
మెజారిటీ ఉద్యోగుల మనోగతం
కొద్ది మందిలోనే సంతృప్త స్థాయి
పనికి తగ్గ చెల్లింపుల్లేవన్న అసంతృప్తి
జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడి
ముంబై: ఉద్యోగులు పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకునే విషయంలో సంతృప్తిగా లేనట్టు మానవ వనరుల పరిష్కారాలు అందించే జీనియస్‌కన్సల్టెంట్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. పని వేళలు సౌకర్యంగా లేకపోవడంతో రెండింటిని సమతుల్యం చేసుకోలేకపోతున్నామని 52 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేసిన ఉద్యోగులు 36 శాతమే ఉన్నారు. అంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరే ఉద్యోగం–వ్యక్తిగత బాధ్యతల నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న 2,763 మంది ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని జీనియస్ కన్సల్టెంట్స్ ఈ నివేదికను విడుదల చేసింది.
ఉద్యోగుల మనోగతం..
→ వ్యక్తిగత బాధ్యతల నిర్వహణకు వీలుగా సౌకర్యవంతమైన పనివేళలు/రిమోట్ వర్కింగ్‌కు (ఉన్నచోట నుంచే పనిచేయడం) యాజమాన్యాలు అనుమతించడం లేదని 40 శాతం మంది ఉద్యోగులు తెలిపారు.
→ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగ బాధ్యతల తాలూకు ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు 79 శాతం మంది చెప్పారు. మెరుగైన విధానాలు, వ్యవస్థల ఏర్పాటు ద్వారా యాజమాన్యాలు పని ప్రదేశాల్లో ఒత్తిడిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది.
→ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో యాజమాన్యాలు తగినంత వెసులుబాటు ఇస్తున్నట్టు 50 శాతం మంది ఉద్యోగులు చెప్పగా.. 10 శాతం మంది ఏదీ చెప్పలేకున్నారు. → కెరీర్‌లో పురోగతికి వీలుగా తాము పనిచేసే చోట తగిన అవకాశాల్లేవని 47 శాతం ఉద్యోగులు వెల్లడించారు.
→ తమ మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే మరింత సంతోíÙస్తామని 89 శాతం ఉద్యోగులు చెప్పారు.
→ ఉద్యోగం కోసం తాము వెచ్చిస్తున్న సమయం, కృషికి తగ్గ వేతనాలను కంపెనీలు చెల్లించడం లేదని 68 శాతం మంది భావిస్తున్నారు. ఇది పనిలో అసంతృప్తికి దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది.
కంపెనీలు సమీక్షించుకోవాల్సిందే..
‘‘ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివేళలు, కెరీర్‌లో పురోగతి, మానసిక ఆరోగ్యపరమైన మద్దతు విషయంలో కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. పని–ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉద్యోగుల శ్రేయస్సుకే కాకుండా, దీర్ఘకాలంలో కంపెనీ వ్యాపార విజయానికి తోడ్పడుతుంది’’అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్, ఎండీ ఆర్‌పీ యాదవ్ తెలిపారు.