United Nations Committee
-
బైడెన్ టీమ్ మనవాళ్లే మరో ఇద్దరు
ట్రంప్ తన నాలుగేళ్ల పదవీ కాలంలో లోకంతో అనేక తగాదాలు పెట్టుకున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితినీ, ప్రపంచ ఆరోగ్య సంస్థనూ ఆయన వదల్లేదు! ‘మా డబ్బు తీసుకుంటూ మాకు శత్రువులు అయినవారికి అనుకూలంగా ఉంటారేంటి!’ అని ఆయన ఘర్షణ. ‘శత్రు దేశాలు ఉంటాయి కానీ.. సమితులకు, సంస్థలకు అన్నీ స్నేహదేశాలే’ అని వారి సమాధానం. ఇప్పుడీ దెబ్బతిన్న సంబంధాలన్నిటినీ కొత్త అధ్యక్షుడు బైడెన్ చక్కబెట్టుకుంటూ రావాలి. అందుకే ఆయన ఆచితూచి రాయబార సిబ్బందిని ఎంపిక చేసుకుంటున్నారు. ఆ వరుసలో తాజాగా అపాయింట్ అయినవారే సోహినీ చటర్జీ, అదితీ గొరూర్. ఇద్దరూ భారత సంతతి అమెరికన్లు. ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా సోహినీ చటర్జీ వెళుతున్నారు. ఆమెతోపాటు పాలసీ అడ్వైజర్‌గా ఆమెకన్నా వయసులో చిన్నవారైన అదితీ గొరూర్. అమెరికా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కీలకమైన స్థానాలకు ఎంపికైనవారు. ఈ ఇద్దరినే బైడెన్ తీసుకోడానికి తగిన కారణాలే ఉన్నాయి. సోహినీ ఇటీవలి వరకు కొలంబియా విశ్వవిద్యాలయంలోని ‘అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల విద్యాసంస్థ’ లో సహాయ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల అర్థిక పరిస్థితులు, జాతుల అణచివేతలు, ఘర్షణల మూలాలు సోహినీ మునివేళ్లపై ఉంటాయి. ఏ వేలితో ఏ మీటను నొక్కితే సమస్యకు పరిష్కారం క్రియాశీలం అవుతుందో ఆమెకు తెలుసు. యు.ఎస్.ఎ.ఐ.డి. (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్)లో కూడా సోహినా కొన్నాళ్లు పని చేశారు. అక్కడి పాలసీ, ప్లానింగ్, లెర్నింగ్ బ్యూరోలో ఆమె పని. ఒబామా హయాంలో బైడన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సోíß నీ సీనియర్ పాలజీ అడ్వైజర్‌గా పని చేశారు. ఆ అనుభవం చూసే బైడెన్ ఇప్పుడు ఆమెను ఎంపిక చేసుకున్నారు. లాయర్ గా కూడా సోహినీ ప్రసిద్ధురాలు. ∙∙ అదితి గొరూర్ ఇంతకుముందే యు.ఎన్.తో కలిసి పనిచేశారు. సమితి శాంతి పరిరక్షక విభాగంలో నిపుణురాలిగా ఉన్నారు. ప్రపంచాన్ని మెరుగుపరిచే వినూత్న ఆవిష్కణల కోసం కృషి చేస్తుండే ప్రఖ్యాత స్టిమ్సన్ సెంటర్ (వాషింగ్టన్) లో అదితి కాన్ఫ్లిక్ట్స్ ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా పని చేశారు. జాతుల ఘర్షణల నుంచి పౌరులను కాపాడటం ఆ కార్యక్రమ లక్ష్యం. స్టిమ్సన్‌లో చేరకముందు అదితి బెంగళూరు లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్’లో, వాషింగ్టన్ డీసీలోని ‘ఏషియన్ ఫౌండేషన్ అండ్ సెంటర్ ఫర్ లిబర్టీ ఇన్ ది మిడిల్ ఈస్ట్’ సంస్థలో, మెల్బోర్న్ లోని ‘యూనివర్సిటీ లా స్కూల్’లో మానవ హక్కుల పరిరక్షణపై అధ్యయనం జరిపారు. ఆమె చదివింది కూడా అదే చదువు. జార్జిటౌన్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ సెక్యూరిటీ’లో ఎం.ఎం చేశారు. మెల్బోర్న్ యూనివర్సిటీలో ఆనర్స్‌తో ‘లా’ చదివారు. అదితి నైజీరియాలోని లాగోస్ లో పుట్టారు. ఇండియా, ఓమన్, ఆస్ట్రేలియాల్లో పెరిగారు. యు.ఎస్.లో స్థిరపడ్డారు. -
పాక్ మైనార్టీలపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
సాక్షి, ఇంటర్నెట్ డెస్క్ : ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న పరిణామాలతో ఇక్కడి మైనార్టీల భద్రత గురించి అనవసరంగా ఆందోళన చెందుతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, తన దేశంలో ఉన్న మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఆర్టికల్ 370, 35ఏ, పౌరసత్వ సవరణ బిల్లులపై సత్వరం ట్విటర్లో స్పందించే ఇమ్రాన్, పాక్‌లోని మైనార్టీల సంరక్షణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ విషయంలో పాక్ వైఖరిని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితిలోని కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ వుమెన్ అనే విభాగం ఈ నెలలో వెలువరించిన నివేదికలో పాకిస్తాన్‌లోని మైనార్టీల పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసింది. 2017 నుంచి మతపర మైనార్టీల పిల్లలను ఇంటర్వ్యూ చేసి రూపొందించిన 47 పేజీల నివేదికలో హిందువులు, క్రిస్టియన్లు, అహ్మదీయులపై జరుగుతున్న హింసను కమిషన్ ప్రధానంగా ప్రస్తావించింది. వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని, బలవంతపు మత మార్పిడిలు, బాల్య వివాహాలు, యువతుల అపహరణ వంటివి యధేచ్ఛగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. వాటిని నిరోధించడంలో ఇమ్రాన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించింది. మైనార్టీలపై మతపరమైన దాడులు చేయడానికి వివక్షతో కూడిన చట్టాలు రూపొందించి, తీవ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం అధికారమిచ్చిందని మండిపడింది. ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో బాలికలను బలవంతపు మత మార్పిడిలు చేయడం, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి ఘటనలపై మైనార్టీలు ఫిర్యాదు చేస్తే తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, పోలీసుల అలసత్వం, లోపభూయిష్ట న్యాయవ్యవస్థ వల్ల బాధితులకు న్యాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని వివరించింది. చాలా సందర్భాల్లో కిడ్నాప్‌కు గురైన వారు తిరిగి వస్తారనే నమ్మకుం కూడా ఆయా కుటుంబ సభ్యులకు లేదని వెల్లడించింది. అలాగే దైవ దూషణ కేసులు పెరిగిపోవడంపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని ప్రయోగించి మైనార్టీలను చంపడమో లేక బలవంతపు మతమార్పిడి చేయడమో చేస్తున్నారని వివరించింది. మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉండడం, నిరక్షరాస్యత వంటి కారణాలతో మెజార్టీ ప్రజలకు సులువుగా లక్ష్యంగా మారుతున్నారని స్పష్టం చేసింది. ముఖ్యంగా సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లో మైనార్టీల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, ఇందుకు ఉదాహరణగా సింధ్ ప్రావిన్స్‌లోని మీర్‌పూర్‌ఖాస్‌లో జరిగిన ఉదంతాన్ని చూపించింది. హిందూ మతానికి చెందిన పశు వైద్యుడు రమేష్ కుమార్ మల్హి అనే వ్యక్తి ఖురాన్ శ్లోకాలు ఉన్న పేపర్లో మందులు చుట్టి ఇచ్చాడని అతని ఆస్పత్రిని నిరసనకారులు తగులబెట్టారు. అంతేకాక, చుట్టుపక్కల హిందువులకు చెందిన వ్యాపార దుకాణాలను తగులబెట్టారని పేర్కొంది. ఇలాంటి ధోరణి పాఠశాలలకు కూడా పాకిందని, మైనార్టీ విద్యార్థుల పట్ల తోటి విద్యార్థులు బెదిరించడం, ఆట పట్టించడం, అవమానపరచడం, వేరుగా కూర్చోబెట్టడం వంటివి చేస్తున్నారని తెలిపింది. వారు శారీరకంగా, మానసికంగా అనేక వేధింపులకు గురవుతున్నారని నివేదికలో పొందుపరిచింది. గత మూడు దశాబ్దాలుగా దేశంలో ఉగ్రవాదం పెరగడం, చట్టాల దుర్వినియోగం, తప్పుడు కేసుల వల్ల మతహింస దారుణంగా పెరిగిపోయిందని నొక్కిచెప్పింది. దైవ దూషణ చట్టం, అహ్మదీయ వ్యతిరేక చట్టం లాంటివి మతపరమైన మైనార్టీలను హింసించడానికే కాకుండా రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా కూడా ఉపయోగపడుతున్నాయని వివరించింది. వీటిని అడ్డుకోవడానికి మానవ హక్కుల నేతలు ఎవరైనా కలుగజేసుకుంటే వారికీ తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేస్తున్నారని వివరించింది. ఇలాంటి ధోరణుల వల్ల సమాజంలో అసమతౌల్యత అసాధారణంగా పెరిగిపోయిందని, దీన్ని నివారించడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించాలని సూచించింది. చదవండి (‘భారత్‌లాగే పాక్‌లో పౌరసత్వ బిల్లు పెట్టాలి’) -
‘జైలు’ కూడు
ఏదైనా శిక్ష పడి, ‘జైలు కూడు’ తినడం లేదు వీళ్లు. అందరూ స్వచ్ఛంద ఖైదీలు! తియాంజిన్ నగరంలో కారాగారపు థీమ్‌తో రూపొందిన రెస్టారెంటు ఇది. చైనాలో ఇలాంటి థీమ్ రెస్టారెంట్లకు మంచి ఆదరణ ఉంది. చట్టాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా మసలుకొమ్మని గుర్తుచేసే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. బతుకు వల ఐక్యరాజ్యసమితి ప్రకారం, అర్ధశతాబ్దిలో ప్రపంచజనాభా 900 కోట్లకు చేరుతుందట! ఇంతలా పెరిగే జనానికి సరిపోయే ఆహారం కాగలిగేదేమిటి? సమాధానం: చేప(ట)! వియత్నాంలోని థన్ ఓయ్ జిల్లాలోని ఒక వరిక్షేత్రం పక్కనే పారుతున్న కాలువలో చేపలు పడుతున్న జాలరిని ఫొటోలో చూడవచ్చు. అశ్వ నాగలి ఫొటోలో ఉన్నది ఒక అమెరికా రైతు. పేరు డాన్ హుయీస్. గుర్రాలను కట్టిన ‘హారో’తో నేలను సాగుచేస్తున్నాడు. ఇది ఏకకాలంలో నేలను పెళ్లగిస్తూ, చదును కూడా చేస్తుంది. ఇంతకీ ఈయన పనిచేస్తుంది గొర్రె పాడిపరిశ్రమ క్షేత్రంలో. ఆవు, గేదె, మేకల్లా గొర్రె పాలకు అంత ప్రఖ్యాతి లేకపోయినా, వాటిని పాలసంబంధిత ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. -
వరదలు.. ఆకలి.. వలసలు.. !
వాతావరణ మార్పు వల్ల ఈ శతాబ్దంలో పెనుముప్పు ప్రపంచదేశాలకు ఐరాస నిపుణుల కమిటీ హెచ్చరిక యొకొహామా (జపాన్): వాతావరణ మార్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా వరదలు, కరువు ముప్పు ఈ శతాబ్దంలో మరింత తీవ్రం కానున్నాయని, ఫలితంగా ఆకలి, వలసలు పెరిగి సామాజిక సంఘర్షణలు సైతం అధికం కానున్నాయని ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ హెచ్చరించింది. కార్బన్ ఉద్గారాలు పెరిగి వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రభావాలపై అధ్యయనం చేసిన ఐరాస ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)’ ఈ మేరకు సోమవారం కీలకమైన తన రెండో నివేదికను విడుదల చేసింది. కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే గనక.. ప్రపంచవ్యాప్తంగా ఆస్తులకు, పర్యావరణ వ్యవస్థలకు లక్షల కోట్ల డాలర్ల నష్టం తప్పదని కమిటీ హెచ్చరించింది. ఉష్ణోగ్రత ఒక్కో డిగ్రీ పెరిగినకొద్దీ పరిస్థితి తీవ్రం అవుతుందని, తర్వాత కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. -
స్ఫూర్తిని రగిలించే ‘యుగ్మలి’
మేఘశ్యామ్, కోట శంకర్రావు, అల్లరి సుభాషిణి, అనుశ్రీ, జోగినాయుడు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘యుగ్మలి’. మేఘశ్యామ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈదర హరిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేఘశ్యామ్ మాట్లాడుతూ -‘‘నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది. ఆ కసితో ఈ సినిమా తీశాను. విడుదలకు ముందే... ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన... అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డును సొంతం చేసుకుందీ సినిమా. సమాజంలో స్ఫూర్తిని రగిలించే ఈ సినిమా తప్పక ప్రేక్షకాదరణ పొందుతుందని నా నమ్మకం’’ అని తెలిపారు. విశ్వేశ్వరశాస్త్రి, అంద్శై రాజేంద్రరెడ్డి, కలివేర వెంకటేశ్వరరావు, గాయని కౌసల్య తదితరులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సమర్పణ: రామభక్త సీతయ్య కళాపరిషత్, నిర్మాణం శిల్పా చలనచిత్రం. -
మన నిర్వాకం వల్లే భూతాపోన్నతి!
స్టాక్‌హోం: భూతాపం అంతకంతకూ పెరగడానికి మనుషుల పనులే ముఖ్య కారణమనడానికి మరిన్ని రుజువులు దొరికాయని ఐక్యరాజ్యసమితి కమిటీ పేర్కొంది. ఈ శతాబ్దాంతానికి 0.3 నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ మేరకు భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనావేసింది. వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ) శుక్రవారం వెలువరించిన తాజా నివేదిక ప్రకారం.. సముద్ర మట్టం 2100 నాటికి 26 నుంచి 82 సెంటీమీటర్ల మేరకు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. భూతాపోన్నతి వల్ల వడగాడ్పులు, వరదలు, కరువు బెడదలు తీవ్రతరమవుతాయని ఈ నివేదిక హెచ్చరించింది. మానవాళి శిలాజ ఇంధనాల వినియోగాన్ని భారీగా తగ్గించడం ప్రారంభిస్తే తప్ప మున్ముందు ఎదురయ్యే వాతావరణ విపత్తుల ముప్పును తగ్గించుకోలేమన్న విషయం ఐపీసీసీ తాజా నివేదిక ద్వారా విస్పష్టమవుతోందని పర్యావరణ కార్యకర్తలు, శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. గత 60 ఏళ్లలో భూతాపం పెరగడానికి సగానికి సగం కారణం మనుషులేనని చెబుతూ.. ఈ విషయంపై 95%నిర్థారణకు వచ్చినట్లు ఐపీసీసీ శాస్త్రవేత్తల బృందం తాజా నివేదికలో పేర్కొంది. 2007లో ఈ బృందం వెలువరించిన నివేదికలో దీన్ని 90 శాతంగా పేర్కొంది. అంటే.. మానవాళి నిర్వాకం వల్లే భూతాపం పెరుగుతోందని రోజులు గడుస్తున్నకొద్దీ బలమైన ఆధారాలు లభిస్తున్నాయన్న మాట. ఐపీసీసీ తాజా నివేదిక మానవాళికి ఒక హెచ్చరిక వంటిదని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగాధిపతి క్రిస్టినా ఫిగ్యురెస్ వ్యాఖ్యానించారు. మానవాళిని పెనుముప్పు నుంచి తప్పించేందుకు జాతీయ ప్రభుత్వాలు తక్షణం భూతాపోన్నతిని తగ్గించే చర్యలకు శ్రీకారం చుట్టాలని, 2015లో జరిగే వాతావరణ సమావేశాల్లో పటిష్టమైన ఒడంబడిక చేసుకోవాలని ఆమె సూచించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ కూడా ఈ నివేదికను జాగ్రత్తపడేందుకు కాలం మించిపోతున్నదని తెలియజెప్పే హెచ్చరికగా భావించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐపీసీసీ గత 25 ఏళ్లలో నాలుగు నివేదికలను వెలువరించింది. భూతాపోన్నతి స్థితిగతులపై రూపొందించ తలపెట్టిన మూడు నివేదికల వరుసలో ఇప్పుడు వెలువరించినది మొదటిది. అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రకృతి వైపరీత్యాల తీవ్రత మరింత పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల అధిక విని యోగం వల్ల భూఉపరితల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలకు సంబంధించిన కంప్యూటర్ నమూనాల ప్రాతిపదిక గా 2100 నాటికి ఉష్ణోగ్రత ఎంత పెరిగే అవకాశం ఉందో ఐపీసీసీ అంచనా వేసింది.