సాక్షి, భీమారం(చెన్నూర్): తన అనుమతి లేకుండా జిల్లా స్థాయి క్రీడల్లో ఎందుకు పాల్గొన్నారని మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణ విద్యార్థులను దండన విధించాడు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని హెచ్‌ఎంతో వాగ్వివాదానికి దిగారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులను శనివారం రేచినిలో జరిగిన హ్యాండ్ బాల్ పోటీలకు పీఈటీ విఠల్ తీసుకెళ్లారు. పోటీలకు హాజరైన విద్యార్థులు సోమవారం పాఠశాలకు యథావిధిగా హాజరయ్యారు. అయితే ప్రార్థన అనంతరం పోటీలకు వెళ్లిన విద్యార్థులను దాదాపు 3 గంటల సేపు ఎండలో నిలబెట్టారు. దీంతో పాఠశాలలో జరిగిన సంఘటనపై తల్లిదండ్రులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్థానిక నాయకులతో కలిసి పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎంను నిలదీశారు. ఆటల పోటీలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. ఆటల పోటీలకు వెళ్లేందుకు తాను అనుమతిని ఇవ్వలేదని, పీఈటీ విఠల్ కొందరు విద్యార్థులను తీసికెళ్లాడని తెలిపారు. విద్యార్థులను మందలించానని, ఎండలో నిలబెట్టలేదని హెచ్‌ఎం తెలిపాడు. హెచ్‌ఎం అనుమతితోనే క్రీడలకు విద్యార్థులను తీసుకువెళ్లానని పీఈటీ చెప్పారు. పాఠశాలలోని గ్రూప్ తగాదాలే ఈ గొడవకి కారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment