కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠినమైన నిబంధనలను రూపొందించింది. పదేళ్ల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించింది. దేశంలో చాలావరకూ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. మనదేశాన్ని మినహాయించి ఇతర దేశాల్లో ‘హిట్ అండ్ రన్’ కేసులలో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లో వాహన చట్టం, 1927 ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహనం డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్‌లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ‘హిట్ అండ్ రన్’కేసులో మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు.
చైనా
చైనాలో ‘హిట్ అండ్ రన్’లో పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్, ఆర్టికల్ 133 కింద హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే, నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
బ్రిటన్
యూకేలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాలలో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా కూడా ఉంటుంది. దీనితో పాటు అతను డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు.
అమెరికా
యునైటెడ్ స్టేట్స్‌లో ‘హిట్ అండ్ రన్’లో విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో హిట్ అండ్ రన్ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నులను గమనించి డ్రైవర్‌కు ఒక పాయింట్‌ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్‌కు జరిమానా విధించవచ్చు. లేదా అతని లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది.
కెనడా
కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో ‘హిట్ అండ్ రన్’ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైతే అతనికి కనీసం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది.
హాంకాంగ్
హాంకాంగ్‌లో ప్రమాదం జరిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
న్యూజిలాండ్
న్యూజిలాండ్‌లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే, అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేసేందుకు అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment