ఆధునిక సమాజంలో ఆటవిక న్యాయమిది. స్వల్ప కారణంతో దురాయి పేరిట కులపెద్దలు వేసే జరిమానాలు చెల్లించలేక పల్లె వాసులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
చీరాల (ప్రకాశం జిల్లా) : ఆధునిక సమాజంలో ఆటవిక న్యాయమిది. స్వల్ప కారణంతో దురాయి పేరిట కులపెద్దలు వేసే జరిమానాలు చెల్లించలేక పల్లె వాసులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బాయపాలెం మత్స్యకార గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు అక్కడికి సమీపంలో ఉన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన క్రిస్టల్ సీ ఫుడ్ కంపెనీలో కూలి పనులకు వెళ్తుంటారు.
కంపెనీ ప్రారంభం రోజు ఫిబ్రవరి 27వ తేదీన నిర్వాహకులు కంపెనీలో పనిచేస్తున్న 20 మత్స్యకార కుటుంబాలను భోజనాలకు ఆహ్వానించారు. అయితే గ్రామస్తులందరినీ కాకుండా కొందరినే భోజనాలకు పిలవటం కులపెద్దలకు కోపం తెప్పించింది. ఆ ఇరవై కుటుంబాల వారిని కూడా వెళ్లవద్దని తీర్మానించారు. కానీ వారు దాన్ని ధిక్కరించి భోజనాలకు వెళ్లారు. అదే వారి పాలిట శాపమైంది. తమ మాట కాదన్నందుకుగాను పంచాయితీ పెట్టి, అందరికీ కలిపి రూ.10 వేలు దురాయి (జరిమానా) విధించారు.
నెల రోజులైనా ఆ సొమ్ము కట్టకపోవడంతో గత గురువారం మళ్లీ కులపెద్దలు వారిని పిలిపించారు. ఇదేమిటని ప్రశ్నించిన కొందరిని కొట్టారు. భయపడిన ఆరుగురు గ్రామస్తులు గ్రామం నుంచి పారిపోయి పక్కనే ఉన్న కఠారివారిపాలెం పెద్దలను కలిసి విషయం వెల్లడించారు. దీంతో ఆ పరిధిలో ఉన్న మత్స్యకార గ్రామాల కులపెద్దలు శుక్రవారం 20 కుటుంబాల వారిని పిలిచి కులపెద్దలు వేసిన జరిమానా సరైనదేనని తేల్చారు. కట్టుబాటును పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కో కుటుంబానికి రూ.8 వేల చొప్పున 20 కుటుంబాల వారికీ జరిమానా విధించి నెల రోజుల్లో చెల్లించాలని హుకూం జారీ చేశారు. కూలి పనులు చేసుకుని పొట్టపోసుకునే తమకు రూ.8 వేలు చెల్లించే స్థోమత లేదని బాధిత కుటుంబాల వారు వాపోతున్నారు.