'ఆ మగవాళ్లు రాబోతున్నారు..' | There will be men willing to take care of the responsibilities of the house without a job ... | Sakshi
Sakshi News home page

'ఆ మగవాళ్లు రాబోతున్నారు..'

Published Sat, Feb 20 2016 9:10 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

'ఆ మగవాళ్లు రాబోతున్నారు..'

'ఆ మగవాళ్లు రాబోతున్నారు..'

ఉద్యోగం చేయకుండా ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి సిద్ధపడే మగవాళ్లు రాబోతున్నారు... ఈ ట్రెండ్‌కు సమాజం  సిద్ధంగా ఉందా?
 
భవిష్యత్తులో ‘ఇంటికి దీపం ఇంటాయనే’ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి... ఇంటాయనే ఈ జగతికి జీవన జ్యోతి’ అని పాడుకోవాల్సి ఉంటుంది.  అబ్బాయే పుడతాడు... అచ్చు నాన్నలాగే ఉంటాడు... పుట్టాడు. నాన్నలాగే స్కూల్‌కు వెళ్లాడు. నాన్నలాగే టెన్త్ రాగానే లుంగీ కట్టుకున్నాడు.నాన్నలాగే డిగ్రీ సర్టిఫికెట్ నడుము వరకూ కట్టించిన ఫ్యాంట్ మీద టక్ చేసి అందుకున్నాడు. ఇంకేముంది- నాన్నలాగే పెళ్లి చేసుకున్నాడు. నాన్నలాగే ఆఫీసుకు వెళ్లి.. వెళ్లి... వెళ్లి... జీవితాంతం సంపాదించి పోషించి ఒక రోజుకు బాల్చీ తన్నేస్తూ.... వాట్ నాన్సెన్స్. నేను నాన్నలాగా ఉండను. మరి? అమ్మలాగా ఉంటాను. అంటే? తాళి కట్టించుకుని హౌస్‌వైఫ్‌లాగా ఉంటాను.మరి తిండి? నా పెళ్లాం సంపాదిస్తుందిగా.  ఓరి నాయనోయ్... ఇదేం ట్రెండు?
    
‘సీతాపతి సంసారం’ సినిమా అప్పుడెప్పుడో వచ్చింది. ‘మిస్టర్ పెళ్లాం’... నిన్న మొన్న వచ్చింది. ఇప్పుడు ‘కీ అండ్ కా’ వస్తోంది. అంటే చివరలో ‘కీ’ ఉండేది ‘లడకీ’. చివర ‘కా’ ఉండేది ‘లడకా’. పాత సినిమాల్లో భర్తలు తమ ఉద్యోగం పోగొట్టుకొని భార్యల సంపాదన మీద ఆధారపడి ఇళ్లల్లో ఉంటారు. కాని ఈ సినిమా అలా కాదు. హీరో- మిస్టర్ వాలి. అంటే పెళ్లయ్యాక పెళ్లాం మీద వాలిపోవాలని ముందే నిర్ణయించుకుని ఉంటాడు. ‘నేను మగాణ్ణే. ఆడవాళ్లంటే ఇష్టం. విస్కీ అంటే ఇష్టం. కాని ఉద్యోగం అన్నా కెరీర్‌లో పరుగులాట అన్నా టెన్ టు ఫైవ్ జాబ్ అన్నా అసహ్యం. అందుకే పెళ్లయ్యాక హాయిగా మా అమ్మలాగా ఇంట్లో ఉండిపోతా. నా భార్యకు వంట చేసి పెడతా. బట్టలు ఉతికి పెడతా. రోజువారీ పనులతో హ్యాపీగా ఉండిపోతా’ అనేది ఇతని ఫిలాసఫీ. ఊరికే ఆషామాషీకి కాదు. బాగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని వెతుకుతాడు. తానే ఆ అమ్మాయి చేత తాళి కట్టించుకుంటాడు.ఉదయాన్నే ఇంట్లో అత్తగారి కాళ్లకు నమస్కారం పెట్టి వంట గదిలోకి వెళతాడు. పాత్రలు తారుమారైన ఈ కథ ఏప్రిల్ ఒకటిన వెండి తెర మీద భారతీయుల కొత్త సంసారానికి తెర తీయనుంది.
    
ప్రకృతి అంతా పునరావృతం అని అంటారు. ఇప్పుడు సమాజం ఆ వైపునే నడుస్తున్నట్టుంది. ఒకప్పుడు మాతృస్వామ్యం ఉండేది. భర్త ఇంట్లో ఉంటే భార్య వేటకు వెళ్లేది. గుంపును నిర్వహించేది. గూడేనికి నాయకత్వం వహించేది. కాని క్రమక్రమంగా పురుషుడు పై చేయి తీసుకున్నాడు. బలం తెచ్చుకున్నాడు. కండలు పెంచాడు. స్త్రీ మీద పెత్తనం చేస్తూ ఆమెను వంటింటికి పరిమితం చేశాడు. బజార్లు, హైవేలు, ఆఫీసులు, బ్యాంకులు అన్నీ తన పేరున మార్చుకున్నాడు. కొంతకాలానికి ఇంకా ఎంతకాలం అని స్త్రీలు హూంకరించారు. మమ్మల్ని పని చేయనివ్వండి... మగవాళ్లతో మేము కూడా సమానం అని నిరూపించనివ్వండి అన్నారు. ఫెమినిస్టిక్ ఉద్యమాలు వచ్చాయి. హక్కుల సాధన మొదలయ్యింది. ఇప్పుడు మగవాళ్ల వంతు వచ్చింది.

ఎన్నాళ్లీ బానిస బతుకు అని వాళ్లు నినదిస్తున్నారు. పోషించే బాధ్యత మాకే ఎందుకు అంటున్నారు. ఈ పోషణ భారం వల్ల తప్పనిసరిగా ఉద్యోగం చేయాలి. తప్పని సరిగా ఆఫీసులో తిట్లు తినాలి. తప్పనిసరిగా కెరీర్‌లో పరుగుతీయాలి. తప్పనిసరిగా వత్తిడి ఎదుర్కోవాలి. ఇంక చాలు. మేము ఇల్లు చూసుకుంటాం... మీరు ఆఫీసులకు వెళ్లండి అంటున్నారు.  అందుకు ఒక నమూనా ‘కీ అండ్ కా’ సినిమా.
    
అయితే ఇదంతా సులువే అనుకుంటే మీరు ప్యాంట్‌లో కాలేసినట్టే.ఆడది బయటికెళ్లి ఉద్యోగం చేస్తానంటే ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యాయో మగాడు కూడా ఇంట్లో అర్ధాంగుడుగా మారతానంటే అన్నేనిరోధకాలు ఎదురవుతాయి.‘ఏం... నువ్వు మగాడివి కాదా?’
 ‘ఆడదాని సంపాదన తిని కూచోడానికి సిగ్గు లేదూ?’ ‘నీలాంటి మగాణ్ణి ఆడంగి వెధవ అని తిడతారు తెలుసా?’ఈ అవమానాలన్నీ పడాలి. అందుకే ఈ సినిమా తన ట్యాగ్‌లైన్‌ని ‘స్త్రీలింగ్ పుంలింగ్ సేమ్‌థింగ్’ అని పెట్టుకుంది. స్త్రీ లింగమైనా పురుష లింగమైనా సమానమే... వీలును బట్టి బాధ్యతలు పంచుకోవచ్చు... ఒకరి బాధ్యత తక్కువ కాదు... ఒకరి బాధ్యత ఎక్కువ కాదు అని ఈ సినిమా చెప్పదలచుకుంది. స్త్రీ ఇంట్లో ఉండటం తక్కువ రకంగా చూడటం ఎంత తప్పో పురుషుడు ఇంట్లో ఉండటం తక్కువ రకంగా చూడటం అంతే తప్పు. పని చేసే విషయంలో కూడా ఇదే రూల్.  
   
రోజులు ఇలాగే కంటిన్యూ అయితే చాలానే మార్పులు వస్తాయి. భవిష్యత్తులో ‘ఇంటికి దీపం ఇంటాయనే’ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి... ఇంటాయనే ఈ జగతికి జీవన జ్యోతి’ అని పాడుకోవాల్సి ఉంటుంది. ‘ఇంటిని చూసి ఇంటాయన్ను చూడమన్నారు’ అని సామెతలు మార్చుకోవాలి. ఈ ఫార్ములా సక్సెస్ అయితే ఉద్యోగం చేసే భార్యలను వెతుక్కుని ఇళ్లల్లో ఉండిపోయే భర్తలు తయారైతే కిట్టీ పార్టీలు వారివే. టీవీ సీరియల్స్ వారివే. నోములూ వ్రతాలు చేసి ‘పుణ్యం కొద్దీ వర్కింగ్ వైఫ్... దానం కొద్దీ లవ్‌లీ చిల్డ్రన్’ అని మొక్కుకోవాల్సి వస్తుంది. జంబలకిడిపంబ ఒకప్పుడు కామెడీ. ఇప్పుడు చాలా సీరియస్ ఎఫైర్ గురూ.
- నెటిజన్ కిశోర్
 

కొత్త ట్రెండేమీ కాదు
ఎవరు ఏ పనినైనా పంచుకోవచ్చు. మగవాళ్లు ఇంటి బాధ్యతలను పంచుకోవడమనేది కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏమీకాదు. ఎప్పటి నుంచో ఉంది. స్త్రీలను గౌరవించే మగవాళ్లందరి ఇళ్లల్లో ఉంది. ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉన్న కుటుంబాల్లో ఆమెను గౌరవించే ప్రతి పురుషుడు ఇంటి పనులను పంచుకుంటున్నాడు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. దాన్ని అలాగే చూడాలి. ఇదేదో కొత్త ధోరణి అని వింతగా, ఎక్సైట్‌మెంట్‌గా, అసహజమైన విషయంగా ఫీలవ్వాల్సిన అవసరంలేదు.  - దేవి, సామాజిక కార్యకర్త
 
అలాంటి మగవాడిని అమ్మాయి ఇష్టపడదు
పురుషుడు చేయాల్సిన పనులను పురుషుడే చేయాలి.. స్త్రీలు చేయాల్సిన పనులు స్త్రీలే చేయాలనేది ప్రకృతి ధర్మం. పురుషుడు పురుషుడిలా.. స్త్రీ స్త్రీలా ఉంటేనే అందం. ఎవరి ధర్మం వాళ్లు నిర్వర్తిస్తేనే ప్రకృతి సమన్వయం. పురుషుడు స్త్రీలా ప్రవర్తించగలడేమో కానీ ఆమెకు మాత్రమే సాధ్యమైన కొన్ని పనులను చేయలేడు. నాకు తెలిసి సగటు స్త్రీ సైకాలజీ ప్రకారం హౌస్ హజ్బెండ్‌ని ఏ అమ్మాయీ యాక్సెప్ట్ చేయదు. మగవాడిగా స్వీకరించదు.  కాబట్టి ఇలాంటి ట్రెండ్ కాస్త ఇబ్బందే. అయితే.. పురుషుడు స్త్రీ బాధ్యతలను పంచుకోవాలి... ఆమెను గౌరవించాలి.. ఆమెకు సహకరించాలి. స్తీ, పురుషులు విడివిడిగానే కలిసి ఉండాలి.  - పి. శివపార్వతి, ప్రముఖ నటి.
 
ఇన్‌సల్ట్
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. కాబట్టి మగవాడు ఉద్యోగం చేస్తేనే గౌరవం. అదీగాక.. అమ్మాయిలు బయట పనుల్లో అబ్బాయిలతో పోటీపడి గెలిచినట్టు అబ్బాయిలు ఇంటిపనుల్లో అమ్మాయిలతో పోటీపడలేరు. వర్కింగ్ ఉమెన్ అనేది అమ్మాయికి ఓ గౌరవం. కానీ హౌస్ హజ్బెండ్ అనే హోదా అబ్బాయికి ఇన్‌సల్టే. నా వరకు నేనైతే ఇంటిపట్టున ఉంటూ ఇంటి బాధ్యతలను చూసుకోవడాన్ని నామోషీగానే భావిస్తాను. ఇంటి పనుల్లో ఆమెకు సహాయం చేయడం వేరు.. హౌస్ హజ్బెండ్‌గా స్థిరపడడం వేరు. ఇలాంటి ట్రెండ్ మగవాళ్లకు ఇన్‌సల్టే!
 - సతీష్ సమయం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement