డ్రంకెన్ డ్రైవ్‌లో వాహనదారుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు (ఫైల్)
సాక్షి,మహబూబ్‌నగర్ క్రైం: ఇక నుంచి రోడ్లపైకి మద్యం సేవించి వాహనాలు నడుపుతే కఠినమైన కేసులతో పాటు.. పది నుంచి 60రోజుల జైలు శిక్ష విధించనున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, లారీలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎక్కువమంది వాహనదారులు పట్టణంలో మద్యం కొనుగోలు చేసి బండమిదీపల్లి నుంచి తాటికొండ రోడ్డు వైపుతో పాటు, ఇటు నవాబ్‌పేట రోడ్డు ఫతేపూర్ మైసమ్మ పరిసర ప్రాంతాల వైపు.. హన్వాడ వైపు మద్యం తీసుకెళ్లి నిత్యం వందల సంఖ్యలో పార్టీ లు చేసుకుంటూ వస్తున్నారు. ఆదివారం రోజు అయితే సాయంత్రం సమయంలో తాటికొండ రోడ్డు వైపు వెళ్తే రోడ్డుకు ఇరువైపులా ఐదు.. నుంచి పది మంది వరకు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా చెట్లకింద కూర్చోని మద్యం సేవిస్తూ కన్పింస్తుంటారు.
ఎంత తాగితే ఎక్కువ..
బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా వేస్తారు. ఇలా రెండుసార్లు దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100మి.గ్రా పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం.. ఒక యూనిట్ లేదా 100మిల్లీలీటర్ల రక్తంలో 0.03 శాతం లేదా 30మిల్లీ గ్రాములు మించి ఆల్కహాల్ ఉంటే.. మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2వేలు జరిమానా, వారం నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావత్తం చేస్తే ఎక్కువ రోజులు జైలు శిక్షతో పాటు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించే ప్రమాదం ఉంది.
వినూత్నంగా శిక్షలు..
మొదట్లో డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవారు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదునుపెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 5నుంచి 20రోజుల జైలు శిక్షలు విధించడం ప్రారంభం చేశారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్‌డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 35రోజుల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీవో నం. 26ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24నెలల్లో 12పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు. ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5పాయింట్లు, ఆటో డ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకుంటే, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే 1పాయింటు వేస్తారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో 15రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 10రోజుల శిక్షపడిన వారు 12మంది, వారం రోజులు శిక్షపడిన వారు 51మంది, 35రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 30రోజుల శిక్ష పడిన వారు ఇద్దరు, 3రోజులు 87మంది, 5రోజులు 21మంది, 2రోజులు 34, ఒక్కరోజు జైలు శిక్షపడిన వారు నలుగురు ఉన్నారు.
కేసులు పెరుగుతున్నాయి :
జిల్లా కేంద్రంలో నిత్యం తనిఖీలు చేయడంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాం. అయినా కేసులు పెరుగుతున్నాయి. వాహనదారుల్లో చైతన్యం కలిగించినా మార్పు రావడం లేదు. పట్టుబడిన ప్రతిసారి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంవీ యాక్టును మరింత కఠినంగా చేయడంతో పాటు తనిఖీలు మరింత పెంచడం జరుగుతుంది. దీంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతాం. ప్రతి వాహనదారుడు నిబంధనలు తెలుసుకోవాలి. రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాటిని పాటిస్తే ఎవరికి ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు.
– అమర్‌నాథ్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment