ఖాకీల కొత్త మార్క్ | new mark of police department | Sakshi
Sakshi News home page

ఖాకీల కొత్త మార్క్

Published Mon, Nov 17 2014 3:56 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM

ఖాకీల కొత్త మార్క్ - Sakshi

ఖాకీల కొత్త మార్క్

* విధుల్లో నిర్లక్ష్యంపై ఉక్కుపాదం
* సస్పెన్షన్లు, పనిష్మెంట్లతో ప్రక్షాళన
* పోలీస్ అక్రమార్కుల్లో వణుకు
* పెండింగ్ మిస్టరీలపైనా నజర్ వేయూలని బాధితుల వేడుకోలు
* క్రమశిక్షణకు పోలీస్ బాస్‌ల పెద్దపీట

వరంగల్ క్రైం : పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి, రూరల్ జిల్లా ఎస్పీతోపాటు ఇన్‌చార్జీ అర్బన్ ఎస్పీగా విధుల్లో చేరిన అంబర్ కిషోర్ ఝా తమదైన శైలిలో ముందుకు సాగుతూ ‘కొత్త మార్క్’ను ప్రదర్శిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ సిబ్బందిపై సత్వర చర్యలు తీసుకుంటూ శాఖను గాడిలో పెడుతున్నారు. నవంబర్ 3న డీఐజీగా బి.మల్లారెడ్డి, అక్టోబర్ 30న ఎస్పీగా అంబర్ కిషోర్‌ఝా బాధ్యతలు చేపట్టారు.

కొంత కాలంగా ఇక్కడే ఓఎస్డీగా పనిచేస్తూ ఎస్పీగా పదోన్నతిపై వచ్చిన కిషోర్‌ఝాకు జిల్లాలోని పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. దీంతోపాటు వరంగల్ జిల్లాలో పనిచేసిన అనుభవం డీఐజీకీ ఉంది. ఈ క్రమంలో వస్తూవస్తూనే జిల్లా పోలీస్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో అర్బన్, రూరల్ ఎస్పీలుగా వెంకటేశ్వర్‌రావు, కాళిదాసు ఉన్న సమయంలో పోలీస్ శాఖలో ఇరు విభాగాల మధ్య విభేదాలు పొడచూపాయి.

అవి తారాస్థాయికి చేరి.. ఒకరి కంటే ఒకరిది పైచేయిగా నిలవాలనే పోటీ నెలకొంది. ఫలితంగా పోలీసు శాఖలో క్రమశిక్షణ కొరవడింది. ఉన్నతాధికారుల మధ్యే పొరపొచ్చాలు ఉండడంతో దాని తీవ్రత కింది స్థాయి సిబ్బందిపై పడింది. దీంతో జిల్లాలో ముఖ్యంగా రూరల్ విభాగంలో పరిస్థితులు తలకిందులయ్యాయి. అర్బన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ.. కొన్నింటిని సమీక్షించడం ద్వారా కొంత మేర కట్టడి చేయగలిగారు. పోలీసు శాఖలో పట్టుతప్పిన క్రమశిక్షణపై డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ కిషోర్ ఝా దృష్టి సారించారు.

క్రమశిక్షణకు పెద్దపీట వేసే పనిలో నిమగ్నమై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అక్రమార్కులను సస్పెండ్ చేయడం ద్వారా తాము కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలను సిబ్బందికి చేరవేశారు. ఎస్పీలు బదిలీలు అయి.. విధుల్లో చేరే సమయంలో కిడ్నాపింగ్ ముఠాలు బరితెగించాయి. వరంగల్‌లో ఒక కిడ్నాప్, హన్మకొండలో ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి హత్యకు పథకం రచించి అడ్డంగా పోలీసుకు దొరికిపోయారు.

అదేవిధంగా పాలకుర్తిలో ఒక వ్యక్తి హత్యకు కుట్రపన్ని కటకటాలపాలయ్యారు. మార్చి 21వ తేదీన సుబేదారిలో నివసిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్‌డ్డి కిడ్నాప్ కథలో నిందితులు మొత్తంగా దొరక్కముందే కొన్ని ముఠాలు మళ్లీ కిడ్నాప్‌లకు పాల్పడడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో విద్రోహక శక్తులపై ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకున్నారు.
 
డీఐజీ ఇలా..
కరీంనగర్ రేంజ్ క్రైం కంట్రోల్ స్క్యాడ్ సీఐగా పనిచేస్తున్న సాంబయ్య ఇంటర్నెట్ కనెక్షన్ల మరమ్మతుల కోసం వచ్చిన ఇద్దరు యువకులపై దాడి చేశాడు. గతంలో కూడా వివాదాస్పదమైన అధికారిగా పేరొందిన సాంబయ్యను డీఐజీగా మల్లారెడ్డి వచ్చీ రాగానే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎసైగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన రాజును సస్పెండ్ చేశారు. దొంగతనం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సంపేట రూరల్ సీఐ జి.మధును బదిలీ చేశారు. హైదరాబాద్‌లోని లాడ్జ్‌లో దొరికిన కరీంనగర్ సీఐ స్వామి, వరంగల్ మహిళా స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మిని డీఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.
 
ఎస్పీ కిషోర్ ఝా ఇలా..
పరకాల పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌పై సమాచారం ఇవ్వని సిబ్బందిపై ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రౌడీషీటర్ సమాచారం ఇచ్చిన కానిస్టేబుల్‌కు రివార్డు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. గూడూరు పీఎస్ పరిధిలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సైపై అక్కడికక్కడే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుబేదారి పీఎస్ పరిధిలోని బాలసముద్రంలో పేకాట ఆడుతూ పట్టుబడిన మహిళా అర్బన్ పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ సారయ్యను సస్పెండ్ చేశారు.

కాకతీయ యూనివర్సిటీ భూములు ఆక్రమించుకున్న పలివేల్పుల మాజీ సర్పంచ్‌పై రౌడీషీట్ నమోదు చేసి భూకబ్జాదారుల్లో వణుకు పుట్టించారు. నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన కఠిన చర్యలకు ఉపక్రమించారు. రాత్రి 11 తర్వాత కనిపించిన వారిని అదుపులోకి తీసుకోవాలని, లాఠీ ఠూళిపించాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం.
 
సార్.. వీటిపైనా దృష్టి పెట్టరూ...
పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలు పెట్టిన డీఐజీ, ఎస్పీ వరంగల్ అర్బన్‌లోని పెండింగ్‌లో ఉన్న కేసులపైని దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపాల్‌కాలనీలో వివాహిత హత్య జరిగి నెలలు గడుస్తున్నా.. ఎలాంటి క్లూ దొరకలేదు. మిట్టమధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అత్యంత దారుణంగా సర్జికల్ బ్లేడు ఉపయోగించి హత్య చేశారు. తెలిసిన వారే ఈ హత్య చేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఈ కేసులో పురోగతి లేకపోవడం పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విషయం.

హంటర్‌రోడ్డులోని నందిహిల్స్‌లో మిట్టమధ్యాహ్నం సీబీఐ అధికారుల పేరుతో రూ.50 లక్షల దోపిడీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును చేధించడంలో పోలీసులు చతికిలపడ్డారు. ఫ్యామిలీ డ్రామాగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేసినప్పటికీ.. ఆధారాలు కనుగొనడంలో విఫలమయ్యార నే అపఖ్యాతిని సుబేదారి పోలీసులు మూటగట్టుకున్నారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈరెండు కేసులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండడం పోలీసుల అసమర్థతకు నిదర్శనంగా మారాయి.

వరంగల్ గొర్రెకుంటలోని కొలంబో కాలనీలో వద్ద దంపతుల హత్య జరిగి నెలలు కావస్తోంది. అయినప్పటికీ విచారణలో ఒక్కడుగు ముందుకు పడలేదు. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు గీసుగొండ పోలీసులు నానాతంటాలు పడుతున్నా.. కొలిక్కి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటి మిస్టరీని పోలీసులు చేధించలేరేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్న  నేపథ్యంలో కొత్తగా వచ్చిన అధికారులు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
 
నర్సంపేట డీఎస్పీపై చర్య తీసుకునేనా..
విధుల నిర్వహణ విషయంలో విమర్శలు, విచారణ ఎదుర్కొంటున్న నర్సంపేట డీఎస్పీ కడియం చక్రవర్తిపై గతంలో ఇక్కడ పనిచేసిన పోలీసు అధికారులు చర్యలకు వెనుకంజ వేసినట్లు తెలిసింది. కడియం చక్రవర్తి తన పరిధిలో చిన్న చిన్న కారణాలు చూపుతూ అనేక మందిని చిత్రహింసలకు  గురిచేసిన విషయంపై అప్పటి డీఐజీ కాంతారావు, రూరల్ ఎస్పీ కాళిదాసుకు మానవహక్కుల వేదిక నాయకులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు చివరకు చర్యల విషయంలో స్తబ్దుగా ఉండిపోయారు. కొత్తగా వచ్చిన అధికారులు నర్సంపేట డీఎస్పీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పోలీసు వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement