బర్రెనమ్మారని.. గుండు గీశారు | Boy punished in Devarakadra for sold his buffalo calf | Sakshi
Sakshi News home page

బర్రెనమ్మారని.. గుండు గీశారు

Published Sat, May 18 2019 9:31 AM | Last Updated on Sat, May 18 2019 10:08 AM

Boy punished in Devarakadra for sold his buffalo calf - Sakshi

చిన్నచింతకుంట (దేవరకద్ర): జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తమ సొంత బర్రె (గేదె)తోపాటు దూడను స్నేహితుడి సహాయంతో విక్రయించాడు. వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌కు వెళ్లి జల్సా చేద్దామనుకున్నాడు. ఇంతలో విషయం గ్రామంలో తెలియడంతో సర్పంచ్‌తోపాటు అధికార పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీలో ఇద్దరు యువకులకు గుండు గీయించారు. అయితే అవమానంగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతలలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి కుమారుడు మహేశ్వర్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర స్నేహితులు. ఇంటర్‌ వరకు చదివిన వీరు కుటుంబసభ్యులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే మహేశ్వర్‌రెడ్డి జల్సాలకు అలవాటుపడి తరచూ తండ్రిని డబ్బులు ఇవ్వమని అడిగేవాడు.

తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో స్నేహితుడు రాఘవేంద్ర సహాయంతో మహేశ్వర్‌రెడ్డి తాను మేపుతున్న పశువుల నుంచి ఓ బర్రె, దూడను తల్లిదండ్రులకు తెలియకుండా దేవరకద్ర సంతకు వెళ్లి రూ.33వేలకు విక్రయించారు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి  హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. గ్రామానికి చేరుకున్న రాఘవేంద్రను మహేశ్వర్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి తన కొడుకు ఎక్కడ ఉన్నాడని అడగడంతో జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయం  గ్రామసర్పంచ్‌ హరిత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు మహేశ్వర్‌రెడ్డిని పిలిపించా రు. గురువారం రాఘవేంద్రను వెంట పెట్టుకుని వెళ్లి అమ్మిన బర్రె, దూడను గ్రామానికి తీసుకువచ్చారు. రాఘవేంద్ర తండ్రి వద్దంటున్నా.. శుక్రవారం గ్రామపెద్దలు, గ్రామస్తుల ఎదుట పంచా యతీ నిర్వహించి యువకులకు గుండు గీయించారు. దీంతో అవమానం భరించలేని రాఘవేంద్ర సూసైడ్‌ నోట్‌ రాసి వ్యవసాయ పొలంలోని విద్యు త్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పర్వతాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement