ఆ 128 దేశాల్లో అమెరికా ఇప్పటికీ లేదు! | Corporal Punishment Still Exists In US Schools | Sakshi
Sakshi News home page

ఆ 128 దేశాల్లో అమెరికా ఇప్పటికీ లేదు!

Published Sat, Aug 3 2019 2:17 PM | Last Updated on Sat, Aug 3 2019 3:05 PM

Corporal Punishment Still Exists In US Schools - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పిల్లలను కొట్టకపోతే చెడిపోతారు’ ఒకనాటి మాట. ‘పిల్లల్ని కొడితే చెడి పోతారు’ ఈనాటి మాట. కాలమాన పరిస్థితులతోపాటు మాటలు, పద్ధతులు మారిపోతుంటాయి. ఒకప్పుడు బళ్లో పిల్లలను కొట్టకపోతే వారికి చదువేరాదని గట్టిగా నమ్మేవారు. అందుకని బడి పిల్లలను భౌతికంగా హింసించేవారు. ఈ పాడు లేదా పాత పద్ధతిని ప్రపంచంలోనే మొట్టమొదటగా నిషేధించిన దేశం పోలండ్‌. సామాజిక చైతన్యం వల్ల ఆ దేశంలో 1783లోనే నిషేధం తీసుకొచ్చారు. ఆ తర్వాత 1970 దశకంలో ఇటలీ, జపాన్, మారిషస్‌ దేశాలు ఈ నిషేధాన్ని తీసుకొచ్చాయి. బడిలో పిల్లలకు ఉపాధ్యాయులు భౌతిక హింసాత్మక శిక్ష విధించడాన్ని నిషేధిస్తూ 2016 సంవత్సరం నాటికి ప్రపంచంలో 128 దేశాలు చట్టాలు తీసుకొచ్చాయి. 

అయినప్పటికీ అభివద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో ఈ శిక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పిల్లల హక్కులకు రక్షణ కల్పిస్తూ ఐక్యరాజ్య సమితి 1990లో ఓ అంతర్జాతీయ ఒప్పందం తీసుకొచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా బడిలో పిల్లలను భౌతికంగా హింసించరాదు. అలాంటి హింసను నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. సరైన మార్గదర్శకాలను రూపొందించాలి. అందలో భాగంగానే ప్రపంచలోని పలు దేశాలు నిషేధాన్ని తీసుకొచ్చాయి. ఆ అంతర్జాతీయ ఒప్పందంపై అమెరికా సంతకం చేయలేదు. నిషేధం విధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమెరికాలోని ఏ కోర్టు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించలేదు. పైగా క్రమశిక్షణ కోసం పరిమితి మేరకు బడి పల్లలను భౌతికంగా దండించవచ్చని ‘బ్రిటీష్‌ కామన్‌ లా’ను ఉదహరిస్తూ ప్రకటించింది. 

బ్రిటీష్‌ పాలనలో ఉన్న దేశాలన్నింటికీ అప్పుడు ఈ కామన్‌ లా వర్తించేది. ఈ లా కింద బడి పిల్లలను దండించడం నేరంకాదు. ముఖ్యంగా ఇంగ్లీషును జాతీయ భాషగా అమలు చేస్తున్న అన్ని దేశాలు ఇదే వైఖరిని అనుసరిస్తూ వచ్చాయి. కాలక్రమంలో ఆ దేశాలు కూడా బడి పిల్లల హింసను నిషేధిస్తూ చట్టాలు తీసుకొచ్చాయి. అమెరికా మాత్రం తీసుకోలేదు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం నిషేధం విధించాయి. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భౌతిక శిక్ష విధించడం అమెరికాలోని 19 రాష్ట్రాల్లో ఇప్పటికీ చట్టబద్ధమే. ఇక ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 48 రాష్ట్రాల్లో భౌతిక శిక్ష చట్టబద్ధమే. 

ఈ విషయంలో భారత్‌ కూడా చాలా ఆలస్యంగానే నిర్ణయం తీసుకొంది. ఢిల్లీ పాఠశాలల్లో ఈ శిక్షను నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టు 2000లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను పురస్కరించుకొని భారత్‌లోని పలు రాష్ట్రాలు కూడా నిషేధం విధించాయి. ఆ తర్వాత దేశంలోని అన్ని పాఠశాలల్లో భౌతిక శిక్షను నిషేధిస్తూ 2010, జూలై నెలలో కేంద్ర మహిళా, పిల్లల అభివద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. పిల్లలను మొదటి సారి భౌతికంగా కొడితే ఏడాది వరకు జైలు, 50 వేల జరిమానాను నిర్దేశించింది. పునరావృతం అయితే మూడేళ్ల వరకు జైలు, 75 వేల వరకు జరిమానా విధించాలని సూచించింది. దండించే ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వరాదని, ఇంక్రిమెంట్లు కూడా కత్తిరించాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సిన బాధ్యతను స్కూళ్ల అధిపతులకు అప్పగించింది. 

ఇకనైనా అమెరికాలోని అన్ని స్కూళ్లలో ఈ నిషేధాన్ని విధించాంటూ వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఆగస్టు రెండవ తేదీన అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన ఓ ‘విధాన పత్రం’లో వారు సిఫార్సు చేశారు. ఈ విషయమై వారు ప్రపంచంలోని 192 దేశాల్లో పాఠశాలల పరిస్థితులను అధ్యయనం చేసినట్లు చెప్పారు. ప్రపంచంలో మహిళల సారథ్యంలోని ప్రభుత్వాలు ముందుగా బడుల్లో ఈ నిషేధాన్ని తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. మహిళలకు పిల్లల పట్ల సహజంగా ప్రేమ ఉండడమే కాకుండా, వారు అభివద్ధిని కోరుకునే వారవడమే అందుకు కారణమని కూడా వారు విశ్లేషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement