లంచగొండులపై ఉక్కుపాదం:3 లక్షల మందికి శిక్షలు
క్రమశిక్షణా పరిశీలన కమిటీ.. ఈ పేరు వింటేచాలు ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఒక్కరూ ఇద్దరూ కాదు ఏటా దాదాపు 3 లక్షల మంది లంచగొండి ఉద్యోగుల్ని వల వేసిపట్టుకుని శిక్షలు విధిస్తున్నది ప్రభుత్వం.. అదృష్టవశాత్తు అవి మన ప్రభుత్వాలుకావనుకోండి.. చైనాలో!
ప్రభుత్వ పథకాల అమలు, సాధారణ పనుల్లో అవినీతిని రూపుమాపేందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ కమిటీ ఆఫ్ డిసిప్లిన్ ఇన్స్ పెక్షన్(కేంద్ర క్రమశిక్షణా పరిశీలన సంఘం) సోమవారం వెల్లడించిన నివేదికలో అవినీతి అధికారులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత ఏడాదిలో అవినీతికి పాల్పడిన 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను పట్టుబడ్డారని, వారిలో 2 లక్షల మందివి చిన్నస్థాయి నేరాలు కావడంతో సాధారణ శిక్షలతోపాటు జరిమానా విధించినట్లు, మరో 80 వేల మందిపై మాత్రం తీవ్రమైన శిక్షలు విధించినట్లు పరిశీలనా సంఘం తన నివేదికలో పేర్కొంది. అవినీతిని విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ అధ్యక్షుడు జింగ్ పింగ్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఉద్యోగుల కదలికలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది.
సాధారణ శిక్షలు పూర్తిచేసిన్న 2 లక్షల మంది ఉద్యోగులు ఇటీవలి పార్లమెంట్ సమావేశాల సమయంలో విడుదలయ్యారు. ఇంకా జైళ్లలోనే ఉన్న 80 వేల మందిలో పలువురికి మరణశిక్ష పడే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ చైనా అధికారిక మీడియాలో ప్రతిరోజూ అవినీతి వార్తలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం.