కూతురు రక్షణకై తెగించిన తండ్రి
బామర్: బలవంతంగా తన మైనర్ కూతురును ఓ 35 ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టాలని చూసిన ఖాప్ పంచాయతీకి వ్యతిరేకంగా ఓ తండ్రి కోర్టు మెట్లెక్కాడు. ఖాప్ పంచాయతీ పెద్దలు చేసిన హెచ్చరికలు సైతం లెక్క చేయకుండా అతడు ఎంతో సాహసంతో కోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనకు సంబంధించి మొత్తం 17మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని బామర్ జిల్లాలోగల గుంగా గ్రామంలో గనరాం ప్రజాపత్ అనే వ్యక్తికి ఓ మైనర్ కూతురు ఉంది.
ఆమెను 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరించడమే కాకుండా అలా చేయకుంటే రూ.25లక్షల ఫైన్ కట్టాలని, సామాజిక బహిష్కరణ ఎదుర్కోవాలని ఈ నెల 1న తీర్పు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని గనరాం ధైర్యం ఇదే 6న కోర్టు మెట్లెక్కాడు. తనకు జరిగిన అన్యాయం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరించాడు. గత ఏడాది కూడా లీలారాం అనే వ్యక్తికి తన కూతురును ఇవ్వాలని ఇబ్బందులు పెట్టారని కోర్టుకు వివరించాడు. దీంతో కోర్టు ఆ ఖాప్ పంచాయతీ పెద్దలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఖాప్ పంచాయతీల తీర్పులను ఉల్లంఘిస్తే సాంఘిక బహిష్కరణతోపాటు, రాళ్లతో కొట్టి చంపించడం, కాల్పిపారేయడంలాంటి వికృత చర్యలు చేస్తుంటారు. వీటన్నింటికీ భయపడకుండా ఆ ప్రాంతంలోని ఓ సగటు తండ్రి చేసింది గొప్ప సాహసమే.