
ఇన్ఫీ నారాయణ మూర్తి వ్యాఖ్యలు
ముంబై: ఉచిత పథకాలతో కాకుండా ఉద్యోగాల కల్పనతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్న వ్యాపారాలను సృష్టించి, ఉద్యోగాలు కల్పిస్తే పేదరికం ఇట్టే మాయమైపోగలదని ఆయన చెప్పారు. టైకాన్ ముంబై 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మూర్తి ఈ విషయాలు తెలిపారు.
ఎంట్రప్రెన్యూర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘మీలో ప్రతి ఒక్కరు వందలు, వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలరనడంలో నాకెలాంటి సందేహం లేదు. పేదరిక సమస్యను ఆ విధంగానే పరిష్కరించగలం. ప్రపంచంలో ఏ దేశమూ ఉచితాలివ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించిన దాఖలాల్లేవు’ అని తెలిపారు. కొన్ని ఉచితాలు ఇచ్చినా వాటికి బదులుగా నిర్దిష్ట ప్రయోజనాలను రాబట్టే విధంగా అవి ఉండాలని పేర్కొన్నారు.
ఉదాహరణకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తే, ఓ ఆరు నెలలు పోయాక ఆ ఇళ్లలోని పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటున్నారా, పిల్లలపై తల్లిదండ్రుల ఆసక్తి మరింత పెరిగిందాలాంటి అంశాలపై ప్రభుత్వం ఓ సర్వేలాంటిది చేయడం ద్వారా సదరు పథకం ప్రయోజనాలను మదింపు చేయొచ్చని మూర్తి చెప్పారు. మరోవైపు, రాజకీయాలు లేదా గవర్నెన్స్ గురించి తనకు పెద్దగా తెలియదని, కేవలం విధానాలపరంగా తీసుకోతగిన చర్యలను మాత్రమే సూచించానని ఆయన వివరణ ఇచ్చారు.