చిరంజీవి అశ్వత్థామ! | Maha Sangram Kurukshetra | Sakshi
Sakshi News home page

చిరంజీవి అశ్వత్థామ!

Published Sat, Jan 28 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

చిరంజీవి అశ్వత్థామ!

చిరంజీవి అశ్వత్థామ!

పురానీతి

కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు. కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు. భీముడికి, దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. భీముడు చివరకి దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. తొడలు విరిగి, చచ్చిన పులిలా పడున్న దుర్యోధనుడిని చూసి అమితంగా బాధపడ్డాడు. ‘‘ఎలాగైనా సరే, నీకు సంతోషాన్ని కలిగిస్తాను’’ అని శవసాక్షిగా ప్రతిజ్ఞ చేసి, వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లాడు. శిబిరంలో అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న ఉపపాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి, దుర్యోధనుడి దేహం ముందు పడవేసి, ప్రభు రుణం తీరిపోయినట్లుగా భావించి, ్రÔ¶ ద్ధాంజలి ఘటించాడు. తెల్లవారింది. ఉపపాండవుల మరణవార్త వ్యాపించింది. పాండవుల శిబిరాలన్నీ దుఃఖంతో గొల్లుమన్నాయి. పాండుపుత్రుల తల్లి ద్రౌపది తీవ్ర దిగ్భ్రాంతికి లోనై, కుప్పకూలిపోయింది. అర్జునుడు ముందుగా తనను తాను దిటవు పరచుకున్నాడు. తర్వాత మెల్లగా ద్రౌపదిని లేపి, ‘‘పాంచాలీ! సుక్షత్రియ వంశంలో పుట్టి, వీరాధివీరులైన పాండవులకు పత్నిగా ఉన్న నీవు ఇంతగా దుఃఖించడం తగదు.

దుర్మార్గుడైన అశ్వత్థామ అర్ధరాత్రప్పుడు దొంగచాటుగా శిబిరంలో దూరి పసిబిడ్డలైన ఉపపాండవులను మరచి  తన పొట్టన పెట్టుకున్నాడు. ఇందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నేను ఇప్పుడే వెళ్లి, ఆ ధర్మభ్రష్టుని శిరస్సును ఖండించి తీసుకు వచ్చి, నీ కాళ్లముందు పడవేస్తాను. నువ్వు ఆ నీచుని తలను నీ కాళ్లతో తొక్కి, ఛిద్రం చేసి, నీ శోకాన్ని బాపుకో’’అని ఓదార్చాడు. అర్జునుడి మాటలు విన్న ద్రౌపది మనస్సు కొద్దిగా ఊరట పొందింది. బలంగా ఒక నిట్టూర్పు విడిచి, పక్కనే ఉన్న శ్రీకృష్ణుని వంక భావగర్భితంగా చూసింది. అప్పుడు కృష్ణుడు రథాన్ని సిద్ధం చేసి, అర్జునుడిని రథంలో కూర్చుండబెట్టుకుని, ఆ రథానికి పూన్చిన గుర్రాలను అదిలించాడు. దూరంగా వస్తున్న పార్థుడి రథాన్ని చూడగానే అశ్వత్థామ ప్రాణభయంతో పరుగెత్తి సమీపంలోనే ఉన్న ఓ నీటిమడుగులో దాక్కున్నాడు. దిక్కుతోచని స్థితిలో ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియనటువంటి మహా శక్తిమంతమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం వింతకాంతులు చిమ్ముకుంటూ శరవేగంగా అర్జునుడిని సమీపించసాగింది. కృష్ణుడు ‘‘పార్థా! ఇది బ్రహ్మశిరోనామకాస్త్రం. దీనిని ఎదుర్కొనాలంటే తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాలి.’’ అని చెప్పాడు.

నిప్పులు కక్కుతూ తనమీదకు దూసుకొస్తున్న ఆ అస్త్రాన్ని నిలువరించేందుకు తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ రెండు అస్త్రాలూ ఒకదానినొకటి ఢీకొనడంతో భూనభోంతరాళాలు దద్దరిల్లేట్లు శబ్దాలు వచ్చాయి. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. తీవ్రమైన అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. శ్రీకృష్ణుని సూచన మేరకు అర్జునుడు ఉపసంహార మంత్రం పఠిస్తూ ఆ అస్త్రానికి భక్తితో ప్రణమిల్లాడు. వెంటనే రెండు అస్త్రాలూ శాంతించి, అర్జునుడి అమ్ములపొదిలో చేరిపోయాయి. నోరు వెళ్లబెట్టి ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయిన అశ్వత్థామ మీదకు సింహంలా లంఘించి, అతణ్ణి తాళ్లతో బంధించి, రథానికి కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ద్రౌపది ముందు పడేశాడు. ‘‘ద్రౌపది అతనికి చేతులు జోడించి, ‘‘శిశువులను చంపడానికి పచ్చినెత్తురు తాగే రాక్షసులు సైతం వెనకాడతారే, అలాంటిది గురుపుత్రులు, ధర్మాధర్మాలు తెలిసిన వారయి ఉండీ కాస్తంత అయినా కనికరం లేక అమాయకులైన పసిబిడ్డలను చంపడానికి మీకు చేతులెట్లా వచ్చాయి? మీ గుండె అంత బండరాయిగా ఎలా మారింది..’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ద్రౌపదిని వారిస్తూ, ‘‘ఉచ్చనీచాలు మరచిన పాషాణం లాంటి ఈ దుర్మార్గుడితో ఇంకా మాటలెందుకు?’’ అంటూ కత్తిదూసి అశ్వత్థామను చంపబోయాడు పార్థుడు.

అప్పుడు ద్రౌపది ‘‘వీరాధివీరులైన మీరు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతణ్ణి చంపితే ఇక మీకూ అతనికీ తేడా ఏముంది? దయచేసి వదిలేయండి’’ అంటూ దణ్ణం పెట్టింది. ‘‘మరి నా ప్రతిజ్ఞ ఎలా....’’ అంటున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు, ‘‘పార్థా! ఇతని తల గొరిగి, అతన్ని క్షమించి వదిలెయ్‌’’ వీరుడికి అది శిరచ్ఛేదంతో సమానం’’ అని చెప్పి, అశ్వత్థామవైపు తిరిగి, ‘‘ఓరీ! నీవు చేసిన పనికి ఒళ్లంతా కుళ్లిపోయి, రక్తమాంసాలతో కంపుకొడుతూ చావుకోసం ఎదురు చూస్తూ ఈ యుగమంతా ఇలాగే జీవిస్తావు’’ అని శపించాడు. అశ్వత్థామ ఆ విధంగా చిరంజీవి అయ్యాడు. నాటినుంచి కురుక్షేత్రంలో చావలేక, చావురాక, క్షణ క్షణం చస్తూ బతుకుతున్నాడు. అయినా, చావుకన్నా అదే సరైన శిక్ష కదా అశ్వత్థామకు.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement