డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌: తాగినట్టు రావడానికి కారణం ఇదే! | Controversy On Drunk And Drive Tests In hyderabad | Sakshi
Sakshi News home page

లిక్కర్‌..లిటిగేషన్‌

Published Mon, Aug 27 2018 8:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Controversy On Drunk And Drive Tests In hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్‌ పోలీసుల చేతిలో ఉండే బ్రీత్‌ అనలైజర్‌ (శ్వాస పరీక్ష యంత్రం) తొలిసారిగా వివాదాస్పదమైంది. సుల్తాన్‌బజార్‌ పోలీసులు శనివారం రాత్రి కాచిగూడ ఐనాక్స్‌ వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. జహీరుద్దీన్‌ ఖాద్రీ అనే వ్యక్తిని పరీక్షించగా...బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ 43గా వచ్చింది. దీన్ని విభేదించిన ఆయన శాంతిభద్రతల విభాగం పోలీసుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో ఆయన మద్యం తాగలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై కోర్టు తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ కానుంది. సిటీలో డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ (డీడీ) పరీక్షల నిర్వహణ ప్రారంభించి ఆరున్నరేళ్లు అయింది. ఇన్నేళ్ల కాలంలో ఇలా వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి.

2011 నవంబర్‌ నుంచి మొదలు...
‘నిషా’చరులను గుర్తించడానికి ఉద్దేశించిన డీడీ పరీక్షల్ని ట్రాఫిక్‌ పోలీసులు 2011 నవంబర్‌ 4 నుంచి ప్రారంభించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జైలు శిక్షలు విధించే అవకాశం మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్‌ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్‌ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తున్నారు. మద్యం తాగి చిక్కిన వారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్‌ 185 ప్రకారం బుక్‌ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ పోలీసులు గతంలో ‘నిషా’చరులను ర్యాష్‌ డ్రైవింగ్‌ (సెక్షన్‌ 184 బి) కిందే నమోదు చేసి ఫైన్‌తో సరిపెట్టేవారు. 2011 నుంచి మాత్రం సెక్షన్‌ 185 ప్రకారం బుక్‌ చేసి కోర్టుకు తరలిస్తున్నారు. బ్రీత్‌ అనలైజర్‌ నుంచి వచ్చిన ప్రింట్‌ అవుట్‌ను ఆధారంగా చూపి చిక్కిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడతారు. ఈ  ఉల్లంఘనకు రూ.2 వేల నుంచి  రూ.3 వేల వరకు న్యాయస్థానం ఫైన్‌ వేస్తుంది. చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం సేవించాడని న్యాయమూర్తి భావిస్తే గరిష్టంగా 2 నెలల వరకు జైలు శిక్షకూ అవకాశం ఉంది. రెండోసారీ ఇదే రకమైన ఉల్లంఘన/నేరం చేసి చిక్కితే...రూ. 3 వేల ఫైన్‌ లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఆ చట్ట ప్రకారం ఉంది. ప్రస్తుతం నగర ట్రాఫిక్‌ పోలీసులు 30కి బదులు 35 కౌంట్‌ వస్తేనే ఉల్లంఘనగా పరిగణించి కేసు నమోదు చేస్తున్నారు. 

ఇటీవలే కొన్ని మార్పులు సైతం...
డీడీ పరీక్షల కోసం వినియోగిస్తున్న శ్వాసపరీక్ష యంత్రాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినవి అని నగర ట్రాఫిక్‌ పోలీసులు చెప్తున్నారు. ఫలితంగానే పరీక్ష తర్వాత దీని నుంచి ప్రింట్‌ ఔట్‌ను ఆధారంగా న్యాయస్థానాలు సైతం అంగీకరిస్తున్నాయని అంటున్నారు. ఈ యంత్రాల్లో ఇటీవలే కొన్ని మార్పులు చేస్తూ వెనుక వైపు క్లాంప్స్‌ సైతం ఏర్పాటు చేశారు. పరీక్ష చేయాల్సిన వ్యక్తి నుంచి బ్రీత్‌ ఎనలైజర్‌కు పైన ఉండే పైప్‌లో గాలి ఊదిస్తారు. ఈ గాలి యంత్రం లోపలికి వెళ్ళి.. వెనుక ఉండే రంధ్రం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ కాలంలోనే యంత్రం శ్వాస పరీక్ష ద్వారా మద్యం తాగింది? లేనిది? ఎంత తాగారనేది? లెక్కించి చెప్తుంది. ఓ వ్యక్తిని పరీక్షించడానికి, మరో వ్యక్తిని పరీక్షించడానికి మధ్యలో ఒకరు ఊదిన గాలి... యంత్రం నుంచి పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. అయితే విధి నిర్వహణలో ఉంటున్న అధికారుల నిర్లక్ష్యం, కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వక చర్యల కారణంగా ఇలా రావట్లేదు. వీరి వేలు వెనుక ఉన్న రంధ్రంపైకి వెళ్తుండటంతో కొంత గాలి లోపలే ఉండిపోతోంది. అలా గాలి నిలిచిపోయిన యంత్రంతో మరో వ్యక్తిని పరీక్షిస్తే అది ఆ వ్యక్తి శ్వాసలో కలిసిపోతోంది. దీంతో అతడు మద్యం తాగకపోయినా తాగినట్లు, తాగిన వ్యక్తికి ఎక్కువ మోతాదులో చూపించే ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఫిర్యాదులూ వచ్చాయి. దీంతో ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు ఇటీవలే వెనుక రంధ్రం మూయడానికి ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా క్లాంప్స్‌ ఏర్పాటు చేయించారు. 

ఆ నివేదికనున్యాయస్థానం అంగీకరిస్తుందా..?
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన జహీరుద్దీన్‌ ఉదంతం తొలిసారిగా కొత్త వివాదాన్ని సృష్టించింది. ఇతడిని పోలీసులు పరీక్షించగా 43 బీఏ(బ్లడ్‌ ఆల్కహాల్‌) కౌంట్‌ రాగా.. వైద్యుల పరీక్షలో మద్యం తాగలేదని వచ్చింది. ఈ విషయాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. ఓ వ్యక్తి మద్యం తాగాడా? లేదా? అనేది నిర్థారించడానికి వైద్యులు రక్త నమూనాలు సేకరించి కిట్స్‌ సాయంతో పరీక్షించాల్సి ఉందని చెప్తున్నారు. అయితే జహీరుద్దీన్‌ను పరీక్షించిన వైద్యులు అలా చేయలేదని, కేవలం మాన్యువల్‌ టెస్ట్‌లతోనే నివేదిక ఇచ్చేశారని పేర్కొంటున్నారు.

డీడీ పరీక్షల్లో చిక్కిన ప్రతి వ్యక్తి నుంచి వాహనం స్వాధీనం చేసుకుంటామని కౌన్సిలింగ్‌ అనంతరం కోర్టులో అతడిపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామని చెప్తున్నారు. న్యాయస్థానం విధించిన జరిమానా చెల్లించడం, శిక్ష పూర్తి చేసుకోవడం జరిగిన తర్వాతే వాహనాన్ని తిరిగి ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రతి కేసు మాదిరిగానే జహీరుద్దీన్‌ వ్యవహారంలోనూ కోర్టులో చార్జ్‌షీట్‌ వేస్తామని చెప్తున్నారు. ఆయన తన అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లవచ్చని సూచిస్తున్నారు. ఇదే జరిగితే న్యాయస్థానం ఉస్మానియా వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని అంగీకరిస్తుందా? లేదా? అనేది కీలకంగా మారింది. కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించే డీడీ పరీక్షల చెల్లుబాటు, వాటి కచ్చితత్వాలపై ఓ స్పష్టత రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement