మద్యం మత్తులో వాహనాలు నడిపిన 23 మందికి న్యాయస్థానం శిక్షలు విధించింది. అతిగా మద్యం తాగిన ఒకరికి 72 గంటలపాటు జైలు శిక్ష విధిస్తూ మేడ్చల్ మెట్రోపాలిటన్ సెవెన్త్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్) : మద్యం మత్తులో వాహనాలు నడిపిన 23 మందికి న్యాయస్థానం శిక్షలు విధించింది. అతిగా మద్యం తాగిన ఒకరికి 72 గంటలపాటు జైలు శిక్ష విధిస్తూ మేడ్చల్ మెట్రోపాలిటన్ సెవెన్త్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అల్వాల్ ట్రాఫిక్ సీఐ నర్సింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శని, ఆది, సోమవారాల్లో పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్, సుచిత్ర చౌరస్తా, అల్వాల్ రోడ్డు, ఎన్‌సీఎల్ సుభాష్‌నగర్ పైపులైన్ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా 23 మంది వాహనదారులు పట్టుబడ్డారు.
వీరిని మంగళవారం మేడ్చల్ కోర్టుకు తరలించగా అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తికి 72 గంటల జైలు శిక్ష, రూ. 3,500 జరిమానా విధించింది. అదే విధంగా మరొకరికి రూ.2,500 జరిమానా, రెండు గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మరో 21 మందికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించి కౌన్సెలింగ్ ఇవ్వాలని తీర్పునిచ్చింది.