‘జైలు’ కూడు
ఏదైనా శిక్ష పడి, ‘జైలు కూడు’ తినడం లేదు వీళ్లు. అందరూ స్వచ్ఛంద ఖైదీలు! తియాంజిన్ నగరంలో కారాగారపు థీమ్‌తో రూపొందిన రెస్టారెంటు ఇది. చైనాలో ఇలాంటి థీమ్ రెస్టారెంట్లకు మంచి ఆదరణ ఉంది. చట్టాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా మసలుకొమ్మని గుర్తుచేసే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
బతుకు వల
ఐక్యరాజ్యసమితి ప్రకారం, అర్ధశతాబ్దిలో ప్రపంచజనాభా 900 కోట్లకు చేరుతుందట! ఇంతలా పెరిగే జనానికి సరిపోయే ఆహారం కాగలిగేదేమిటి? సమాధానం: చేప(ట)! వియత్నాంలోని థన్ ఓయ్ జిల్లాలోని ఒక వరిక్షేత్రం పక్కనే పారుతున్న కాలువలో చేపలు పడుతున్న జాలరిని ఫొటోలో చూడవచ్చు.
అశ్వ నాగలి
ఫొటోలో ఉన్నది ఒక అమెరికా రైతు. పేరు డాన్ హుయీస్. గుర్రాలను కట్టిన ‘హారో’తో నేలను సాగుచేస్తున్నాడు. ఇది ఏకకాలంలో నేలను పెళ్లగిస్తూ, చదును కూడా చేస్తుంది. ఇంతకీ ఈయన పనిచేస్తుంది గొర్రె పాడిపరిశ్రమ క్షేత్రంలో. ఆవు, గేదె, మేకల్లా గొర్రె పాలకు అంత ప్రఖ్యాతి లేకపోయినా, వాటిని పాలసంబంధిత ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.