జాజ్‌పూర్(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో జరిగింది. రసూల్‌పూర్ బ్లాక్ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు.
అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘ చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment