
అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి
=హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు
దుండిగల్, న్యూస్‌లైన్: పెళ్లైన పది నెలలకే ఓ యువతి అనుమానాస్పదస్థితిలో ఉరేసుకొని మృతి చెందింది. హత్యా, ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా పాలకోడూరు మండలం మొగల్లు గ్రామానికి చెందిన సూర్యనారాయణ రాజు, అనంతలక్ష్మిల కుమారుడు పెనుమచ్చ సుబ్రహ్మణ్య కుమార్‌రాజుకు అదే మండలం ఈడూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, సీతాదేవిల కుమార్తె పావని(22)తో ఈఏడాది ఫిబ్రవరి 13న పెళ్లైంది.
మూడు నెలల క్రితం సుబ్రహ్మణ్యరాజు భార్య పావని, తన తల్లిదండ్రులతో కలిసి బాచుపల్లి రామచంద్రారెడ్డినగర్ కాలనీలోని వైష్ణవి సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని పెంట్‌హౌస్‌లో అద్దెకుంటున్నాడు. సుబ్రహ్మణ్యరాజు మెదక్ జిల్లా జిన్నారంలోని ఎన్‌వీ ప్రసాద్ క్వారీలో సూపర్‌వైజర్ కాగా.. అతని తండ్రి అక్కడే మెస్‌లో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సుబ్రహ్మణ్యరాజు తల్లి అనంతలక్ష్మి తమ స్వగ్రామానికి వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సుబ్రహ్మణ్యరాజు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాడు.
అదే రోజు రాత్రి 8 గంటలకు మామ సూర్యనారాయణరాజు ఇం టికి రాగా తలుపునకు బయట నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో అతను గడియ తీసి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని కోడలు పావని కనిపించింది. వెంటనే అతను తన కుమారుడితో పాటు చుట్టు పక్కల వారికి ఈ విషయం చెప్పాడు. సమాచారం అం దుకున్న దుండిగల్ పోలీసులు శవాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు సందర్శించారు.
పోలీసు జాగిలాలను రప్పించగా అవి అపార్ట్‌మెంట్‌లోనే తిరిగాయి. ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు సేకరించారు. కాగా, పావని మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేరారు. అంతేగాక ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది ఆత్మహత్యగా ఇంకా నిర్ధారణకు రాలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది తెలుస్తుందని దుండిగల్ సీఐ బాలకృష్ణ తెలిపారు.