా బురాఖాప్ తీసుకున్న ఈ తీర్మానాలు ఈ దేశంలో ఆడపిల్లలను చూసే తీరు మారుతుందనే చిన్న ఆశకు ప్రాణం పోస్తున్నాయి. అమ్మాయి జిందగీ విషయంలో జింద్ దేశానికే ఆదర్శప్రాయమవుతుందేమో చూడాలి!    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement