లక్నో: అల్లరి పిల్లలను దారిలోకి తీసుకురావడం కోసం రకరకాలుగా బెదిరిస్తాం. అల్లరి గడుగ్గాయిల గురించి తల్లిదండ్రులు కూడా వారి టీచర్లకు ఫిర్యాదు చేస్తారు. ఏదో మాట వరసకు మా పిల్లాడికి భయం చెప్పండి అన్నందుకు.. విద్యార్థికి చుక్కలు చూపించాడు. ఓ ప్రధానోపాధ్యాయుడు. రెండో తరగతి చదువుతున్న ఓ పిల్లాడి కాలు పట్టుకుని కింద పడేస్తాను అంటూ బిల్డింగ్ మీద నుంచి వేలాడదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో.. సదరు ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి పేరు సోను యాదవ్. రెండో తరగతి చదువుతున్న సోను యాదవ్.. గురువారం లంచ్ బ్రేక్ సమయంలో పలువురు విద్యార్థులను కొరికినట్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు మనోజ్ విశ్వకర్మ.. సోను కాలు పట్టుకుని లాక్కొచ్చాడు. చేసిన తప్పుకు క్షమాపణ కోరమని.. లేదంటే సోనుని బిల్డింగ్ పై నుంచి కిందకు పడేస్తానని బెదిరించసాగాడు. చెప్పడమే కాక సోను కాలు పట్టుకుని బిల్డింగ్ మీద నుంచి కిందకు వేలాడదీశాడు.
(చదవండి: ప్రధానోపాధ్యాయుడి కష్టాలు.. పని చేస్తున్న స్కూల్లోనే నైట్ డ్యూటీలు)
మనోజ్ చర్యతో బిక్కచచ్చిపోయాడు సోను. భయంతో గుక్కపట్టి ఏడవసాగాడు. దాంతో మిగతా స్టూడెంట్స్, టీచర్లు అక్కడకు పరిగెత్తుకువచ్చారు. మనోజ్ చేతి నుంచి సోనుని విడిపించారు. ఇంటికెళ్లిన సోను తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. కొందరు టీచర్లు మనోజ్ చేసిన పనిని వీడియో తీశారు.
ఈ క్రమంలో సోను తండ్రి.. మనోజ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సోను తండ్రి మాట్లాడుతూ.. గురువు అంటే విద్యార్థులను ప్రేమగా చూడాలి.. కానీ మనోజ్ రాక్షసంగా ప్రవర్తించాడు అన్నాడు. సోను తడ్రి ఫిర్యాదు మేరకు మనోజ్‌ను అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అతడి మీద కేసు నమోదు చేశారు.
(చదవండి: పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే.. )
మనోజ్ మాట్లాడుతూ.. ‘‘సోను చాలా తుంటరి పిల్లాడు. విద్యార్థులనే కాదు టీచర్లను కూడా కొరుకుతాడు. బుద్దిగా ఉండడు.. ఎవరి మాట వినడు. సోను తండ్రే తనను మార్చమని నాకు చెప్పాడు. విద్యార్థిని భయపెట్టడం కోసం ఇలా చేశాను. అంతే’’ అన్నాడు. భయపెట్టమంటే.. మరీ ఇలా చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment