దుబాయ్‌ బందీలకు విముక్తి  | Telangana Immigrants sentenced for murder are released | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ బందీలకు విముక్తి 

Published Sun, Feb 18 2024 4:12 AM | Last Updated on Sun, Feb 18 2024 4:12 AM

Telangana Immigrants sentenced for murder are released - Sakshi

సిరిసిల్ల: దుబాయ్‌లోని అవీర్‌ జైల్లో 18 ఏళ్లుగా ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వలసజీవులు ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈనెల 21న జైలు నుంచి విడుదలై భారత్‌కు రానున్నారు. దుబాయ్‌ జైలు నుంచి నేరుగా భారత్‌కు వచ్చేందుకు విమాన టికెట్లు సిద్ధమయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి(45) అన్నదమ్ములు.

కోనరావు పేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్‌(48), చందుర్తికి చెందిన నాంపల్లి (గొల్లెం) వెంకటి(43), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(51), కరీంనగర్‌ జిల్లాకు చెందిన సయ్యద్‌ కరీం బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లారు. వీరిలో కరీం మినహా ఐదుగురు ఓ సెక్యూరిటీగార్డు హత్య కేసులో 18 ఏళ్లుగా దుబాయ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి విడుదల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ దుబాయ్‌ వెళ్లి ప్రయత్నం చేశారు.

ఐదుగురు ఎన్నారై ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, దుబాయ్‌ కాన్సుల్‌ జనరల్‌ రామ్‌కుమార్, ఈ కేసు వాదిస్తున్న అరబ్‌ న్యాయవాదితో మాట్లాడారు. దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయతి్నంచాలని కోరారు. ఆ దౌత్యం ఫలించి ఎట్టకేలకు మల్లేశం, రవి, హన్మంతు విడుదలవుతున్నారు. నాలుగు నెలల కిందట దుండుగుల లక్ష్మణ్‌ విడుదలయ్యారు. వెంకటి విడుదలకు కొంత సమయం పడుతుందని తెలిసింది. 

ఇదీ కేసు నేపథ్యం 
2006లో దుబాయ్‌లోని జబల్‌ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌కు చెందిన దిల్‌ ప్రసాద్‌రాయ్‌ అనే సెక్యూరిటీగార్డు హత్య కు గురయ్యాడు. అక్కడ టన్నుల కొద్దీ ఉన్న ఇత్తడి విద్యుత్‌ తీగలను పది మంది కలిసి దొంగిలించేందుకు యత్నించారని, అడ్డుకున్న ప్రసాద్‌రాయ్‌ని హత్య చేశారని ఆరోపణలున్నాయి.

ఈ కేసు నింది తుల్లో ఆరుగురు తెలంగాణ వారుకాగా, నలుగురు పాకిస్తానీయులు. ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ.. పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, సయ్యద్‌ కరీం విడుదలయ్యారు. మిగిలిన వారికి హత్యకేసులో క్షమాభిక్ష లభించినా.. దొంగతనం, దేశం విడిచివెళ్లే ప్రయత్నం చేసిన కేసుల్లో జైల్లో ఉన్నారు. 

అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష 
జైల్లో ఉన్న ఐదుగురి విడుదల కోసం హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. ఆ నిర్ణయమే వారి పాలిట శాపంగా మారింది. హైకోర్టులో ఈ కేసులు విచారించిన ధర్మాసనం ఈ హత్యను క్రూరమైనదిగా పరిగణించింది. మల్లేశం, రవి, వెంకటి, హన్మంతు, లక్ష్మణ్‌లకు కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను 2015లో యావజ్జీవ కారాగార శిక్షకు పెంచింది.

నేరం నుంచి తప్పించునేందుకు కత్తిని పూడ్చిపెట్టడంతోపాటు, అక్రమంగా దేశం దాటేందుకు ప్రయత్నించారని.. ఇవన్నీ తీవ్రమైన నేరాలని ధర్మాసనం పేర్కొంది. దీంతో దోషుల విడుదల ఆలస్యమైంది. అయితే, నాడు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement