నిజాయితీని భయపెట్టిన శిక్ష
ఆలోచనం
ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్లసలు ఏ పనీ చెయ్యలేదని అర్థం. మచ్చలేని ఉద్యోగ రికార్డ్ కలిగిన హెచ్‌ఎస్ గుప్తా చేసిన పనిలో పొరపాటు జరిగింది. తప్పుచేయాలనే ఉద్దేశం లేని చోట జరిగిన పొరపాటు శిక్షార్హం కాకూడదు.
కొద్దిరోజుల క్రితం నా కూతురు అడిగిన ఒక ప్రశ్నకు నేను, నాకెంతో ఇష్టమయిన చైనా తత్వవేత్త లావో త్సు మాటలు కోట్ చేశాను. ‘నీ ఆలోచనలపై శ్రద్ధపెట్టు ఎందుకంటే అవే నీ మాటలవుతాయి, నీ మాట లపై శ్రద్ధ ఉంచు, అవే నీ చేతలు, నీ చేతలపై శ్రద్ధ ఉంచు అవే అలవాట్లవుతాయి, నీ అలవాట్లను గమనించు, అవే నీ వ్యక్తిత్వంగా మారుతాయి, నీ వ్యక్తిత్వంపై శ్రద్ధ పెట్టు ఎందుకంటే అదే నీ విధిని నిర్ణయిస్తుంది’’ అని.
మన ఆలోచనలు నిష్కల్మషంగా ఉంటే మన విధి బాగుంటుందని బొగ్గుగనుల శాఖ మాజీ సెక్రటరీ హరీష్ చంద్ర గుప్తాకి సీబీఐ కోర్టు శిక్ష విధించే వరకు నేను దృఢంగా విశ్వసించేదాన్ని. నిజాయితీపరుడిగా ఖ్యాతిగాంచిన ఈ అధికారి ‘‘నా దగ్గర లాయర్ ఫీజులు ఇచ్చుకునేంత డబ్బు కూడా లేదు’’ అని కన్నీటి పర్యంతం కావడం, అతను వారణాసి వున్న యూపీకి చెందినవాడు కావడం, అతని పేరు సత్య హరిశ్చంద్రని జ్ఞాపకం తెస్తూ ఉండటం చేతననుకుంటా నాకు పదే పదే బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్యహరిశ్చంద్రీయంలోని...
తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్సాగిరావేరి
కేరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె
వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం
కరుడే రాజగు రాజే కింకరుడగున్గాలానుకూలంబుగన్’’
అనే పద్యం మదిలో మెదులుతూ, విధి ఎవరికేది రాసి ఉంచిం దో దానినెవరమూ తప్పించజాలం అనే హిందూ కర్మ సిద్ధాంతం వైపునకు నా మనసునుlలాగుతూ ఉంది.
నిజానికి కాగ్ మొదట బొగ్గుగనుల కేటాయింపుల గురించి మాట్లాడినపుడు, ఇప్పుడు అనుసరించిన పద్ధతి కాకుండా వేలం పద్ధ తిని అనుసరించి ఉంటే దేశానికి ఇన్ని లక్షలకోట్ల లాభించి ఉండేవని అన్నదేకానీ ఇందులో వీరు అనుమానితులు అని ఎక్కడా అనలేదు. కేసు సీబీఐకి వెళ్లిన తరువాత ప్రస్తుత బీజేపీ పరిపాలనా కాలాన, కోర్టు హెచ్‌ఎస్ గుప్తా తదితరులకు జైలు శిక్షను ఖరారు చేసింది.
చిదంబరం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నపుడు రూపొందిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(ఛీ)(111) ప్రకారం అధికారులు తీసుకున్న చర్యల వల్ల ఎవరైనా ఆర్థిక లాభం పొందితే ఆ అధికారి లంచం తీసుకోకపోయినా అది నేరపూరిత చర్య అవుతుంది. ఐ్కఇలో నేరాన్ని రుజువు చేయడానికి మెన్స్ రియా (mens rea–అపరాధ భావన) ముఖ్యప్రాతిపదిక కాగా ఈ అవినీతి నిరోధక చట్టంలో మెన్స్ రియా లేకపోయినప్పటికీ శిక్ష పడిపోతుంది. మచ్చలేని ఉద్యోగ రికార్డ్ కలిగిన హెచ్‌ఎస్ గుప్తా ఈ చట్టం క్రింద శిక్షార్హుడవటం ఆయన సహచరోద్యోగులను తీవ్రంగా కలతపరిచింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ పనివిధానాలు, అధికారుల బాధ్యతలు, అవి నీతి నిరోధక చట్టం గురించి వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూ ఉంది. కేబినెట్ సెక్రటరీ ర్యాంకులో రిటైర్డ్ అయిన బీకే చతుర్వేది, నరేష్ చంద్ర వంటి వారు హరీష్ చంద్ర సత్యసంధతను ప్రస్తావిస్తూ కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడం గుర్తించాల్సిన విషయం. నరేష్ చంద్ర పెట్రోల్ పంపులు, ఎల్‌పీజీ కేటాయింపులలో అవకతవకలను గుర్తించి కోర్టు 2002లో అలాటి 3,760 కేటాయింపులను రద్దు చేసిందని, కానీ ఆయా బోర్డుల చైర్మన్‌లను అరెస్ట్ చేయలేదని, ఆ చైర్మన్లలో చాలామంది రిటైర్డ్ జడ్జీలని ఈ సందర్భంలో జ్ఞాపకం చేశారు.
ఒక కార్యానికి నాయకత్వం వహించే వ్యక్తి బాధ్యత అనే కాడెను భుజాన వేసుకుని కార్యరంగంలోకి దిగుతాడు. నాయకుడు దార్శనికుడై ఉండటమే కాదు గోడమీది పిల్లిలా కాకుండా అవసరమొచ్చినపుడు కష్టనష్టాలను అంచనావేసి రిస్కు తీసుకోగల ధీరత్వం కలవాడు కూడా అయి ఉండాలి. సివిల్ సర్వీస్ అధికారులకు ట్రైనింగ్ సమయంలో ప్రమాదభరితమయిన పర్వతాలను ఎక్కడమూ, గుర్రపు స్వారీ చేయడమూ, రివర్ రాఫ్టింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. దాని అర్థం వారు అప్పుడప్పుడూ సరదాగా గుర్రపు స్వారీ చేసుకోమని కాదు అవసరమొచ్చినప్పుడు ప్రజారక్షణార్ధం అన్ని విధాలా సిద్ధంగా వుండాలని. నా భర్త జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు గంగానది పోటెత్తి ఊళ్లని ముంచుతూవుంటే ఒక చిన్న తెప్పమీద వరద గంగపై చిన్న దీవి ప్రాంతానికి వెళ్లడం నాకు ఇప్పటికీ ఒళ్లు జలదరించే జ్ఞాపకం. అట్లాగే ఇంతకు ముందు ఎటువంటి విధివిధానాలు రాసి పెట్టి ఉండని బొగ్గుగనుల కేటాయింపులోని నిర్ణయాత్మక స్థానంలో నిలబడిన హరీష్ చంద్ర అతని కార్యవర్గం ఆ నిర్ణయాలను తీసుకున్నారు.
ఏ లాభమూ లేని చోటుకి వ్యాపారి రాడు. గనుల కేటాయింపుల్లో వ్యాపారికి లాభం జరిగి ఉండొచ్చు, కానీ దాని కోసమని ఏ గుప్తా లంచం తీసుకున్నట్లు అభియోగాలు కానీ, ఆధారాలు కానీ లేవు. అంతే కాదు, ఆయన ఉద్యోగ చరిత్రలో ఎక్కడా మచ్చ లేదు అయినా కోర్ట్ శిక్ష విధించింది. సంస్కృత న్యాయ సూక్తి కోశంలో ఒక మాట ఉంటుంది ‘‘కాకాక్షి న్యాయము’’ అని కాకి ఒకవైపు మాత్రమే చూడగలదు. అందుకని అది ఏం చూడదలచుకుంటుందో అటువైపే చూస్తుంది. కోర్టు హరీష్ చంద్ర సత్యసంధత చరిత్రను లెక్కలోకి తీసుకోకుండా శిక్షవిధించడం కాకాక్షి న్యాయం కిందికే వస్తుందని ప్రజలు అనుకోవడంలో తప్పులేదు.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంలో అవసరమయినపుడు, చురుకుగా నిర్ణయాలు తీసుకునే అధికారుల అవసరం ఎంతయినా ఉంది. ఏ క్షణం ఏమొస్తుందో, ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం మరో పదేళ్లకు జైలు శిక్ష కాటేస్తుందేమో అనే భీతి అధికారులలోకి ప్రవేశిస్తే వారు రిస్క్ చేయడానికి పూనుకోరు. నిజాయితీ పరుడయిన హరీష్ చంద్ర ప్రస్తుత స్థితి సివిల్ సర్వీస్ అధికారులలో ఈ భయానికి బీజం వేసింది. యూఎస్‌ఏ 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ "The only man who never makes a mistake is the man who never does anything'' అన్నారు నిజం కదా అసలు ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్లసలు ఏపని చెయ్యలేదని అర్థం. హెచ్‌ఎస్ గుప్తా చేసిన పనిలో పొరపాటు జరిగింది. తప్పుచేయాలనే ఉద్దేశం లేని చోట జరి గిన పొరపాటు శిక్షార్హం కాకూడదు.
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966
సామాన్య కిరణ్