టీచర్ పనిష్‌మెంట్ ప్రాణం తీసింది
హోంవర్క్ చేయలేదని విద్యార్థినికి రెండు గంటలపాటు శిక్ష
⇒అస్వస్థతకు గురై వారం రోజులకు చిన్నారి మృతి
⇒కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వివేకవర్ధిని పాఠశాల నిర్వాకం
⇒స్కూలు ముందు చిన్నారి శవంతో బంధువులు, విద్యార్థి సంఘాల ఆందోళన
⇒పాఠశాలపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం
⇒30లోపు నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్‌కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు
హుజూరాబాద్ టౌన్: హోంవర్క్ చేయని పాపానికి టీచర్ విధించిన శిక్ష ఓ చిన్నారిని బలిగొంది! పసిపాప అని కూడా చూడకుండా ఏకంగా రెండు గంటలపాటు మోకాళ్లపై నిల్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించింది ఆ ఉపాధ్యాయురాలు. చిన్నారి బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొలిపాక సమ్మయ్య, రమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అక్షిత(12), అశ్రీత(10). సమ్మయ్య ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తా. రమ రజక వృత్తి చేస్తారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా ఇద్దరినీ పట్టణంలోని వివేకవర్ధిని అనే ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. అక్షిత ఆరో తరగతి, అశ్రీత ఐదో తరగతి చదువుతున్నారు.
ఈ నెల 16న స్కూల్లో గణితం బోధించే కళావతి అనే టీచర్.. హోంవర్క్ చేయలేదంటూ అశ్రీతను రెండు గంటల పాటు కదలకుండా మోకాళ్లపై నిల్చోబెట్టింది. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన అశ్రీత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కొద్దిసేపటికే మోకాళ్ల నొప్పి భరించలేక అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. స్కూలు కరస్పాండెంట్ ప్రసాద్ విద్యార్థిని ఇంటికి వచ్చి వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హోమియోపతి ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో వారు ప్రసాద్ చెప్పిన ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేరుుంచారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అశ్రీత గురువారం ఉదయం 7 గంటలకు మృతి చెందింది. అశ్రీత మృతి వార్త తెలియడంతో గురువారం పాఠశాలను తెరవలేదు.
మృతదేహంతో స్కూలు ముందు ఆందోళన..
అశ్రీత మృతికి టీచరే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. సమాధానం చెప్పేవారు ఎవరూ లేకపోవటంతో ఆగ్రహంతో తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎనిమిది గంటల పాటు ఆందోళన చేశారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ పాఠశాలకు వచ్చి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. శాంతించిన బంధువులు పోస్టుమార్టం బాలిక మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడ ప్రతి విద్యార్థికి దండనే?
వివేకవర్ధిని పాఠశాలలో హోంవర్కులు చేయకున్నా, సమయానికి రాకున్నా విద్యార్థులకు దండన తప్పడం లేదు. గుంజీలు తీయించడం, గోడ కుర్చీ వేయడం, మోకాళ్లపై నిలబెట్టడం, బెత్తం దెబ్బలు వంటి పనిష్‌మెంట్ ప్రతి రోజు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
30లోగా నివేదిక ఇవ్వండి: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
అశ్రీత మృతికి గల కారణాలను తెలుసుకుని ఈనెల 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఈవోలకు గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. స్కూళ్లల్లో పాఠాలు చెప్పేవారే రాక్షసులుగా మారి పిల్లల ప్రాణాలను బలితీసుకోవడం వంటి చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.