స్టాక్‌హోం: భూతాపం అంతకంతకూ పెరగడానికి మనుషుల పనులే ముఖ్య కారణమనడానికి మరిన్ని రుజువులు దొరికాయని ఐక్యరాజ్యసమితి కమిటీ పేర్కొంది. ఈ శతాబ్దాంతానికి 0.3 నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ మేరకు భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనావేసింది. వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ) శుక్రవారం వెలువరించిన తాజా నివేదిక ప్రకారం.. సముద్ర మట్టం 2100 నాటికి 26 నుంచి 82 సెంటీమీటర్ల మేరకు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. భూతాపోన్నతి వల్ల వడగాడ్పులు, వరదలు, కరువు బెడదలు తీవ్రతరమవుతాయని ఈ నివేదిక హెచ్చరించింది.
మానవాళి శిలాజ ఇంధనాల వినియోగాన్ని భారీగా తగ్గించడం ప్రారంభిస్తే తప్ప మున్ముందు ఎదురయ్యే వాతావరణ విపత్తుల ముప్పును తగ్గించుకోలేమన్న విషయం ఐపీసీసీ తాజా నివేదిక ద్వారా విస్పష్టమవుతోందని పర్యావరణ కార్యకర్తలు, శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. గత 60 ఏళ్లలో భూతాపం పెరగడానికి సగానికి సగం కారణం మనుషులేనని చెబుతూ.. ఈ విషయంపై 95%నిర్థారణకు వచ్చినట్లు ఐపీసీసీ శాస్త్రవేత్తల బృందం తాజా నివేదికలో పేర్కొంది. 2007లో ఈ బృందం వెలువరించిన నివేదికలో దీన్ని 90 శాతంగా పేర్కొంది. అంటే.. మానవాళి నిర్వాకం వల్లే భూతాపం పెరుగుతోందని రోజులు గడుస్తున్నకొద్దీ బలమైన ఆధారాలు లభిస్తున్నాయన్న మాట.
ఐపీసీసీ తాజా నివేదిక మానవాళికి ఒక హెచ్చరిక వంటిదని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగాధిపతి క్రిస్టినా ఫిగ్యురెస్ వ్యాఖ్యానించారు. మానవాళిని పెనుముప్పు నుంచి తప్పించేందుకు జాతీయ ప్రభుత్వాలు తక్షణం భూతాపోన్నతిని తగ్గించే చర్యలకు శ్రీకారం చుట్టాలని, 2015లో జరిగే వాతావరణ సమావేశాల్లో పటిష్టమైన ఒడంబడిక చేసుకోవాలని ఆమె సూచించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ కూడా ఈ నివేదికను జాగ్రత్తపడేందుకు కాలం మించిపోతున్నదని తెలియజెప్పే హెచ్చరికగా భావించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఐపీసీసీ గత 25 ఏళ్లలో నాలుగు నివేదికలను వెలువరించింది. భూతాపోన్నతి స్థితిగతులపై రూపొందించ తలపెట్టిన మూడు నివేదికల వరుసలో ఇప్పుడు వెలువరించినది మొదటిది. అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రకృతి వైపరీత్యాల తీవ్రత మరింత పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల అధిక విని యోగం వల్ల భూఉపరితల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలకు సంబంధించిన కంప్యూటర్ నమూనాల ప్రాతిపదిక గా 2100 నాటికి ఉష్ణోగ్రత ఎంత పెరిగే అవకాశం ఉందో ఐపీసీసీ అంచనా వేసింది.