మార్కులు తక్కువ వచ్చాయని కళాశాల చుట్టూ ఆరుసార్లు పరిగెత్తాలన్న లెక్చరర్
మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
మండపేట/తాడేపల్లి, న్యూస్‌లైన్: తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ విద్యార్థి గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కనకదుర్గమ్మ వారధి వద్ద కృష్ణా నదిలో శవమై కనిపించాడు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే బిడ్డను దూరం చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వీఎస్‌ఎం డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడైన కరుటూరి భాను సూర్యవంశీ(20) అదే పట్టణంలోని వీఎస్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో అతడితో పాటు మరో ఐదుగురిని సోమవారం కళాశాల చుట్టూ ఆరు రౌండ్లు పరుగెత్తాలని ఒక లెక్చరర్ పనిష్మెంట్ ఇచ్చారు. దాంతో మనస్తాపం చెందిన సూర్యవంశీ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తోటి విద్యార్థులను అడగ్గా పనిష్మెంట్ విషయం తెలిసిందని మృతుడి తాతయ్య పెనుమర్తి వెంకట్రావు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం కనకదుర్గమ్మ వారధి వద్ద కృష్ణా నదిలో సూర్యవంశీ మృతదేహం ఉన్నట్టు అక్కడి బంధువుల ద్వారా సమాచారం వచ్చినట్టు తెలిపారు. తన మనవడి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని వెంకట్రావు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అనుమానాస్పద మృతిగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం స్పందన కోసం ప్రయత్నించగా వారు అందుబా టులోకి రాలేదు. కాగా, ఇంజినీర్‌గా చూడాలనుకున్న ఏకైక తనయుడు విగతజీవిగా మారాడన్న చేదునిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.