
ఈ కాలమ్ మీదే చర్చా వేదిక
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు.
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ,
సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com
కొద్దిమంది కాదు... చా...లా మంది!
యువతరం అంటే నిప్పుకణికలా ఉండాలి. శ్రీశ్రీ అన్నట్లు ‘నెత్తురు మండే... శక్తులు నిండే’ వాక్యంలా ఉండాలి. కదులుతున్న ఉద్యమంలా ఉండాలి. కానీ నేటి యువతను చూస్తే బాధగా ఉంది. మారోజుల్లో అయితే... పుస్తకాలు విపరీతంగా చదవడం, వాటి గురించి చర్చించుకోవడం, కొత్త పుస్తకం ఏదైనా వస్తే దాని గురించి ఆరా తీయడం, సామాజిక సమస్యలపై ఉద్యమాలు చేయడం, సృజనాత్మక రచనలు చేయడం... ఇలా ఉండేది.
కానీ, ఇప్పటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. నలుగురు యువకులు ఒకచోట కూర్చున్నారంటే... కొత్తగా విడుదలైన సినిమా గురించి మాట్లాడుకోవడం తప్ప ఏమీ ఉండడం లేదు. పుస్తకాలు చదవడం అనేది కలలో మాట. ఇక ‘సామాజిక సమస్యలు’ అనేవి వారికి సంబంధించినవి కావు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు.
ఇక సృజనాత్మక రచనల విషయానికి వస్తే... ప్రేమ కవితలు రాయడం, సినిమా కథలు రాయడాన్నే... సృజనాత్మకత అనుకుంటున్నారు. ఈ పరిస్థితి చూస్తే జాలేస్తుంది.
‘కొద్ది మంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అన్నారు అప్పుడు శ్రీశ్రీ.
ఇప్పుడు ‘కొద్ది’ స్థానంలో ‘చాలా మంది’ అనుకోవాలేమో!
ఈ పరిస్థితి మారదా? మారాలంటే ఏం చేయాలి?
- వఝల మోహన్‌రావు, కూకట్‌పల్లి, హైదరాబాద్
చెట్లను కూల్చేసే చాదస్తాలు అవసరమా?
ఈమధ్య కాలంలో చాలామందికి వాస్తుపిచ్చి పట్టుకుంది. ఇది గమనించి రెడీమేడ్‌గా వాస్తునిపుణులు పుట్టుకొస్తున్నారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ఇంటికి ఎవరినైనా వాస్తు నిపుణుడిని పిలిస్తే... కచ్చితంగా ఏదో ఒక మార్పు చెబుతున్నాడు. సరే, చిన్న చిన్న మార్పులు అంటే ఏదో పోనీలే... అనుకోవచ్చు. వారు చేసే కొన్ని సూచనల వల్ల పచ్చటి చెట్లు నాశనం అవుతున్నాయి. తద్వారా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది.
చాలా కాలం తరువాత మా పెద్దమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల ఇంటి దగ్గర్లో పెద్ద వేపచెట్టొకటి ఉండేది. ఆ వేపచెట్టుతో నా బాల్యజ్ఞాపకాలు ఎన్నో ముడిపడి ఉండేవి. అసలు మా పెద్దమ్మ వాళ్ల ఇల్లు అనగానే... ఆ వేపచెట్టు తప్పకుండా గురొస్తుంది. ఇంటి అడ్రస్ చెప్పడానికి కూడా ఆ పెద్ద వేపచెట్టు కొండ గుర్తుగా ఉండేది. కానీ మొన్న చూస్తే... ఆ చెట్టు నరికివేయబడి ఉంది!
నాకైతే ఏడుపొచ్చినంత పనైంది.
‘‘ఎందుకిలా చేశారు?’’ అని పెద్దమ్మను ఆవేదనగా అడిగాను. ‘‘అక్కడ చెట్టు ఉంటే అరిష్టమని... వాస్తు చూసే పెద్దమనిషి చెప్పాడురా. నిజంగానే, రెండు సంవత్సరాల నుంచి ఇంటికి శని పట్టుకుంది. అందుకే వేపచెట్టును కొట్టేయించాము’’ అని చెప్పింది. ‘‘ఇదెక్కడి మూఢత్వం? చెట్టు ఏ దిశలో ఉంటే ఏమిటి? అది ఏ దిశలో ఉన్నా... మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు’’ అని నా ఆవేదనను వెళ్లగక్కాను.మా పెద్దమ్మ మాత్రం పెద్దగా స్పందించలేదు. ‘‘మీ చదువుకున్న వాళ్లు అంతా ఇలానే మాట్లాడతారు’’ అన్నది పెద్దమ్మ.
ఆమె మాటలు ఎలా ఉన్నా... ఇప్పటికీ ఆ చెట్టు గుర్తుకు వచ్చి దుఃఖం వస్తుంది. మనం ఏ కాలానికి ప్రయాణిస్తున్నాం?!!
- డి.ఆర్.అర్జున్‌కుమార్, అనంతపురం
కొంత ‘అతి’ ఉంది... కొంత ‘నీతి’ ఉంది!
ఆ మధ్య ‘పీకే’ సినిమాపై చాలా వివాదమైంది. ‘‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి’’ అన్నవాళ్లూ ఉన్నారు, ‘‘అలాంటిదేమీ లేదు. ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లు చూపారు’’ అన్నవాళ్లు ఉన్నారు. ఏదీ వాస్తవమో ఏదీ అవాస్తవమో తెలియదు. ఎందుకంటే నేను ఆ సినిమా చూడలేదు. ఇక లాభం లేదనుకొని ఒక రోజు సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. అలా... సినిమాలు అంటే పెద్దగా ఇష్టపడని నేను, వీలు చూసుకొని ‘పీకే’ చూశాను.
చాలా పెద్ద హిట్ అయినట్లు ఆ సినిమా గురించి చెబుతున్నారు. నిజానికి కథాబలం పెద్దగా లేని సినిమా. ఇలాంటి వస్తువుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కథనే ప్రామాణికంగా తీసుకుంటే నిజానికి అంత పెద్ద హిట్ కావాల్సిన సినిమా కాదు. స్టార్ డెరైక్టర్, స్టార్ హీరో కాంబినేషన్‌తో పాటు... వివాదం కూడా ఆ సినిమాకు బాగా కలిసొచ్చింది.
సినిమాలో కొన్ని సన్నివేశాలు అతిగా అనిపించాయి. కొన్ని సన్నివేశాలు సూక్ష్మంగా నీతిని బోధిస్తున్నట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా భక్తిని వ్యాపారం చేసుకునే వారిపై వేసిన చురకలు బాగున్నాయి. అయితే అది ఒక్క మతానికే పరిమితం చేయడం బాలేదు.
- రావిపెద్ది అశోక్‌బాబు, విజయవాడ.
కఠిన శిక్షలు ఉండాలి!
ధూమపానం అనేది... అది సేవించే వాళ్లకి మాత్రమే ప్రమాదం కాదు... ఆ పరిసరాల్లో ఉన్న వాళ్లందరికీ ప్రమాదమే. కొందరి వల్ల ఇతరులు అనారోగ్యం పాలు కావడం అనేది ఏ రకంగా కూడా సమంజసం కాదు. సుతిమెత్తగా చెబితే వినే రోజులా ఇవి! అందుకే శిక్షలు కఠినంగా ఉండాలి. ఒక్కసారి సిగరెట్ తాగిన వాళ్లు - ‘‘ఇక జన్మలో సిగరెట్ తాగను బాబోయ్’’ అనే పరిస్థితి తెప్పించాలి. అప్పుడుగానీ పరిస్థితిలో మార్పు రాదు. ఇది నిజం.
- డి. సుభాషిణి, శ్రీకాకుళం