
రాష్ట్రంలో తగ్గుతున్న యువతరం, చిన్నారులు
2036 నాటికి సగటున 60 శాతం పెరగనున్న మధ్య వయస్కూలు, వృద్ధులు
భారీగా తగ్గనున్న 0–29 ఏళ్ల మధ్య వయసు జనాభా
సగటున మైనస్ 20 శాతం వృద్ధిరేటుగా చూపించిన తెలంగాణ అర్థ గణాంక నివేదిక
సాక్షి, హైదరాబాద్: చైనాను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డు సాధించాం. ఏ దేశంతో పోల్చి చూసినా... యువశక్తి అధికంగా ఉన్నది భారత్‌లోనే అని గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే మరో పదేళ్లలో ఈ లెక్క కూడా తప్పే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు పెరిగిన ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణలో యువతరం తగ్గుముఖం పడుతుండగా... వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
యువత తగ్గి మధ్యవయస్కూలు, వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. జాతీయ జనాభా కమిషన్ ఇచ్చిన లెక్కలతో సోమవారం తెలంగాణ ప్రణాళిక శాఖ విడుదల చేసిన రాష్ట్ర జనాభా గణాంకాల్లో వయసుల వారీగా జనాభా వృద్ధి, క్షీణత వివరాలు వెల్లడయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉండగా, 2026 నాటికి 3.86 కోట్లకు చేరుకుంటుందని కమిషన్ అంచనా వేసింది.

2036 నాటికి 4.6 శాతం వృద్ధితో 3.94 కోట్లకు చేరనుంది. ఇందులో పురుషులు 1.97 కోట్లు కాగా, మహిళలు 1.96 కోట్లు. అయితే ఈ పెరిగే జనాభాలో 2021 నుంచి 2036 మధ్య 35 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కల జనాభా గణనీయంగా పెరగబోతోంది. అదే కాలంలో 0 నుంచి 34 ఏళ్ల వయసు గల వారి వృద్ధి రేటు మైనస్ (–)లో ఉండటం గమనార్హం. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు్కలు 20 శాతానికి పైగా తగ్గుతున్నారు.
చిన్నారులు, యువత తగ్గుముఖం
ఓవైపు మధ్య వయస్కూలు, వృద్ధుల సంఖ్య రాబోయే పదేళ్లలో గణనీయంగా పెరుగుతుంటే... అదే స్థాయిలో యువశక్తి తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశం. 2021 నుంచి 2036 మధ్య కాలంలో 20–24 ఏళ్ల వయసు గల వారు 33.94 లక్షల నుంచి 26.26 లక్షలకు తగ్గనుంది. అంటే 22.6 శాతం తగ్గుదలగా నమోదవుతోంది. 25–29 మధ్య వయస్సు గల యువతరం 2021లో 34.16 లక్షలు ఉంటే, 2036 నాటికి 19.3 శాతం తగ్గి 27.57 లక్షలకు చేరుకుంటుంది.
ఇదే క్రమంలో 30 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వారు 33.50 లక్షల నుంచి 30.33 లక్షలకు(–9.5 శాతం) చేరుకోనున్నారు. యువతతో పాటు 0 నుంచి 4 ఏళ్ల వయస్సు గల చిన్నారుల సంఖ్య 2036 నాటికి ఏకంగా 25 శాతం తగ్గుతుండగా, 5నుంచి 9 వయస్సు గల వారు 20 శాతం తగ్గనున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 10–14 మధ్య కౌమార వయసు జనాభాతోపాటు 15–19 మధ్య టీనేజ్ వయసు గల యువతీయువకులు కూడా 17 శాతానికి పైగా తగ్గుతారని జాతీయ జనాభా కమిషన్ పేర్కొంది.