సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని వారిని ఆదేశించింది. నెలలో నచ్చిన ఓ ఆదివారం రోజున ఆ జిల్లాలో ఉన్న ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్‌లో సేవ చేయాలని చెప్పింది. ఇలా 12 ఆదివారాలు ఒక్కో వారం ఒక్కో హాస్టల్‌లో సేవ చేయడంతో పాటు ఆయా హాస్టళ్లలోని విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న లేదా రాత్రి భోజనాన్ని అందించాలని ఆదేశించింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని సొంత జేబు నుంచి భరించాలంది. ఒక్కో అధికారికి ఒక్కో జిల్లాను కేటాయించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని నిర్మిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పాఠశాలల్లో ఇలాంటి నిర్మాణాలు తగవంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలకు విరుద్దంగా పలు చోట్ల నిర్మాణాలు కొనసాగడంతో అధికారులపై హైకోర్టు సుమోటోగా ధిక్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యా శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఆ శాఖ ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఆ శాఖ అప్పటి డైరెక్టర్ జి.విజయ్‌కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం.నాయక్‌లను ప్రతివాదులుగా చేర్చింది. తాజాగా గురువారం ఈ ఎనిమిది మంది న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.
ధిక్కార చర్యల తర్వాతే స్పందించారు..
సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు మొదలైన తర్వాతే అధికారులు స్పందించి, దాదాపు 1,371 పాఠశాలల్లో నిర్మాణాలను గుర్తించి, తొలగించారని న్యాయమూర్తి అన్నారు. కోర్టు ఆదేశాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేయక పోవడంతో వల్లే.. అఫిడవిట్ దాఖలు చేశాక కూడా పిటిషన్లు పడుతున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా ఈ ఎనిమిది మందికి రెండు వారాల జైలు శిక్ష, రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో భవిష్యత్‌లో ఇలా జరగకుండా చూసుకుంటామని అధికారులు కోర్టును బేషరతు క్షమాపణలు కోరారు. క్షమాపణలు ఆమోదించాలంటే సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. దీనికి అధికారులందరూ అంగీకరించడంతో న్యాయమూర్తి తానిచ్చిన జైలు శిక్ష, జరిమానాను మాఫీ చేస్తూ.. వాటి స్థానంలో సామాజిక సేవకు ఆదేశాలిచ్చారు. ఈ అధికారులు హాస్టళ్ల సందర్శన వివరాలు, ఫొటోలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
8 మంది ఐఏఎస్ అధికారులకు వినూత్న శిక్ష
Published Fri, Apr 1 2022 3:51 AM | Last Updated on Fri, Apr 1 2022 10:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment