మహిళా సాక్షిగా! | Women as a witness! | Sakshi
Sakshi News home page

మహిళా సాక్షిగా!

Published Thu, Jun 9 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

మహిళా సాక్షిగా!

మహిళా సాక్షిగా!

ఆమె... పేరుకే సర్పంచ్...
పెత్తనం అంతా మిస్టర్ సర్పంచ్‌దే.
ఇదీ... మన దగ్గర సాగుతున్న
మహిళాసాధికారత.
ఇంటి పనికి జీతం ఉండదు...
ఇంట్లో జీతం తెచ్చే వాడిదే పై చేయి.
ఇదీ మన గృహిణికి ఉన్న ఆర్థిక సాధికారత.
సమాజంలో మహిళ వెతలకు అంతే లేదు.
ఆమె సమస్యలకు సమాధానం ఒక్కటే!
మహిళ ఇంకా ఇంకా ఎదగడం...
దేశ నిర్మాణంలో భాగం కావడం!
అందమైన... ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఆమె బలమైన ఇరుసు కావాలి.
అప్పుడే ఆమెకు... ఆర్థిక స్వావలంబన... సామాజిక గుర్తింపు... మానసిక వికాసం!!
ఆల్ ఇండియా ఉమెన్ జర్నలిస్ట్‌ల వర్క్‌షాప్... ఉద్దేశమూ అదే.
స్వతంత్ర భారతంలో ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిది!!

 

అధికార ముద్రిక ఆమె అయితే... ఆ ముద్రను వేసే చేయి మగవాడిది కాకూడదు. అధికారం నిజంగానే మహిళకు దక్కాలి. బస్తాల కొద్దీ పిస్తాలు రికార్డుల్లో మాత్రమే కాదు... పిల్లల చేతుల్లో ఉండాలి. ఒక మాట మహిళల కోసం... మరోమాట పిల్లల కోసం... ఈ రెండు మాటలు చెప్పింది కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ. ప్రదేశం... ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లోని ఈస్ట్ హాల్. తేదీ: జూన్ 7, 2016. ఉదయం పదిగంటల సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా విలేఖరుల సమావేశంలో అన్న ఈ మాటలు దేశమంతటికీ వర్తించేవి... అన్ని రాష్ట్రాలవారూ అనుసరించాల్సినవి. పదకొండు భాషల ప్రసారమాధ్యమాల నుంచి దాదాపుగా 250 మందికి పైగా మహిళా విలేఖరులు హాజరైన సందర్భంగా వారిని ఉద్దేశించి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రసంగిస్తూ అన్న మాటలివి.

 
దేశనిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి గడచిన రెండేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలతోపాటు మరికొన్ని కొత్త ప్రతిపాదనలను మహిళా విలేఖరుల ముందుంచారు మంత్రి. అమలులో అవసరమైన మార్పులు, సూచనలను స్వాగతించారామె. ‘సమాచారమే శక్తి. ఆ శక్తితో పురోగతి సాధించవచ్చు’ అంటూ సాగిన ప్రసంగంలో, మహిళా విలేఖరులు ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’కు సోషల్ ఏజెంట్‌లుగా సహాయసహకారాలందించాల్సిగా ఆమె కోరారు. మహిళలు, పిల్లల హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వివరాలను నేరుగా మంత్రిత్వ శాఖ నెట్‌వర్క్‌తో పంచుకోవడం ద్వారా త్వరితగతిన ప్రక్షాళన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఆరు గంటలు సాగిన సెషన్‌లో, దేశం నలుమూలలా మహిళలు, పిల్లలకు ఎదురవుతున్న సమస్యలను మనేకాగాంధీ ప్రస్తావించారు. తమ సందర్శన సందర్భంగా తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటనలను ఉదాహరించారు. పిల్లలకు పోషకాహారాన్ని పెట్టాల్సిన అంగన్‌వాడీ సెంటర్లు... పిల్లలకు రుచి, నాణ్యత లేని ఆహారం పెట్టడాన్ని, ఉత్తరాఖండ్‌లో దాబా నుంచి నూనెలో వేయించిన పదార్థాలు కొని పెట్టడాన్ని నిరసించారు. కర్ణాటకలో తనకు ఎదురైన చిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. ‘అక్కడి ఎన్‌జివో నిర్వహకులు పిల్లలకు పిస్తా, పండ్లు, గుడ్లు పెట్టారు ఆ రోజు. పిల్లలను పరిశీలిస్తే... రోజూ అలాంటి ఆహారం తీసుకుంటున్నట్లు ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. పోషకాహార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది’ అని చెప్పారు. కేవలం మంత్రి పర్యటించే రోజున మాత్రం పని చేసినట్లు కనిపించే చర్యలను తప్పుపట్టారు. తాను ప్రతిరోజూ పర్యటించి పరిశీలించడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి మహిళా విలేఖరులు వీటి మీద ఒక కన్ను వేసి ఏమైనా పొరపాట్లు దొర్లివుంటే మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ద్వారా తన దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు.  తల్లిపాలతో పిల్లలు ఆరోగ్యంగా పెరిగితేనే దేశం శక్తిమంతమవుతుందనీ, అందుకే ప్రసవించిన మహిళకు 26 వారాల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలనే నిబంధనను గుర్తు చేశారామె. వీటన్నింటినీ సక్రమంగా అమలయ్యేలా చూసే మరో నేత్రంగా విమెన్ మీడియా పనిచేయాలని,  మహిళల స్థితిగతులను మెరుగుపరచడంలో సహకరించాలని మనేకా గాంధీ కోరారు. ఇది మహిళల వికాసానికి మంత్రి హోదాలో ఓ మహిళ చేస్తున్న ప్రయత్నం.  - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

సంక్షేమం  కోసం...  పథకాలు...  ప్రతిపాదనలు!
జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015... కౌమారదశలోని పిల్లల నేరాన్ని బాల్యచేష్టగా పరిగణించడమా, శిక్షార్హమైన నేరంగా పరిగణించడమా అనేది విచక్షణతో వ్యవహరించాలి.  మిస్సింగ్, ట్రాఫికింగ్... పారిపోయిన పిల్లల కోసం ‘ఖోయా-పాయా’ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇందులో రైల్వేలతో ఒప్పందం కుదుర్చుకుని బోగీలకు వివరాల పట్టికను అతికిస్తారు. పారిపోయిన పిల్లలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరడానికి ఎన్నుకునే ప్రధాన రవాణా మార్గం రైల్వేలే అయి ఉంటాయి. అందుకే ప్రతి స్టేషన్‌లోనూ ఇలాంటి పిల్లలను గుర్తించి ప్రభుత్వ హోమ్‌లకు సమాచారం అందించి పిల్లలను చేర్చడానికి ఒక సెల్ ఏర్పాటు.

     
కాంప్రహెన్సివ్ అడాప్షన్ రిఫార్మ్స్... ఆర్థిక పరిపుష్టి ఉన్న దంపతులు తమ పిల్లలతోపాటు ఒక అనాథ బాలికను పెంచుకోవడాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో పాక్షిక దత్తతనూ ప్రోత్సహిస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సిఎస్‌ఆర్) ద్వారా కంపెనీలు కూడా అనాథ బాలికలను దత్తత తీసుకోవచ్చు. ప్రతి బాలికకూ ప్రభుత్వం ఒక  ఐడీ నంబరు ఇస్తుంది. స్కూల్‌లో చేర్చడానికి, ఇతర సౌకర్యాలకు ఆ ఐడి సరిపోతుంది.

   
నేషనల్ న్యూట్రిషన్ మిషన్... అంగన్ వాడీ సెంటర్ల మౌలిక సదుపాయాల పెంపు... పిల్లలకు అందుతున్న ఆహారంలో నాణ్యత, స్వచ్ఛ్ అంగన్‌వాడీ అభియాన్ ద్వారా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ రెమ్యూనరేషన్ వంటివి ఈ కార్యక్రమాల కింద ఉన్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ పథకాల ప్రచారంలో పని చేయించుకోవడం ద్వారా వాళ్లు పిల్లల సంరక్షణ మీద దృష్టి పెట్టలేకపోతున్నారని, వారికి అదనపు పనులు కేటాయించరాదనేది తప్పక పాటించాల్సిన నియమం. సాధారణంగా గ్రామానికి ఒక అంగన్‌వాడీ సెంటర్ ఉంటుంది. దాని పరిధిలో చిన్న చిన్న నివాస ప్రాంతాలు దూరదూరంగా ఉంటాయి. అలాంటి చోట్ల ఆ పిల్లలందరూ ఒక సెంటర్‌కు రావడం సాధ్యం కానప్పుడు మినీ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.జంక్‌ఫుడ్ గైడ్‌లైన్స్...  స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ అమ్మడం మీద నిషేధం విధించాలని ప్రతిపాదనలు ఉన్నాయి.

 

మహిళల  కోసం...
మొబైల్ ఫోన్‌లలో పానిక్ బటన్ ఏర్పాటు... ప్రత్యేకమైన యాప్ ద్వారా ప్రమాదం సంభవించినప్పుడు మొబైల్ ఫోన్‌లోని నిర్దేశిత బటన్ నొక్కితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌తోపాటు సమీపంలో ఉన్న పది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులకు సమాచారం అందుతుంది.మహిళా-ఇ-హాట్... మహిళలు ఇంట్లోనే ఉండి తమకు చేతనైన పనులు చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. ఇతర మెళకువలేమీ లేకపోయినా సరే... స్వీట్లు, మురుకుల వంటి తినుబండారాలు చేయడం మాత్రమే వచ్చిన వాళ్లు కూడా ఈ-మార్కెటింగ్ వెబ్‌సైట్‌లతో కనెక్ట్ అవుతారు. బేటీ బచావో బేటీ పడావో... ఆడబిడ్డను రక్షించాలి, చదివించాలని సమాజాన్ని చైతన్యవంతం చేసే క్యాంపెయిన్. స్వచ్ఛ భారత్‌లో భాగంగా బాలికలున్న అన్ని స్కూళ్లలో టాయిలెట్‌ల నిర్మాణం దీని లక్ష్యం.

     
వితంతువుల పునరావాసం...  యూపీలోని బృందావనంలో పిల్లలు వదిలేసిన మహిళల కోసం హోమ్. ఇతర చోట్ల అలాంటి హోమ్‌ల అవసరాన్ని గుర్తించి నిర్మించాలి.ఉమెన్ హెల్ప్‌లైన్... మహిళల హక్కుల కోసం సలహాలు, సహాయం కోసం పని చేస్తుంది.హెరాస్‌మెంట్ ప్రివెన్షన్ సెల్... పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టడానికి  ఉద్దేశించిన‘సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్ 2013’ ప్రకారం... ప్రతి ఆఫీసులోనూ ఒక  సెల్ ఏర్పాటయ్యే వరకు మహిళలు ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలి.పోలీసు నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ ... చట్టాన్ని ఆశ్రయించిన మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడడం వంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలి.

     
హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ అచీవర్స్ కాంటెస్ట్... నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ వంటి సంస్థాగతమైన అంశాలతోపాటు మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ల వాడకంలో చట్టపరమైన నిబంధనలు రూపొందాలి. ఈ వెబ్‌సైట్‌ల ద్వారా మగవాళ్లు మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రశ్నలు వేయడాన్ని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు (ఒక పెళ్లి కొడుకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఒక అమ్మాయితో ‘పెళ్లికి ముందు శీల పరీక్షకు సిద్ధమేనా’ అని అడిగిన సంగతి ప్రస్తావించారు మనేక).

 
పంచాయితీరాజ్‌లో మహిళా ప్రతినిధులకు శిక్షణ... ప్రభుత్వ పథకాలు, వాటిని ఏయే కార్యాలయాల ద్వారా చేయించుకోవాలనే అంశాల్లో శిక్షణ ఇవ్వడం, ఒక యాప్ ద్వారా మహిళా ప్రతినిధులను కనెక్ట్ చేయడం, ‘సర్పంచ్‌పతి’ విధానానికి అడ్డుకట్ట వేయడం ద్వారా మహిళల రిజర్వేషన్‌ను పటిష్టంగా అమలు చేయడం.

     
మహిళల పని వేళలు... రాత్రిళ్లు పని చేయాల్సిన ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక సదుపాయాల కల్పన, మహిళల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ‘లో నెక్ బ్లవుజ్, పొట్టి దుస్తులు’ అనే నేలబారు వ్యాఖ్యానాల నిరోధానికి పటిష్టమైన చట్టాల ఆవశ్యకత వంటి అనేక ప్రతిపాదనలతోపాటు నారీ శక్తి పురస్కారాన్ని ప్రస్తావించారు. ఇందులో అభ్యుదయ రీతిలో వ్యవహరించిన మహిళలకు మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. ఈ ఏడాది కూతుళ్లిద్దరినీ రైఫిల్ షూటర్‌లను చేసి ఒక మహిళకు పురస్కారం అందించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అర్హులైన మహిళలను గుర్తించి వారి వివరాలను మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయవలసిందిగా మహిళా విలేఖరులను కోరారు మనేకా గాంధీ. ఫేస్‌బుక్ యూజర్సే ఈ ఎంట్రీలకు న్యాయనిర్ణేతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement