సాక్షి, అమరావతి : ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్‌ను, అతనికి సాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా, హిందూపురం వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్‌పై నామమాత్రపు చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు సమాజానికి సంరక్షకులని, అలాంటి పోలీసు తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని స్పష్టం చేసింది.
రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించడం చాలా చిన్న శిక్ష అని, ఇలాంటి శిక్ష విధించడం ద్వారా సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని ప్రశ్నించింది. కింది కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేసిన పోలీసు అధికారికి చిన్న శిక్ష విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐని హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వొకేట్ కమిషనర్, కోర్టు సిబ్బందిని ఇస్మాయిల్ కొట్టారంటూ అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐ ఇస్మాయిల్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణకు సైతం హాజరు కావాలని ఇస్మాయిల్‌ను ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment