
మహిళలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షబరిలో దిగినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారారు.
బ్రూక్ఫీల్డ్: అమెరికా అధ్యక్షబరిలో దిగినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారారు. మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భస్రావం చేయించుకునే మహిళలకు శిక్ష వేయాలని అన్నారు. అబార్షన్లు పరిపాటిగా మారుతున్నాయని, వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష మాత్రం పడాలని చెప్పిన ఆయన ఆ శిక్ష ఏమిటనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
విస్కాన్సిన్లోని ఓ చర్చా మందిరంలో క్రిస్ మాథ్యూతో చర్చ సందర్భంగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబార్షన్లను మీరు పూర్తిగా రద్దు చేయాలని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. అయితే, అది ఏ శిక్ష ఎంత తీవ్రతతో ఉండాలని అనే విషయం మాత్రం చెప్పలేదు. ఆయన ఇలా వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ గమనించాలని, వాటిని తలుచుకుంటేనే భయంకరంగా, చెత్తగా ఉన్నాయంటూ మండిపడ్డారు.