పలమనేరు (చిత్తూరు జిల్లా) : రెండు రోజులు కళాశాలకు రాలేదని ఆగ్రహించిన అధ్యాపకుడు విద్యార్థితో 150 గుంజీళ్లు తీయించాడు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థి ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన రెడ్డెప్ప కుమారుడు భానుప్రసాద్ గంగవరంలోని సాయి చైతన్య కళాశాలలో ఇంటర్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ కళాశాలకు హాజరు కాలేదు. కళాశాల యాజమాన్యం విద్యార్థి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. కాగా గత శనివారం విద్యార్థి కళాశాలకు వచ్చాడు.
దీంతో అధ్యాపకుడు విద్యార్థిని 150 గుంజీళ్లు తీయాలని ఆదేశించాడు. బాలుడు 75 గుంజీళ్లు తీసి కిందపడిపోయాడు. అనంతరం తల్లిదండ్రులు అతన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతని నడుము పనిచేయక నడవలేకపోతున్నాడు. తిరిగి మూడు రోజుల క్రితం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కళాశాల యాజమాన్యం మాత్రం తమకు జ్వరం విషయం తెలియదని, పిల్లలు బాధ్యతగా ఉండాలనే గుంజీళ్లు తీయించమని చెప్పి ఉంటారని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెబుతోంది.
కాలేజీకి రాలేదని గుంజీళ్లు: ఆస్పత్రిపాలైన విద్యార్థి
Published Thu, Nov 26 2015 7:26 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement