ముద్ర చరిత్ర | A crime story | Sakshi
Sakshi News home page

ముద్ర చరిత్ర

Published Wed, May 30 2018 1:21 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

A crime story  - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ చేసిన ‘రక్తచరిత్ర’ లాంటిది కాదు. ఎంత తుడిచినా పోని ముద్రల చరిత్ర ఇది. పగ, ప్రతీకారంతో చేసిన నేరం కాదు. అహంకారంతో లెక్కలేనితనంతో చేసిన నేరం. నేరం దాగదు. నేరాహంకారానికి శిక్ష తప్పదు.

2017 తొలకరి. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం అటవీప్రాంతం. ఉదయం 11. జనం హడావిడికి బెదిరి పురుగూ పుట్రా పక్కకు జరిగిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన చెట్టూ పుట్టా కూడా ఏం జరిగిందా అన్నట్టు కుతూహలపడుతున్నట్టున్నాయి. చుట్టూ జనం. వలయాకారంగా పోగై ఉన్నారు. ఇంకొందరు పరిగెత్తుకొని వస్తుంటే పోలీసులు వెనక్కి నెడుతున్నారు. దూరంగా అదిలిస్తున్నారు. అక్కడ ఏదో దుర్మార్గం జరిగిందని తెలుస్తూనే ఉంది.

ఏంటా దుర్మార్గం? ఎవరో తొంగి చూశారు. ఒళ్లు గగుర్పాటు చెందింది. వికారం గుండెల్లో తన్ని వాంతి వచ్చినట్టనిపించింది.   అక్కడ చిన్న గొయ్యి.  అందులో ఒక యువకుని మృతదేహం. దానికి తల లేదు. కాళ్ళు నరికి వెనక్కి మడిచి గొయ్యిలో పూడ్చిపెట్టారు.  గొయ్యి కనపడకూడదని అక్కడి చెట్ల కొమ్మలు నరికి కప్పినట్టున్నారు. అడవిలో తిరిగే వారికి అలా పచ్చి కొమ్మలు నరికి కుప్పగా వేయడం విడ్డూరంగా కనిపించింది. అందుకే పోలీసులకు సమాచారం అందించారు.ఆ దారుణాన్ని చూసిన పోలీసులు ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నారు.


ఎస్‌.ఐ మరోసారి మృతదేహాన్ని పరిశీలించాడు. 25 –30 సంవత్సరాల మధ్య వయసు ఉండచ్చు. తల ఉన్న మృతదేహాల కేసుల్ని పరీక్షించడమే ఒక్కోసారి జటిలం అవుతూ ఉంటుంది. ఇది తలలేని మొండం. ఎవరో ఎలా కనిపెట్టడం. గొయ్యి చుట్టూ పరికిస్తున్నాడు ఎస్‌.ఐ. గొయ్యిలోనే మృతదేహం పక్కన  పగిలిన ఫోన్‌ ముక్కలు కనిపించాయి. ఆ పక్కనే సిమ్, మెమరీ కార్డులూ దొరికాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని మెమరీకార్డును మరో ఫోన్‌లో వేసి చూశారు. అందులో ఒక ఫొటో ఉంది. అది హతుడి ఫోటో అయ్యుంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సిమ్‌కార్డులోని కాల్‌ డేటాను పరిశీలించారు.

హతుడు బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన టైలర్‌ రాజుగా గుర్తించారు. రాజును ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపడానికి గల కారణం ఏమిటి? తెలియలేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి పంపించారు. మృతుడి తల ఏమైంది అనే విషయం అంతుపట్టలేదు. డాగ్‌ స్క్వాడ్‌తో వెదుకులాట కొనసాగించారు. ప్రయోజనం కనిపించలేదు. అంత క్రూరంగా హత్యచేయాల్సిన అవసరం ఎవరికి, ఎందుకు వచ్చింది... పోలీసులకు అంతుపట్టలేదు. క్లూ కోసం మళ్లీ శవం దొరికిన గొయ్యి వద్ద వెదుకులాట మొదలుపెట్టారు. పగిలిన బీరుబాటిల్‌లోని గాజు ముక్క ఒకటి దొరికింది. ఆ చిన్న గాజు ముక్క కూడా ‘క్లూ’ అవ్వచ్చు. ‘ల్యాబ్‌కు పంపించి చెక్‌ చేయించండి’ అన్నాడు ఎస్‌.ఐ.

చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసు కలకలం రేపింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా తల లేని మొండం గురించి, జరిగిన ఘాతుకం గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మృతుని గురించిన విచారణ వేగం చేశారు పోలీసులు. టైలర్‌రాజుకు మద్యం తాగే అలవాటు ఉంది. కొన్నాళ్ళుగా అతను జంగారెడ్డిగూడెంలో ఉంటున్నాడు. శత్రువులు, గిట్టనివారు ఎవరైనా ఉన్నారా అని  విచారణ చేశారు.  అలాంటి వారెవరూ లేరని, అయినవాళ్లు కూడా రాజుకు లేరని తెలిసింది.   

ల్యాబ్‌ సిబ్బంది గాజు ముక్కపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. ఆ వేలి ముద్రలు పాత నిందితులైన ఓ ఇద్దరి వేలిముద్రలతో సరిపోలాయి.   గతంలో నేరం చేసి, జైలుకు వచ్చినవారి వేలి ముద్రలు పోలీసుల రికార్డుల్లో ఉంటాయి. దొరికిన వేలి ముద్రలను ఆ ముద్రలతో మేచ్‌ చేసి చూస్తే  నిందితులు ఎవరు? ఎక్కడివారు అనే దిశగా కేసు విడిపోతుందని భావించారు.


రెండు రోజుల తర్వాత ఒక మధ్యాహ్న సమయం. పోలీస్‌ స్టేషన్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘సార్‌.. 16వ తేదీ రాత్రి జేపీ సెంటర్‌లో ఉన్న బ్రాందీ షాప్‌ ముందు నుంచి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు బలవంతంగా ఆటోలో తీసుకువెళ్లడం చూశా’నని చెప్పి పెట్టేశాడు. ఫోన్‌ చేసినవాడు తన వివరాలు మాత్రం చెప్పలేదు. వెంటనే పోలీసులు జేపీ సెంటర్‌కు చేరుకుని పరిశీలించారు. 16వ తేదీ రాత్రి జరిగిన ఘటనలపై ఆరా తీశారు. సమాచారం అస్పష్టంగా ఉంది.

ఇదే సమయంలో సెక్యూరిటీ కోసం జేపీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాపై ఎస్‌.ఐ దృష్టి పడింది.  ఫుటేజీని పరిశీలిస్తే ఒక ఆటోలో ఒకతన్ని ఎవరో బలవంతంగా ఎక్కిస్తున్నట్టు కనిపించింది.  వెంటనే ఆ ఆటో గురించి వివరాలు సేకరించారు. ఆటోను నడిపిందెవరు... ఎవరు ఎక్కారు... ఎక్కడి వరకు ఆటో వెళ్ళింది అనే విషయాలను తెలుసుకున్న ఎస్‌.ఐ వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని  ప్రశ్నించడం మొదలు పెట్టారు.  వచ్చిన సమాచారం విని విభ్రాంతికి గురయ్యారు.


2017 జూలై 16, రాత్రి. టైలర్‌ రాజు పనులు ముగించుకుని జేపీ సెంటర్‌లో ఉన్న వైన్‌ షాపుకు వెళ్లి అక్కడ మద్యం కొనుకున్నాడు.  సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో అజయ్‌కుమార్‌ అనే ఆటో డ్రైవర్‌ తన స్నేహితులతో వైన్‌ షాప్‌కి వచ్చాడు. వాళ్లు కూడా మద్యం కొనుక్కుని ఆ ఖాళీ ప్రాంతంలో కూర్చున్నారు. ఒక పక్కన టైలర్‌ రాజు.. మరో పక్క వీరంతా... ఉన్నట్టుండి ఈ గ్రూపులోని ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం రాజు కూర్చున్న వైపు వచ్చాడు.

‘దూరం పో అన్నా’ అని రాజు అతణ్ణి అదిలించాడు. చిన్న మాట. కాని తగాదా పెరిగిపోయింది. అప్పటికే రెండు వర్గాలకు మత్తు తలకెక్కిపోయి ఉంది. రాజు ఒక్కడు. వాళ్లు ఆరుగురు.  ఆరుగురూ రాజును తీవ్రంగా కొట్టారు. రాజు అక్కడే పడిపోయాడు. అయినా కోపం తీరని వారంతా రాజును ఆటోలో ఎక్కించుకుని మర్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకుపోయారు. అటవీ ప్రాంతంలో ఉన్న చెట్టు కొమ్మను విరిచి మళ్లీ తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకే రాజు మరణించాడు.

హత్యకేసు బయటకు రాకూడదని రాజు మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించారు. వారిలో పవన్‌కుమార్‌కు నేరప్రవృత్తి ఉంది. అప్పటికే ఇతనిపై తూర్పు, పశ్చిమ, కృష్ణాజిల్లాలో కేసులు కూడా ఉన్నాయి. ఇక శ్రీనుపై కూడా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్‌కేసు ఉంది. హత్యకేసు తప్పించుకునేందుకు పవన్‌కుమార్‌ తన ఆటోలో జంగారెడ్డిగూడెంలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోని కూరగాయలు కోసే చాకు, చేతిగునపం తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు.

ఆ చాకుతో హతుడు రాజు గొంతును కోసి తలను వేరుచేశారు. తీసిన గొయ్యి సరిపోకపోవడంతో మృతుడి కాళ్ళను వెనక్కి విరిచి పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా  చెట్ల ఆకులు, కొమ్మలు పడవేశారు. వేరుచేసిన తలను ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి దారిలో మూసేసి ఉన్న ఇస్త్రీ బండిలో నుంచి ఒక చీరను తీసుకుని తలను చీరలో కట్టారు. చీరకు మరో పక్క రాయి కట్టి  జంగారెడ్డిగూడెం  సమీపంలోని రజక చెరువులో పడవేశారు. ఆ తరువాత ఇళ్ళకు వెళ్ళిపోయారు.  

ఇదంతా విన్న పోలీసులు హతాశులయ్యారు. చిన్నపాటి ఘర్షణ ఇంత దారుణమైన క్రూర హత్యకు దారి తీస్తుందా అని ఆశ్చర్యపోయారు. కేసును రోజుల వ్యవధిలో చేధించిన పోలీసు బృందానికి అవార్డు వరించింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు పవన్‌కుమార్‌కు కోర్టు 18 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. మిగిలిన వారిపై కేసు రుజువు కాలేదు. ఉన్మాదంలో, అహంకారంలో నేరం చేసి ఏం కాదు అనుకునేవారికి ఇదో కనువిప్పు. 

– డి.వి.భాస్కరరావు సాక్షి, జంగారెడ్డిగూడెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement